‘పిట్ట బెదిరిచ్చి బట్టపేగు ఎత్తుకపోయిందట..’! మోదీ ప్రభుత్వ పనితీరు గూడ అట్లనే ఉంది. పంట కొనాల్సింది కేంద్రమే, కానీ తెలంగాణ మీద కక్షతో కొనబోమని మొండికేసింది. పల్లె నుంచి ఢిల్లీ దాక ధర్నాలు చేసి నినదించినా చెవులు మూసుకున్నది. ఇగ ‘అయ్య వోతె అమాస ఆగదు కదా..’ వాళ్ళు ఆగం జేత్తే నేను లేనా అని చివరి గింజను కూడా కొంటనని రైతులకు తోడుగా నిలిచిండు కేసీఆర్. దేశానికి బువ్వ పెడుతున్న రైతు పట్ల బీజేపీ-మోదీ ఎంత పెద్ద మనసుతో
ఆలోచిస్తరో రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు అర్థమైంది. కుండ పలిగినా కుక్క బుద్ధి తెలిసింది.
తల్లి కోడి పిల్లలని కండ్లల్లవెట్టి చూసుకొని, వెంట తిప్పుకొని గింజ గింజ ఏరిపెట్టి పాణమోలె సాదుకుంటె.. నాసు వెట్టిన పిల్లి నప్పతుగ వచ్చి పిల్లలను ఎత్తుకపోయి బుక్కవెట్టినట్టుంది కేంద్ర ప్రభుత్వం తీరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డంక నవ్వేటోళ్ళ ముందట జారిపడ్డ బతుకులు గావద్దని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలవడింది. దాంతో ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకుని రైతు నిలదొక్కుకుంటున్న సమయంలో కేంద్రం రైతు నడ్డి విరిచి, పునాది మీద సమాధి గడుతున్నది.
బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేకి అన్నది దేశానికి తెలిసిపోయింది. జాతీయస్థాయిలో రైతు వ్యతిరేక విధానాలను చేపట్టి భంగపడి ఢిల్లీలో బేషరతుగా రైతులకు క్షమాపణలు చెప్పింది. ఇప్పుడు తెలంగాణ రైతుల మీద పడింది. తెలంగాణలో ఈ యాసంగి ‘బాయిల్డ్ రైస్’ కొనబోమని, ‘రా రైస్’ మాత్రమే కొంటామని పీటముడి వేసింది. గత ముప్ఫై ఏండ్లుగా కేంద్రం కొంటున్నదే, రాష్ట్రం అమ్ముతున్నదే. ఇప్పుడు కొత్తగా ఈ నిబంధనలు పెట్టి తెలంగాణ రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది.
ఇయ్యాళ్ల కాదు, చాలా ఏండ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లను సేకరించి మర పట్టించిన తర్వాత అవసరం ఉన్నంతమేర ఉంచుకొని, మిగతా బియ్యాన్ని కేంద్రానికి పంపిస్తున్నాయి. దేశ ప్రజలకు ఆహారభద్రత, రైతులకు కనీస మద్దతు ధర లక్ష్యంగా భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) ఏర్పాటైంది. కానీ నిల్వలు ఎక్కువగా ఉన్నయని, డిమాండ్ లేదనే సాకుతో ఎఫ్సీఐ ద్వారా ముడి బియ్యం మాత్రమే సేకరిస్తామని కేంద్రం మెలికపెట్టడం శోచనీయం. ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’ తాజా నివేదికలో ప్రపంచంలో ఆకలితో ఉన్న 116 దేశాల జాబితా ప్రకటిచింది. అందులో మన దేశం 101వ స్థానంలో ఉన్నది. దేశంలో 25 శాతం జనాభా ఆకలితో ఉన్నదనీ, జనాభాలో 19 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐరాస కూడా తాజాగా వెల్లడించింది.
నిజంగా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గోదాముల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని ఆకలితో ఉన్న జనానికి అందించాలి. ఖాళీ అయిన గోదాములను.. రైతుల నుంచి ధాన్యం సేకరించి నింపవచ్చు. అప్పుడు అటు రైతులు, ఇటు పేదలు సంతోషంగ ఉంటరు. కరోనా సమయంలో జనం ఆకలితో అలమటిస్తున్నా మోదీ గుడ్లప్పగించి చూసిండు కానీ, గోదాముల్లోని ధాన్యాన్ని పంచలేదు. చైనా కరోనా కాలంలో గోదాముల్లో ఉన్న 100 కోట్ల టన్నుల బియ్యాన్ని ప్రజలకు పంచి వారి ఆకలిని తీర్చింది. గోదాములను ఖాళీ చేసింది. కానీ మన కేంద్ర ప్రభుత్వం రైతులతోని రాజకీయం చేయాలని చూసింది. తెలంగాణలో ఇక్కడి బీజేపీ నాయకులతో రైతులను రెచ్చగొట్టడానికి ప్రయత్నించింది.
కరోనా కాలంలో పండిన పంటను ఏం చేయాలో తెలియక ఏడుస్తున్న రైతు కన్నీటిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తుడిచారు. గోయల్ గోస పెట్టినా, మోదీ మోసం చేసినా, బండి తొండి వెట్టినా… నేనున్నానని రైతు కన్నీళ్ళను తుడిచి కల్లాలు తెరిచాడు కేసీఆర్. ఈ ఒక్క మాటతో రైతుల మొహం మీద చిరునవ్వు విరిసింది. అదీ నాయకుడంటే. ఓట్ల కోసం, సీట్ల కోసం ప్రజల వైపు చూసేవాడు కాదు.. ప్రజల ఆకలిని చూసేవాడు నిజమైన నాయకుడు. కేసీఆర్.. మీరు ఒక్క అడుగు ఢిల్లీ వైపు వేయం డి.. కోట్ల అడుగులు మీతో జత కలుస్తాయి.