అంబేద్కర్ అంటే సమాజంలో నిమ్నవర్గాలకే నాయకుడన్న తప్పుడు, సంకుచిత భావన ఉన్నది. భారతీయ సమాజాన్ని పట్టి పీడిస్తున్న, సామాజిక అసమానతలను రూపుమాపడానికి కృషిచేసిన జాతీయ నేత అంబేద్కర్. ఏండ్ల తరబడి సాగుతున్న మనుధర్మ వర్ణ వ్యవస్థను, కుల విలువలను రాజ్యాంగం ద్వారా ‘ఒక మనిషికి ఒక ఓటు, ఒకే విలువ’ అనే ఆశ యాన్ని ప్రతిపాదించారు. నిచ్చెన మెట్ల సమాజంలో సమానత్వాన్ని సాధించారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం అనే గొప్ప విలువలను అందించి దేశంలో రగులుతున్న అనేక ఆర్థిక, సామాజిక సమస్యలకు రాజ్యాంగపరంగా, చట్టబద్ధంగా పరిష్కారం చూపారు. అంబేద్కర్ రాసిన గ్రంథాలు ఆయనలోని ప్రజ్ఞాశాలిని, ఆర్థికవేత్తను, సంఘసంస్కర్తను, న్యాయశాస్త్రవేత్తను మనకు పరిచయం చేస్తాయి. ప్రసిద్ధ రచయత బెవెర్లీ నికోలస్ భార తదేశపు ఆరుగురు గొప్ప మేధావుల్లో అంబేద్కర్ ఒకరని పేర్కొన్నారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రపంచ మేధావిగా ఐక్యరాజ్యసమితి గుర్తించి ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించింది.
–ఎస్.శ్యామల