రామగిరి, జనవరి 23 : నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో నగరోత్సవం కన్నులపండువగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవములను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి నిర్వహించిన స్వామి, అమ్మవార్ల నగరోత్సవం పురవీధుల్లో నయనానందకరంగా, శోభాయమానంగా సాగింది. రెండో భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రాంగణంలో చెరువుగట్టు ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామాలింగేశ్వర శర్మ అర్చకుల వేదమంత్రోచనాలతో ప్రత్యేక పూజలు చేశారు.
సుందరంగా అలంకరించిన ప్రత్యేక వాహనంలో కొలువుదీరిన స్వామి, అమ్మవార్లకు హజరై నగరోత్సవాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, డైరీ కార్పోరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డిలు ప్రారంభించారు. నగర ఉత్సవంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు, కోలాట ప్రదర్శన భజన ఆకట్టుకున్నాయి. విద్యుత్ దీపాలంకరణ, బాణసంచా కాల్పులతో గడియారం సెంటర్ మీదుగా హైదరాబాద్ రోడ్డు వీటి కాలనీ వివేకానంద స్వామి విగ్రహం మీదుగా చెరువు గట్టు వైపు ఊరేగింపు సాగింది.
ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, నార్కెట్పల్లి మండల అధ్యక్షులు బత్తుల ఉషయ్య, చెర్వుగట్టు సర్పంచ్ నేతగాని కృష్ణ, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.