శాస్త్ర, సాంకేతిక యుగంలో వ్యవసాయం రూపు రేఖలు మారుతున్నాయి. దుక్కిలో జోడెడ్ల నాగలి, గాలివాటానికి ధాన్యం తూర్పార పట్టడంలాంటివి ఇక గతకాలపు చిహ్నలుగానే మిగులుతాయి. పెరుగుతున్న జనాభా, తరుగుతున్న సాగుభూములు ఆహారభద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోంచే సాగు కొత్తపుంతలు తొక్కుతున్నది. యంత్రాల వినియోగం మొదలు కృత్రిమ మేధ వ్యవసాయంలో కీలక భూమిక పోషిస్తున్నది. తక్కువ శ్రమతో ఎక్కువ ఉత్పత్తి సాధించే దిశగా వ్యవసాయం సాగిపోతున్నది.
ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోబోతున్నది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, ఆహార అవసరాలు తీర్చాల్సిన సమయంలో ఇతర అవసరాలకు భూ వినియోగం పెరుగుతున్నది. దీంతో పంటలు పండే భూమి తగ్గిపోతున్నది . ఈ స్థితిలో ప్రపంచ మానవాళి ఆహారకొరతను ఎదుర్కొనే ప్రమాదంలో పడుతున్నది. ఈ నేపథ్యంలోంచే వ్యవసాయంలో శాస్త్ర సాంకేతికతలతో పాటు, ‘కృత్రిమ మేధ’ పాత్ర నానాటికి అత్యావశ్యకం అవుతున్నది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు పండించడానికి ముమ్మర యత్నాలు సాగుతున్నాయి.పెరుగుతున్న కూలీల కొరత, పెట్టుబడి వ్యయం దృష్ట్యా సాధారణ వ్యవసాయ క్షేత్రాల్లో కూడా కృతిమ మేధతో రోబోటిక్స్ , డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ సాంకేతికతలు ఉపయోగించుకొని పంటలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కొత్త అవసరంగా ముందుకొస్తున్నది.
చిన్న విస్తీర్ణంలో అయినా నిలువు అరలు ఏర్పాటు చేసి అందులో మట్టి పోసి పంటలు పండించే పద్ధతి ‘వర్టికల్ ఫార్మింగ్’ పేరుతో ఇప్పటికే ప్రాచుర్యం పొందింది. దానికి కృత్రిమ మేధ సహాయంతో మెరుగైన పంట యాజమాన్యం పద్ధతులు జోడించి ఇంకా ఎక్కువ ఉత్పత్తిని సాధిస్తున్నారు.
వర్టికల్ ఫార్మింగ్ పద్ధతిలో మొక్కల మధ్య మైక్రో చిప్స్ ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వాతావరణంలోని తేమ, ఉష్ణోగ్రత, మట్టిలో నీటి స్థాయి, పోషకాల స్థాయిలను ఎప్పటికప్పుడు ప్రధాన కంప్యూటర్‌తో అనుసంధానించి తెలుసుకుంటారు. వాటి ఆధారంగా మొక్కకు కావాల్సిన విధంగా పోషకాలను అందించటం, తేమ, ఊష్ణోగ్రతలను నియంత్రించటానికి వీలవుతుంది. ఎప్పటికప్పుడు మట్టిలోని నీటి శాతాన్ని విశ్లేషిస్తూ, సరైన సమయంలో, సరైన మోతాదులో తగిన మోతాదులో మాత్రమే నీరు ఇవ్వడానికి, నీటి యాజ్యమాన్యం నిర్వహించడానికి ఆధునిక సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుంది.
మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ విజన్ సాఫ్ట్వేర్ సహాయంతో ఎప్పటికప్పుడు మొక్క ఫొటోలు తీసి దాని ఎదుగుదల, వ్యాధులను గమనిస్తూ తగిన చర్యలు తీసుకొనే అవకాశం వున్నది. అలాగే… డేటా అనలిటిక్స్ సాయంతో మార్కెటింగ్ దశలో ఎక్కడ అధిక ధరలు ఉన్నాయి, ఎప్పుడు ధరలు పెరిగే అవకాశం ఉన్నది అంచనా వేసే అవకాశం ఉన్నది. పంట కోత సమయంలో కూడా ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మామిడి పండు పూర్తి పక్వానికి వచ్చిందో లేదో నిర్ధారించి, పక్వానికి వచ్చిన వాటిని మాత్రమే కోయడానికి కంప్యూటర్ విజన్ సాంకేతికత ఉపయోగ పడుతుంది.
వ్యవసాయంలో సాంకేతికతను ఉపయోగించటంలో ఇప్పటికే చైనా, జపాన్ దేశాలు ముందున్నాయి. వర్టికల్ ఫార్మింగ్‌ని పెద్ద ఎత్తున్న ప్రోత్సహిస్తున్నాయి. ఇది చిన్న రైతులకు పెద్ద ఎత్తున దిగుబడులు సాధించడానికి సహాయ పడుతుంది.
ఇప్పటికీ సాంప్రదాయకంగా నడిచే భారత వ్యవసాయం నవతరం యువతతో కొత్త పద్ధతుల్లో సాగుతున్నది. చైనా, జపాన్ తరహాలో పెద్ద స్థాయిలో కృత్రిమ మేధ ఆధారిత వ్యవసాయం ఊపందుకొంటున్నది. ప్రపంచ భూవిస్తీర్ణంలో 8వ వంతు భాగాన్ని, జనాభాలో పావు వంతు ఉన్న మన దేశ యువతరం కొత్త సాంకేతికతతో సాగును చేపట్టడం ఆహ్వానించదగిన పరిణామం.
-ఎడిటోరియల్ డెస్క్
సాగులో నవతరం
లక్షల్లో జీతాలు సంపాదిస్తున్న యువత ఈ మధ్యకాలంలో వ్యవసాయంపై ఆసక్తి చూపిస్తోంది. యువత సాగు వైపు మొగ్గుచూపడం వల్ల నూతన సాంకేతికతలు వ్యవసాయ రంగానికి అందుబాటులో వచ్చాయి. చాలా మంది యువతీ యువకులు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వారే కావడంతో వారికి వ్యవసాయ సమస్యలపై అవగాహన ఉన్నది. తమకు ఉన్న సాంకేతిక నైపుణ్యంతో సమస్యలకు చెక్ పెడుతున్నారు. ఫోన్లో ఉపయోగించే సిమ్ కార్డును వ్యవసాయ మోటార్‌కు అనుసంధానించి.. ఎక్కడి నుంచైనా నీటి మోటార్ ఆన్-ఆఫ్ చేసుకొంటున్నారు. దీంతో పొద్దుమాపులు పొలానికి పోయే అగత్యం తప్పింది. నేటి యువత తల్లితండ్రుల కష్టానికి, తమ తెలివి తేటలు జోడిస్తున్నారు. ఎప్పుడు వాన రాబోతుందో, ఎక్కడ మెరుగైన ధరలు ఉన్నాయో, ఏ పురుగు మందులు వాడాలో వారు తల్లి తండ్రులకు చెబుతున్నారు. ప్రస్తుతానికి అవసరమైన, ఆహ్వానించదగ్గ పరిణామం ఇది.
కొత్తపంటలు, అధిక రాబడులు
సంప్రదాయ పద్ధతుల్లో, సాధారణ పంటలు కాకుండా, కొత్త మార్గాల్లో యువత కొత్త పంటలు పండిస్తున్నది. డ్రాగన్ ఫ్రూట్స్ ,యాపిల్ బేర్ , స్వీట్ కార్న్, మష్రూమ్ లాంటి రకరకాల పంటలతో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అధిక రాబడి పొందుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ మంచి, శాస్త్రీయ సాగుపద్ధతులు అవలంబిస్తున్నారో తెలుసుకొని, వారి అనుభవాలు పంచుకుంటున్నారు. సాగులో సలహాల నుంచి, మార్కెటింగ్ దాక ‘ఆండ్రాయిడ్ యాప్స్’ను నేటి యువకులు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ పరిణామాలు వ్యవసాయాన్నీ, మార్కెటింగ్‌ను సులభతరం చేయటమే కాదు, లాభదాయకం చేస్తున్నాయి. నేటి యువతకు విడిగా ఆదాయ వనరులు ఉండటం వల్ల వ్యవసాయానికి సరైన సమయంలో పెట్టుబడి పెట్టడం కూడా కలిసి వస్తున్నది. తాము పని చేస్తున్న కార్పొరేట్ సంస్థల మార్కెటింగ్ నైపుణ్యాలను ఉపయోగించి వ్యవసాయ ఉత్పత్తులకు ఆన్లైన్ వేదికలలో మార్కెటింగ్ చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. రైతులకు-వినియోగదారులకు నేరుగా అనుసంధానించే ఫార్మ్ ఫ్రెష్, లాంటి కొత్త కొత్త అంకుర సంస్థలు ఏర్పాటు చేసి విజయాలు సాధిస్తున్నారు.