వాషింగ్టన్: భారత్‌లో కృత్రిమ మేధ(ఏఐ) సేవల కోసం అమెరికా వనరులను ఎందుకు ఉపయోగించాలని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ప్రశ్నించారు. ఇటీవల ‘రియల్ అమెరికాస్ వాయిస్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ చాట్‌జీపీటీ లాంటి ఏఐ ప్లాట్‌ఫామ్స్ అమెరికా కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని.. అయితే వాటి యూజర్లు మాత్రం చైనా, భారత్‌లో ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఈ సేవల కోసం అమెరికా విద్యుత్తును ఎక్కువగా ఉపయోగిస్తున్నారన్నారు. ‘ఇండియాలో ఏఐ కోసం అమెరికన్లు ఎందుకు చెల్లిస్తున్నారు’ అని ఆయన ప్రశ్నించారు. ఏఐ డాటా సెంటర్లు భారీగా విద్యుత్తును వినియోగించుకోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ట్రంప్ గాజా బోర్డులోకి భారత్‌కు ఆహ్వానం
వాషింగ్టన్ : గాజా శాంతి బోర్డులో చేరాలని భారత దేశాన్ని అమెరికా ఆహ్వానించింది. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధాన్ని ఆపడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రణాళికను రచించారు. దీనిలోని రెండో దశలో భాగంగా ఈ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ట్రంప్ గురువారం ప్రకటించారు. గాజాలో రోజువారీ వ్యవహారాలను నిర్వహించే టెక్నోక్రాటిక్ కమిటీని ఈ బోర్డు పర్యవేక్షిస్తుంది. ఈ బోర్డులో చేరాలని తమకు కూడా ఆహ్వానాలు అందినట్లు జోర్డాన్, గ్రీస్, సైప్రస్, పాకిస్థాన్, కెనడా, తుర్కియే, ఈజిప్ట్, పరాగ్వే, అర్జెంటినా, అల్బేనియా తెలిపాయి. అమెరికన్ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, 1 బిలియన్ డాలర్లు చెల్లించి ఈ బోర్డులో శాశ్వత సభ్యత్వం పొందవచ్చు.