హిందుత్వం- హిందూ మతం ఒకటే అని చాలామంది భారతీయులకు తప్పుడు అభిప్రాయం ఉన్నది. హిందుత్వం వేరు, హిందూ మతం వేరని హిందుత్వ పద సృష్టికర్త వినాయక్ దామోదర్ సావర్కర్ తాను రచించిన ‘ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ’ (1921-22)లో చర్చించారు. ‘హిందుత్వం మరియు హిందూ మతంలో వ్యత్యాసాలు’ అనే అధ్యాయంలో సావర్కర్ తాను ప్రతిపాదించిన హిందుత్వ అనేది హిందూ మతంతో సమానం కాదని, రెండింటికి చాలా వ్యత్యాసం ఉన్నదని, రెండింటిని ఒకటిగా భ్రమ పడకూడదని చెప్పారు.
గాడ్సే, అతని అనుయాయులు లౌకికవాది అయిన నెహ్రూ కంటే గాంధీనే ఎక్కువ ప్రమాదకారిగా భావించారు. గాంధీ ప్రబోధించే సర్వమత సమానత్వమైన ‘ఈశ్వర్ -అల్లా తేరే నామ్’ భావన నుంచి ‘హిందుత్వ’కు ఎక్కువ ప్రమాదం ఉందని భావించడం వల్లనే ఆయనను గాడ్సే హత్య చేశాడనేది చారిత్రక సత్యం.
సావర్కర్ తాను ప్రతిపాదించిన హిందుత్వలో ఒకే రాష్ట్రం, జాతి, సంస్కృతి ఉండటం ప్రథమం అన్నారు. వేల ఏండ్ల చరిత్ర కలిగిన హిందూ మతం హిందుత్వలో ఒక అంతర్భాగం మాత్రమే అని చెప్పుకొచ్చారు. సావర్కర్ అభిప్రాయాలు ఇలా ఉంటే.. హిందూ మతం గురించి, దాని ఔన్నత్యం గురించి స్వామి వివేకానంద చెప్పిన మాటలు స్ఫూర్తిమంతమైనవి. 1893 షికాగోలో ప్రపంచ సర్వ మత సమ్మేళనంలో వివేకానంద చేసిన ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు…
1.ప్రపంచంలోని అత్యంత పురాతన సంస్కృతికి నెలవు, అన్ని ధర్మాలకూ జనని అయిన భారతదేశం తరపున నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను.
2.మత సహనం, అన్నిమతాల పట్ల సమాన ఆదరణ లాంటి లక్షణాలను ప్రపంచానికి చాటిచెప్పిన మతం నుంచి వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను. మేం కేవలం మత సహనాన్ని నమ్మడమే కాకుండా, అన్ని ధర్మాలను నిజరూపంలో స్వీకరిస్తాం. నేను అన్ని మతాలకు, అణగారిన ప్రజలందరికీ ఆశ్రయం ఇచ్చిన దేశానికి చెందిన వాడినైనందుకు గర్వపడుతున్నాను.
3.నేను చిన్ననాటి నుంచి వింటున్న, అనేక లక్షల మంది ప్రజలు ఇప్పటికీ చెప్తున్న మాటలను ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను: ‘నదులు ఎలాగైతే వివిధ ప్రాంతాల్లో పుట్టి, వివిధ భూభాగాల గుండా ప్రవహించి, చివరికి సముద్రంలో కలుస్తాయో.. అలాగే మనిషి తనకు నచ్చిన దారిని ఎన్నుకుంటాడు. చూడటానికి ఈ దారులన్నీ వేరైనా, అవన్నీ కూడా దేవుణ్నే చేరుకుంటాయి.’ ఇక్కడ జరుగుతున్న ఈ మత సమ్మేళనం అత్యంత పవిత్రమైన సంగమం. గీతలో చెప్పినట్టి- ‘నా దగ్గరికి వచ్చిన దేన్నయినా, అది ఎలాంటిదైనా, నేను దాన్ని స్వీకరిస్తాను. మనుషులు వేర్వేరు దారులను ఎంచుకుంటారు, కష్టాలను ఎదుర్కొంటారు. కానీ, చివరికి నన్ను చేరుకుంటార’న్న వాక్యాలు దీనికి నిదర్శనం.
4.‘మతతత్వం, మూఢ భక్తి, దాని పర్యవసానాలు ఈ అందమైన భూమిని పట్టి పీడిస్తున్నాయి. అవి సృష్టించిన హింసతో ఈ భూమిపై ఉన్న మట్టి ఎర్రబడింది. వాటి కారణంగా ఎన్నో నాగరికతలు నాశనమయ్యాయి, ఎన్నో దేశాలు నామరూపాలు లేకుండాపోయాయి. ఆ భయానకమైన మతతత్వం, మూఢభక్తి లేనట్టయితే మానవ సమాజం ఇంతకన్నా మెరుగైన స్థితిలో ఉండేది. ఈ సర్వమత సమ్మేళనం- అది కరవాలం ద్వారా కావచ్చు, కలం ద్వారా కావచ్చు- అన్నిరకాల మూఢభక్తిని, పిడివాదాన్ని, హింసను దూరం చేస్తుందని విశ్వసిస్తున్నాను’ అని స్వామి వివేకానంద సనాతన ధర్మమైన హిందుమతంలోని మూల సూత్రాలను తెలియజేశారు. ఆధ్యాత్మిక భావన లేని వాడు హిందువు కాజాలడని ఆయన అభిప్రాయపడ్డారు.
హిందూ సాధువు అయిన స్వామి వివేకానందకు భారతదేశం అన్నా, హిందు మతం అన్నా అచంచలమైన ప్రేమ ఉండేదనీ, కానీ ఆ ప్రేమ మూలంగా ముస్లింల పట్ల కానీ క్రిస్టియన్ల పట్ల కానీ ద్వేషం ఉండేది కాదని, అలా ఉండటమే సనాతన ధర్మ సిద్ధాంతం అని స్వామిజీ నమ్మేవారని భారతదేశ చరిత్రలో నిష్ణాతుడు ఐన్స్లీ టి.ఎంబ్రీ తన ‘మోడ్రన్ ఇండియన్ హిస్టరీ’ పుస్తకంలో విశ్లేషించారు. అనేక మంది తత్వవేత్తలు హిందూ మతాన్ని సనాతన ధర్మంగా, వేల ఏండ్లుగా కోటానుకోట్ల ప్రజలు అనుసరిస్తున్న మతంగా గుర్తించగా, ‘హిందుత్వ’ను వందేండ్లకు పూర్వం ప్రతిపాదించబడిన ఒక రాజకీయ భావనగా చూడవలసి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
నాస్తికులను, లౌకిక భావజాలం ఉన్నవారిని హిందుత్వ వాదులు వ్యతిరేకిస్తారనేది తెలిసిందే. అయితే వీరు అంతకన్నా ఎక్కువగా, సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ‘హిందుత్వ’ ను వ్యతిరేకించేవారిని ప్రథమ శత్రువులుగా చూస్తూ, వారంటే భయపడతారనేది సత్యం. గాడ్సే, అతని అనుయాయులు లౌకికవాది అయిన నెహ్రూ కంటే సనాతన ధర్మాన్ని అనుసరించే గాంధీనే ఎక్కువ ప్రమాదకారిగా భావించారు. గాంధీ ప్రబోధించే సర్వమత సమానత్వమైన ‘ఈశ్వర్- అల్లా తేరే నామ్’ భావన నుంచి ‘హిందుత్వ’కు ఎక్కువ ప్రమాదం ఉందని భావించడం వల్లనే ఆయనను గాడ్సే హత్య చేశాడనేది చారిత్రక సత్యం.
14వ శతాబ్దంలో మధ్వాచార్యులు రచించిన సర్వ దర్శన సమగ్రహలో నాస్తికత్వాన్ని లోకాయతగా గుర్తించారు. అలాంటి లోకాయతను సనాతన ధర్మంలో భాగంగా భావించారు. దైవాన్ని నమ్మనివారూ హిందువులే అయినప్పుడు భగవంతుడి వేరే రూపాలను ఆరాధించేవారి మీద వ్యతిరేకత అవసరం లేదని సనాతన ధార్మికులు భావిస్తారు. అమర్త్య సేన్ రచించిన ‘ఆగ్మెంటేటివ్ ఇండియన్’లో ‘హిందుత్వ’ భావజాలం లౌకిక భావజాలంపై దాడి చేస్తున్నదని, లౌకికవాదులు ఆ దాడిని తిప్పికొట్టినప్పుడే భారత దేశ సంస్కృతి, చరిత్ర కాపాడబడతాయని (‘సెక్యులరిజం అండ్ ఇట్స్ డిస్కాంటెంట్’ అనే అధ్యాయం)లో అభిప్రాయపడ్డారు.
1900 సంవత్సరంలో స్వామి వివేకానంద శాన్ఫ్రాన్సిస్కోలో ఇచ్చిన ఉపన్యాసంలో ఉదారవాదం మనిషిని నిస్వార్థంగా తయారుచేస్తుందని, మనిషి స్వార్థాన్ని ఇష్టపడతాడు కాబట్టి ఉదారవాదం దాడికి గురవుతుందని అభిప్రాయపడ్డారు. స్వామి వివేకానంద మొదలుకొని అమర్త్యసేన్ వరకు అనేకమంది లౌకిక, ఉదారవాద భావజాలం భారతీయతలో అంతర్భాగమని విశ్వసించారు.
ఇతర మత, రాజాకీయ శక్తుల నుంచి ముప్పు ఎదురైనా వేల ఏండ్లుగా భారతీయులు అనుసరిస్తున్న పద్ధతులు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఇంతకాలం సనాతన ధర్మం తనను కాపాడుకున్నది. ఈ హిందుత్వ దాడి నుంచి కూడా తనను తాను తప్పక రక్షించుకుంటుంది. ‘హిందుత్వ’ అనే రాజకీయతత్వాన్ని వ్యతిరేకించడం హిందూ మత వ్యతిరేకం కాదని భారతీయులు గుర్తిస్తున్నారు.