Fatty Liver | రోజురోజుకీ పెరుగుతున్న అనారోగ్య సమస్యల్లో ఫ్యాటీ లివర్ సమస్య కూడా ఒకటి. కాలేయంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఒక్కప్పుడు అధికంగా మద్యం సేవించడం వల్ల మాత్రమే ఈ సమస్య తలెత్తేది. కానీ ప్రస్తుత కాలంలో మారిన మన ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా ఈ సమస్య అందరిలో తలెత్తుతుందని చెప్పవచ్చు. ఫ్యాటీ లివర్ రావడానికి గల ముఖ్య కారణాల్లో రాత్రిపూట భోజనాన్ని ఆలస్యంగా తీసుకోవడం కూడా ఒక కారణమని వారు చెబుతున్నారు. రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం వల్ల ఇన్సులిన్ క విరామం లభించదు. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తుతుంది.
ప్రోటీన్ లేని అల్పాహారాన్ని తీసుకోవడం కూడా దీనికి ఒక కారణమే. చాలా మంది అల్పాహారానికి బదులు కాఫీని తాగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మధ్యాహ్నం సమయానికి ఆకలి ఎక్కువగా అవుతుంది. దీని వల్ల చాలా మంది ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. ఇది క్రమేణా కాలేయంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. అలాగే వ్యాయామం చేయకపోవడం కూడా ఈ సమస్యకు ఒక కారణమే. గంటల కొద్ది కూర్చొని పని చేయడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. దీని వల్ల కాలేయ పనితీరు మందగించడంతో పాటు ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల కాలేయ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం కూడా ఉందని వైద్యులు తెలియజేస్తున్నారు. కనుక ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు అలాగే ఈ సమస్య భవిష్యత్తులో రాకూడదు అనుకునే వారు జీవనశైలితో పాటు ఆహారం తీసుకునే విషయంలో కూడా మార్పులు చేయడం చాలా అవసరం.
ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు ప్రతి భోజనంలో 30 నుండి 40 గ్రాముల ప్రోటీన్, ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడంతో పాటు ఆకలి తగ్గుతుంది. క్రమంగా శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. అలాగే రాత్రిపూట భోజనాన్ని త్వరగా తీసుకోవాలి. నిద్రపోవడానికి రెండు గంటల ముందే భోజనాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. దీని వల్ల ఇన్సులిన్ స్థాయిలు తగ్గడంతో పాటు జీవక్రియల వేగం పెరుగుతుంది. అదనంగా ఉన్న కొవ్వు వేగంగా కరుగుతుంది. ఆహారంలో భాగంగా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేలా నీటిని ఎక్కువగా తీసుకోవాలి. రోజూ శరీరానికి తగినంత శ్రమ ఉండేలా వ్యాయామం చేయాలి. ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడే వారు చక్కెర కలిగిన శీతల పానీయాలను తీసుకోవడం తగ్గించాలి. ప్రాసెస్డ్, ప్యాక్ చేసిన ఆహారాలను తీసుకోవడం మానేయాలి. నూనెలో వేయించిన ఆహారాలను, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇలా తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చని వైద్యులు చెబుతున్నారు.