జాతి మూలుగులే ఉద్యమశ్వాసలు
జాతి జనుల కలల అడుగులే దీర్ఘయాత్రలు
కొత్త పాఠాల కాలానికి కవాతులు
ఏప్రిల్ 27 ప్రపంచానికి ఒక తేదీ
కానీ తెలంగాణకు…
అది మరువరాని రోజు మరువలేని రోజు
చరిత్రే ఇష్టంగా తన చరిత్ర రాసుకున్న రోజు
జలదృశ్యాలు జనహారాలవుతాయని
ట్యాంక్బండ్లు మిలియన్ మార్చ్లౌతాయని
నెక్లెస్రోడ్లు సాగరహారాలవుతాయని
రహదారులు సడక్బంద్లవుతాయని
ఎవరూహించారు? ఎవరు కలగన్నారు?
ఓ బక్క మనిషే తెలంగాణను ఒక్క తాటిపై
నడిపించే గీత గీస్తాడని ఎవరు కలగన్నారు!
ఈ బాధల గాధలన్నీ పగిలి
ధూంధాం పాటలై ఉసిళ్ల పుట్టల్లా
ఎగియటం కొత్త చరిత్ర!
రోడ్లన్నీ వంటవార్పుగా వంటశాలలవటం
చరిత్రకే నిబిడాశ్చర్యం!
పురిటినొప్పుల నుంచి
ఉద్యమ బిడ్డ వేసిన కేక ఏప్రిల్ 27
విముక్తి గీత రచనకు ప్రతిన ఏప్రిల్ 27
జనఘోషలు ప్రతిధ్వనించిన రోజు
నెత్తి మీది బుట్ట లాంటి ఉంగరాల జుట్టే కిరీటం కాగా
తన ఎముకలనే కరవాలాలుగా చేసి
ఆధిపత్యంపై యుద్ధం చేసిన వాడు
బాహుబలిగా అవతరించిన రోజు
ఎవరు కలగన్నారు చెప్పండి?
తరతరాల గోస నుంచి
ఆదిపత్యాల అణిచివేత నుంచి
స్వరాష్ట్ర సాధనే ద్యేయమని
ఎదఎదలో ఉద్యమ జ్వాలలు రగిల్చిన
మహాకేక ఏప్రిల్ 27..!
అరవయ్యేళ్ల అణగారిన చరిత్ర
శిరసెత్తింది చూడు
ఎర్ర సెలకల్లో ఉద్యమ గులాబీల తోట చూడు
తెలంగాణ తనని తాను
మలుపు తిప్పుకున్న రోజది
గుండెఘోషల పిడికిళ్లు
సింహకంఠనాదం చేసిన రోజది
వలసలతో ఖాళీ అయిన ఊళ్ల కండ్లల్లో
ఆశలు పూసిన రోజది
ఇది చరిత్ర చూడని సమరం..
ధరిత్రి ఎరుగని స్వప్నం…
-జూలూరు గౌరీశంకర్
94401 69896