రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత ఎనిమిదేండ్లుగా తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా ఉంటున్నది. జీఎస్డీపీలో, తలసరి ఆదాయంలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో, వ్యవసాయ ఉత్పత్తుల్లో, ఐటీ రంగంలో దేశంలోనే రాష్ర్టాన్ని ముందు వరుసలో నిలపటంలో కేసీఆర్ విజయం సాధించారు. కేంద్రం సహకరించకున్నా.. రైతుల అభ్యున్నతి కోసం కట్టుబడి ఉన్న కేసీఆర్ దేశానికి ఒక సమీకృత వ్యవసాయ విధానం కావాలంటున్నారు. దాని రూపకల్పన కోసం సమాయత్తమవటం ఆహ్వానించదగిన పరిణామం.
ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా ‘బలమైన కేంద్రం, బలహీన రాష్ర్టాలు’ అనే రీతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దీనికి ఎదురునిలుస్తూ, కేంద్ర విధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడుతున్నారు. తెలంగాణలోని యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో మోదీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఢిల్లీలో ధర్నా చేసి రైతు వ్యతిరేక మోదీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. రాష్ట్రం నుంచి యాసంగి వడ్లను కొనబోమని కేంద్రం అంటే, చివరి గింజవరకు వరి ధాన్యాన్ని కొంటామని చెప్పి రైతులపై ఉన్న నిబద్ధతను కేసీఆర్ చాటుకున్నారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం మాట తప్పి పెట్టుబడి ఖర్చులు పెరిగేవిధంగా వ్యవహరిస్తున్నది.
ఎరువుల సబ్సిడీలను ఎత్తివేసింది. కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ సంస్కరణలు వ్యవసాయ రంగానికి గొడ్డలి పెట్టుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతుల ఆదాయం పెరగకపోగా, సాగు ఖర్చులు పెరిగిపోయాయి. కార్పొరేట్ సంస్థలకు మాత్రం వాటి అప్పుల్లో భారీ రాయితీలు ఇస్తూ లక్షా 80 వేల కోట్ల ప్రజల సొమ్మును మోదీ ప్రభుత్వం ధారాదత్తం చేసింది. కానీ 3 వేల కోట్లు పెట్టి తెలంగాణలోని 60 లక్షల మంది రైతులకు మేలు జరిగే యాసంగి వడ్లను కొనుగోలుకు నిరాకరించి రైతు వ్యతిరేక స్వభావాన్ని బయటపెట్టుకున్నది.
ప్రజలకు ఆహారభద్రత, రైతులకు ఆదాయ భద్రత కల్పించడానికి ఏర్పాటుచేసిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ)ను ధాన్యం కొనకుండా చేసి బాధ్యతల నుంచి తప్పించటం ద్రోహపూరితమే. రైతుల ఆదాయం రెట్టింపు కావాలన్నా, రైతుల సమస్యలు పరిష్కారం కావాలన్నా దేశంలో వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని బలోపేతం చేయాలి. మద్దతు ధరల విధానానికి చట్టబద్ధతోపాటు, అనేక పంటలకు మద్దతు ధరలను వర్తింపజేయాలి. మద్దతు ధరల విషయంలో స్వామినాథన్ సిఫారసులను అమలుచేయకుండా, ‘ఒకే దేశం- ఒకే మార్కెట్’ విధానంతో చిన్న, సన్నకారు రైతాంగాన్ని మోదీ సర్కారు దెబ్బతీస్తున్నది.
రాష్ట్రంలో కేసీఆర్ అవలంబించిన వ్యవసాయానుకూల విధానాలతో పెద్ద ఎత్తున ఉత్పత్తి పెరిగింది. ఒకప్పుడు కరువు కాటకాలతో సతమతమైన తెలంగాణ నేడు దేశానికే అన్నం పెట్టేవిధంగా, ధాన్యాగారంగా మారింది. ఈ క్రమంలోనే వ్యవసాయ సమస్యలను తొలగించి రైతుని రాజును చేయటం కోసం సమీకృత నూతన వ్యవసాయ విధానం అవసరమని కేసీఆర్ ప్రతిపాదిస్తున్నారు. రైతుల మార్కెటింగ్, కొనుగోలు, మద్దతు ధర సమస్యల పరిష్కారం కోసం, వ్యవసాయరంగ అభివృద్ధి కోసం రూపొందించాల్సిన విధానాలపై కసరత్తు చేస్తున్నారు.
దీనికోసం హైదరాబాద్లో సమావేశం నిర్వహించబోతున్నారు. ఇందులో రైతుసంఘాలతో పాటు రాకేశ్ తికాయత్ లాంటి వివిధ రాష్ర్టాల్లోని రైతు ఉద్యమనేతలు, అశోక్ గులాటి లాంటి వ్యవసాయరంగ నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమావేశం ఏర్పాటుచేస్తున్నారు. సమగ్ర చర్చల ద్వారా నూతన సమీకృత వ్యవసాయ విధానానికి రూపకల్పన చేయబోతున్నారు. తద్వారా నవభారత నిర్మాణంలో తనదైన పాత్ర నిర్వహించటానికి సన్నద్ధులు కావటం ముదావహం.