ఒక వ్యక్తి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయమే తెలంగాణ అవతరణకు దారితీసింది. ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి అయ్యారు. ఉద్యమ సమయంలో చెప్పుకున్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోయాయి. కలగన్న పచ్చని తెలంగాణ ఆవిష్కారమైంది. దేశానికే మన రాష్ట్రం ఆదర్శమవుతున్నది. టీఆర్ఎస్ 21వ ప్లీనరీ దేశ రాజకీయాలకు మార్గనిర్దేశం చేస్తుందన్న ఆశ, ఆసక్తి నెలకొన్నది.ఈ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావం గురించి మరికొంత..
అది 2001. జనవరి నుంచి మార్చి నెలల్లో తెలంగాణ ఉద్యమానికి సన్నాహాలు జరుగుతున్న కాలం. డిప్యూటి స్పీకర్‌గా పనిచేస్తున్న కేసీఆర్ కవులు, కళాకారులు, మేధావులతో చర్చిస్తున్నట్లు, ఆడియో క్యాసెట్లు రూపొందిస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. తెలంగాణ వాదులకు ఒక పక్క సంతోషం, మరోపక్క సందేహాలు. క్యాబినెట్ ర్యాంకుతో మంత్రిగా ఉన్న కేసీఆర్ సీఎం చంద్రబాబును ఎదిరించి బయటకు వస్తారా? తెలంగాణ అంటారా? అనేకానేక సందేహాలు…
కేసీఆర్ కచ్చితంగా తెలంగాణ ఉద్యమంలోకి వస్తారని తెలిశాక ఒక సుధీర్ఘ ఉత్తరం రాసి ఆయనకు రిజిష్టర్ పోస్టు లో పంపాను. తర్వాత సంతోషన్నతో ఫోన్లో మాట్లాడితే ‘నీ ఉత్తరం సార్ చదివారు సంతోషించారు. ఒక్కసారి వచ్చి కలిసిపో’ అని చెప్పడంతో 2001 ఏప్రిల్ 26న మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన నివాసానికి వెళ్లిన. ఓ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ వచ్చి ప్రశ్నించి నిలిపేస్తే, అప్పుడు ఒక మంత్రి పీఆర్వోగా పని చేస్తున్న నేను డిప్యూటీ స్పీకర్‌కు లెటర్ ఇవ్వడానికి అని చెప్పి లోపలికి వెళ్లిన. అప్పట్లో 24 గంటలూ కేసీఆర్ ఇంటిచుట్టూ నిఘా. అప్పుడు గదిలో హరీష్‌రావు, ఇన్నయ్య, దివంగత నిమ్మ నర్సింహారెడ్డి, ఎలిమినేటి కృష్ణారెడ్డి ఉన్నారు. ఉద్యమానికి మద్దతు తెలుపవలసిందిగా ప్రతిపక్ష నేతలకు ఫోన్ చేసి కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఒక స్పష్టమైన నమ్మకంతో, పట్టుదలతో, విజయంపై అత్యంత విశ్వాసంతో కార్యాచరణను, ఆచరించాల్సిన పద్ధతులను వివరిస్తున్నారు.
‘సాయంత్రం చింతమడక బయలుదేరి పొద్దునే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని, హైదరాబాద్ వస్తా. నాంపల్లి దర్గాను దర్శించుకుని, అమర వీరుల స్తూపానికి నివాళి అర్పించి, జలదృశ్యంలో మధ్యా హ్నం 12గంటలకు సమావేశం ఉంటుంది. అక్కడ కలుద్దాం’ అని ఫోన్లు చేసిన వారికి చెబుతున్నారు.
2001 ఏప్రిల్ 27 జలదృశ్యం..
కేసీఆర్ హైదరాబాద్ నాంపల్లి దర్గా దగ్గరికి చేరేసరికి జన సందోహం. భారీ ర్యాలీతో దర్గా నుంచి అమరుల స్తూపానికి దండం పెట్టుకొని జలదృశ్యం చేరేసరికి జనమే జనం. అడ్వకేట్లు, విద్యార్థులు, యువకులు భారీగా తరలి వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కొందరున్నారు. రాష్ర్ట రాజకీయాలను మలుపుతిప్పే పరిణామం సంభవించబోతున్నదన్న విషయం అప్పుడే అర్థమైంది.
సరిగ్గా అదే సమయానికి అవతల సచివాలయంలో క్యాబినెట్ సమావేశం. ఆ సమావేశంలో అదే చర్చ. పార్టీకి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేస్తాడని భావించిన టీడీపీ వర్గాలు, కేసీఆర్ శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడని తెలిసి ఆశ్చర్యపోయారు. నిజంగా ఆనాడు అది సాహసోపేతమే. మూడు పదవులకు ఏకంగా రాజీనామా చేయటం కేసీఆర్ తెగువ, ధైర్యాన్ని, తెలంగాణ పట్ల ఆయనకున్న నిబద్ధతను చాటాయి.
ఇక అక్కడి నుంచి జరిగిన పలు విషయాలు చరిత్రే. ఎన్ని అవాంతరాలెదురైనా గమ్యా న్ని ముద్దాడతానని, తెలంగాణ తెస్తానని వెల్లడించిన కేసీఆర్.. మాట నిలుపుకున్నా రు. తెలంగాణ ఒక సామూహిక స్వప్నం. తెలంగాణ సాకారం చేసి చూపించిన కార్యసాధకుడు కేసీఆర్. ఏప్రిల్ 27 తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
-సురేష్ కాలేరు
98661 74474