మాస్కో: గ్రీన్లాండ్ కోసం ఘర్షణ యుగాంతానికి దారి తీస్తుందని రష్యా, పోలండ్ హెచ్చరించాయి. రష్యా మాజీ డిప్యూటీ మినిస్టర్ దిమిత్రి రోగోజిన్ మాట్లాడుతూ, ఈ ఆర్కిటిక్ దీవిలో అణు దళాలను మోహరించాలని అమెరికా భావిస్తున్నదని తెలిపారు. దీనివల్ల రష్యా, చైనాలపై తనకు పై చేయి లభిస్తుందని అమెరికా భావిస్తున్నదన్నారు. అణ్వాయుధాల వినియోగాన్ని 1945 నుంచి నిరోధిస్తున్న వ్యూహాత్మక వ్యవస్థకు ఈ ఘర్షణ అంతరాయం కలిగిస్తుందన్నారు. మూడో ప్రపంచ యుద్ధానికి రంగస్థలంగా ఆర్కిటిక్ నిలిచే అవకాశం ఉందని హెచ్చరించారు.
రష్యా, అమెరికాల మధ్య అణు వార్‌హెడ్స్ వేగంగా ప్రయాణించగలిగిన మార్గం ఇదేనని చెప్పారు. గ్రీన్‌లాండ్‌ని కబ్జా చేస్తే, రష్యా, చైనాలపై అణ్వాయుధపరమైన ఆధిపత్యాన్ని సాధించవచ్చునని అమెరికా భావిస్తూ ఉండవచ్చునని, కానీ అది ప్రపంచం అంతానికి నాంది అవుతుందని హెచ్చరించారు. రష్యా కొత్త ఖండాంతర అణు క్షిపణి సర్మాట్ లేదా సాతాన్-2ను గుర్తు చేస్తూ, అణ్వాయుధాలను వాడే అవకాశాలపై సంకేతాలు ఇచ్చారు. ‘నిజ జీవితంలో దీనిని కేవలం ఒకసారి మాత్రమే పరీక్షించవచ్చు. కానీ ఆ తర్వాత నివేదికలను తయారు చేయడానికి ఎవరైనా మిగిలి ఉంటారనేది కచ్చితంగా చెప్పలేని విషయం’ అన్నారు. పోలండ్ ప్రధాన మంత్రి డొనాల్డ్ టస్క్ మాట్లాడుతూ, గ్రీన్‌లాండ్‌పై ఘర్షణ వల్ల పాశ్చాత్య దేశాలకు భారీ విపత్తు సంభవిస్తుందని, ప్రపంచం అంతమవుతుందని చెప్పారు.