‘రెండు ప్రభుత్వాలు ఒకదానికొకటి లోబడి పనిచేసే సంస్థలు కావు, దేనికవే స్వతంత్రమైనవి. కాబట్టి ఒకదాని మీద ఒకటి పెత్తనం చేయడం కాదు, పరస్పర సహకారంతో పనిచేయాలి. మన రాజ్యాంగం ప్రకారం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి’ అంటూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన అభిప్రాయాలను రాజ్యాంగసభ చర్చలతో పాటు కొన్ని సందర్భాల్లో వివరించారు.
నిత్యం వివాదాస్పదమవుతున్న రాజ్యాంగంలోని 358 ఆర్టికల్‌పై రాజ్యాంగసభలో మాట్లాడుతూ కొంతమంది సభ్యులు ‘కేంద్రం ఈ ఆర్టికల్‌ను దుర్వినియోగం చేసే అవకాశం ఉంద’ని అభిప్రాయపడ్డారు. ‘అయితే ఈ ఆర్టికల్‌ను కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే ఉపయోగించాలని’ అం బేద్కర్ జవాబిచ్చారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో వచ్చే వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు బాధ్యత తీసుకునేలా రాజ్యాంగంలో నిబంధనలను పొందుపరుస్తున్నట్టు రాజ్యాంగసభ అభిప్రాయపడింది.
మన దేశం విభిన్న సంస్కృతుల, భాషల, మతాల, కులాల సమాహారం. అందుకే దీనికి ఏకీకృత ప్రభుత్వ విధానం సరైంది కాదు. అదేవిధంగా విభిన్నమైన పాలనా పద్ధతులున్న సంస్థానాలు, ఇతర ప్రభుత్వాలు భారతదేశంలో విలీనమైన సందర్భాన్ని రాజ్యాంగసభ గుర్తించింది. ఏకీకృతంగా కేంద్రమే అన్ని అధికారాలను కలిగి ఉండాలనే వాదనను రాజ్యాంగసభ వ్యతిరేకించింది. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే రంగాలను విభజించింది. ఉమ్మడి అంశాలను కూడా ప్రత్యేకంగా పేర్కొన్నారు.
భారతదేశం సమైక్యంగా కొనసాగడానికి కావాల్సిన విధి విధానాలను రూపొందిస్తూనే, రాష్ర్టాలకు కూడా తగినన్ని అధికారాలందించారు. రాజ్యాంగంలోని 250, 352, 353 ఆర్టికల్స్‌ను ఉపయోగించే అధికారాన్ని రాష్ట్రపతికి ఇస్తూ, దీనికి పార్లమెంటు ఉభయసభల అనుమతి కావలసి ఉంటుందని రాజ్యాంగసభ తేల్చిచెప్పింది. దీన్ని కేంద్ర మంత్రిమండలి దయాదాక్షిణ్యాలపై వదిలివేయలేదు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మన పాలనా విధానం ఫెడరల్ వ్యవస్థ మాత్రమే. ఆ పరిస్థితుల్లోనే కేం ద్రం అధికారాలను వినియోగిస్తుంది. దేశ రక్షణ, భద్రత దృష్ట్యా ఇటువంటి వెసులుబాటు కల్పిస్తున్నామని అంబేద్కర్ చెప్పారు.
అదేవిధంగా 1939లో ‘ఫెడరేషన్-ఫ్రీడమ్’ అనే వ్యాసంలో ఏకీకృత ప్రభుత్వాల గురించి అం బేద్కర్ చర్చించారు. భారతదేశం స్వాతంత్య్రం సాధించకముందే ‘1935 భారత చట్టం’లోని అం శాలపై ప్రస్తావించారు. కేంద్రం కొన్ని ముఖ్యమైన అధికారాలను కలిగి ఉండాలంటూనే, కేంద్ర ప్రభుత్వాలు బాధ్యతగా లేకుంటే, రాష్ర్టాలకు ఎన్ని అధికారాలున్నా ప్రయోజనం లేదని వాదించారు. అమెరికాలో ఉండే సమాఖ్య (ఫెడరల్) వ్యవస్థను ప్రస్తావిస్తూ, అది భారతదేశం లాంటి దేశాల్లో సత్ఫలితాలను ఇవ్వలేదని సమాఖ్యలో ఉండే ప్రభుత్వాలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అంబేద్కర్ సూచించారు. నాడు దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా నిర్దేశించుకున్న అంశాలను కేంద్ర ప్రభుత్వాలు చాలాసార్లు విస్మరించాయి, దుర్వినియోగం చేశాయి.
రాజ్యాంగసభలో ఉన్నవాళ్లు ఆశించినంతగా ప్రజాస్వామిక నేతలు అధికారంలోకి రాలేదు. ప్రతి కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల హక్కులను తగ్గించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానికి ఒకటి లోబడి ఉండే విధా నం కాదని రాజ్యాంగసభలో నిర్ణయించుకున్నా, ప్రత్యక్ష ఆచరణలో కేంద్రంలో ఉండే నాయకులూ రాష్ర్టాలను తమ కింది స్థాయిగానే చూస్తున్నారు. భారతదేశం ఒకే జాతి అని ప్రకటిస్తూ ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవలి మన తెలంగాణ అనుభవం అటువంటిదే.
మూడు అంశాలు మరీ ఆందోళన కలిగిస్తున్నాయి. మొదటిది.. బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడానికి నిర్ణయించి దానికి ఏకంగా టెండర్లకు పిలవడం. దానిమీద సింగరేణి కార్మికులు ఐక్యంగా ప్రతిఘటించి సమ్మె చేశారు. రెండోది.. మన రాష్ట్రంలో నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టులను వారే మాట్లాడేసుకొని ఇక్కడి నీటిని ఇతర ప్రాంతాలకు తరలించాలనే నదుల అనుసంధానం కార్యక్రమం చేపట్టడం, దీనికి ఏకంగా ఇటీవల కేంద్ర బడ్జెట్లో నిధులు కూడా కేటాయించారు. నిజానికి నీటి పారుదల ప్రాజెక్టులు రాష్ట్ర పరిధిలోకి వస్తాయి. దాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూడటం.
మూడవది.. విద్యుత్ పంపిణీ, దాని ఉత్పత్తిని స్వాధీనం చేసుకోవడం. మన రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. గతంలో వలె ఏదో పేరుకే ఉచిత విద్యుత్ అని కాకుండా 24 గంటలు విద్యుత్‌ను రైతులకు అందుబాటులోకి తెచ్చింది. కానీ, పంట పొలాల వద్ద కరెంటు మీటర్లను పెట్టాలనే దుర్మార్గమైన ఆలోచనకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఇది కూడా రాష్ర్టాల పరిధిలోని అధికారం. ఇక సంస్కృతి పరంగా ఆధిపత్య భావాలను అవలంబించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది.
ఇట్లా రాష్ర్టాలను కేవలం స్థానిక సంస్థల స్థాయికి దిగజార్చే ఒక కుట్ర సాగుతున్నది. ఇది రాజ్యాంగస్ఫూర్తికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధమైనది. తెలంగాణ ప్రభు త్వం ఫెడరల్ వ్యవస్థ కోసం చేస్తున్న ఉద్యమాన్ని బలపరిచి, నియంతృ త్వం వైపు పయనిస్తున్న కేంద్ర ప్రభుత్వ పోకడలను అందరూ ప్రతిఘటించాలి.
(వ్యాసకర్త: చైర్పర్సన్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్)
దేశంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం భారత ప్రభుత్వంలా కాకుండా ఒక పార్టీకి పరిమితమైన వ్యవస్థగా వ్యవహరిస్తున్నది.లక్షల మంది తెలంగాణ రైతులు ఆందోళనతో ఉంటే పరిష్కారం వైపు ఆలోచించకుండా, మొండిగా వ్యవహరించి సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించింది. దేశంలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే కేంద్రం, రాష్ట్రం సమిష్టిగా ఆలోచించి పరిష్కారం వైపుగా ఆలోచించాలి. కానీ అలా జరగడం లేదు. ఇది ఎంతమాత్రం సమాఖ్య విధానం కాదు. కేంద్ర ప్రభు త్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది.కనీసం పార్లమెంట్లో చేసిన చట్టాలను కూడా గౌరవించడం లేదు.
-మల్లేపల్లి లక్ష్మయ్య