1947, ఏప్రిల్ 21న ఢిల్లీలోని మెట్కాఫ్ హౌజ్‌లో అఖిల భారత సర్వీసుల మొదటి ప్రొబెషనరీ అధికారులకు శిక్షణ పూర్తయ్యింది. ఈ సందర్భంగా దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉపన్యసించారు. ఆయనను స్మరించుకుంటూ ఏటా ఏప్రిల్ 21వ తేదీని సివిల్ సర్వీసుల దినోత్సవం జరుపుకొంటున్నాం. సివిల్ సర్వీసులు దేశ సమైక్యత, సమగ్రతకు పునాదులు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి, పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు పట్టుగొమ్మలు.
ఎం.ఆర్.పాయ్ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయినప్పటికీ హైదరాబాద్‌లో ఆయనకు కనీసం ఇల్లు కూడా లేదు. మర్రి చెన్నారెడ్డి శిక్షణ కేంద్రంలో క్లాసులు తీసుకోవడానికి మాతో పాటే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేవారు. ఆ స్థాయి నిబద్ధతకు దగ్గరలో కూడా ఎవరూ లేకపోవడం నిజంగా సిగ్గుచేటు. ‘ఫిర్యాదుదారులు ఎవరు వచ్చినా, వారి స్థానంలో ఉంటే మనమేం కోరుకుంటామో అది చేయడానికి ప్రయత్నం చేయాలి’ అని ఎం.ఆర్.పాయ్ చెప్పేవారు. అందుకే ఆయన సివిల్ సర్వీస్ అధికారులకు ఆదర్శం అయ్యారు.
ఏప్రిల్ 21 ఈ దేశ ప్రజల సేవకు పునరంకితం కావలసిన రోజు. దేశంలో వారన్ హేస్టింగ్స్ సివిల్ సర్వీసులు ప్రారంభిస్తే, ఆ తర్వాతి కాలంలో కారన్ వాలి స్ ఉద్యోగస్వామ్య వ్యవస్థను సంస్కరించి, ఆధునీకరించారు. అం దుకే కారన్ వాలిస్ను సివిల్ సర్వీసెస్ పితామహుడిగా పేర్కొంటారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్య్రానంతరం సివిల్ సర్వీసెస్ వ్యవస్థను తీర్చిదిద్దారు. మితిమీరిన రాజకీయ జోక్యం, కాలం చెల్లి న ఉద్యోగస్వామ్య పద్ధతులు సివిల్ సర్వీసెస్‌ను పట్టి పీడిస్తున్న సమస్యలు. అసమర్థులు, సేవలకు పనికిరానివారి విషయంలో రీకాల్ చేసే పద్ధతులను అనుసరించడంలో తప్పు లేదు.
వ్యవస్థను మార్చేస్థాయి నుంచి ‘నడవనీయండి నాకెందుకు! నా కాలపరిమితి గడిస్తే చాలు’ అనే స్థాయి వరకూ సివిల్ సర్వెంట్స్ పరివర్తన చెందుతున్నారు. అలాంటివారికి అడ్డుకట్ట వేయాలి. దేశానికి, ప్రజలకు ఏది మంచిదో దానికోసం చిత్తశుద్ధి, నిబద్ధతతో నిలబడేవాళ్లు ఉద్యోగస్వామ్యంలో ఇంకా మిగిలి ఉన్నారు. మన వ్యవస్థలో ఎన్నో విజయాలు సాధించిన సివిల్ సర్వెంట్స్ కూడా ఉన్నారు. అలాంటివారినే ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.
‘కర్ణుడి చావుకు కారణాలు అనేకం’ అనే చందంగా అఖిల భారత సర్వీసు ఉద్యోగుల ద్వారా కేంద్ర ప్రభు త్వం రాష్ర్టాలపై అనవసర పెత్తనం చెలాయిస్తున్నది. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. యూపీఎస్సీ సభ్యుల నియామకాలు సరిగా లేవు. శిక్షణ కేంద్రాల్లో నిరాసక్తత ఉన్న ది. పాలనలో మితిమీరిన జాప్యం పెరిగిపోయింది. ఉద్యోగులు ప్రజలకు సేవ చేసేవారే కానీ, యజమానులు కాదని గుర్తుపెట్టుకోవాలి.
ముప్ఫై ఏండ్ల కింద పదవీ విరమణ పొందిన ఎస్.ఆర్.శంకరన్, ఎం.ఆర్. పాయ్లేనా ఇంకా ఆదర్శం? మిగతా వాళ్లెక్కడ? కొందరైనా ఎస్. ఆర్.శంకరన్‌లు ఎందుకు కాలేకపోతున్నారు? అసలు లోపం ఎక్కడున్నది? ప్రభుత్వాలు దీన్ని గుర్తించాలి. రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టడానికి అనేక సహేతుక కారణాలు విశదీకరించవచ్చునేమో, కానీ దేశ ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మగా ఉండాల్సిన రక్షణ కవచం తుప్పుపడితే దేశ ప్రజలకు దిక్కెవరు? సివిల్ సర్వీసెస్ వ్యవస్థను రక్షించుకోకపోతే దేశ భవిష్యత్తు అంధకారమే కదా? ఈ విషయంలో మేధావులు, నిపుణులు, ప్రభుత్వాలను నడిపేవారు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.
-ఎర్రా నాగేంద్రబాబు, 98490 85520
(వ్యాసకర్త: రిటైర్డ్ జాయింట్ కలెక్టర్)