ములుగు రూరల్, జనవరి 18 : ములుగు జిల్లా ములుగు మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామం రాయినిగూడెం గ్రామానికి చెందిన వజ్జ నిఖిల్‌కుమార్ అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లు పాల్గొన్న మారథాన్‌లో మెరిశాడు. ఆదివారం ముంబై వేదికగా జరిగిన టాటా ముంబై మారథాన్‌లో పాల్గొని 42 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి తన కలను సాకారం చేసుకున్నాడు.
అలాగే అతడు 18 రోజుల వ్యవధిలోనే మూడు కీలక మైలురాళ్లను అధిగమించాడు. 4న చైన్నైలో ఫ్రెష్వాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఈవెంట్లో 32 కిలోమీటర్ల లాంగ్ రన్లో విజయం సాధించిన అతడు.. 11న చెన్నైలోనే జరిగిన 5150 ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్లోనూ సత్తాచాటాడు. ఇందులో 1.5 కిలోమీటర్ల ఈత, 40 కిలోమీటర్ల సైక్లింగ్, 10 కిలో మీటర్ల పరుగును విజయవంతంగా పూర్తి చేశాడు. ఇక ముంబై మారథాన్లోనూ ప్రతిభ చాటడంతో రాయినిగూడెం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.