ప్రజాస్వామ్యం అంటే ఒక ప్రభుత్వ రూపం మాత్ర మే కాదని, ప్రభుత్వం అంటే పెత్తనం చెలాయించే ఒక సాధనం కాదని, సకల మానవ సంబంధాలను అది ప్రతిఫలించాలని అంబేద్కర్ పేర్కొన్నారు. భూమిని, ఇతర కీలకమైన పరిశ్రమలను జాతీయం చేయాలని అంబేద్కర్ ప్రతిపాదించారు. అట్టడుగువర్గాల ప్రతినిధిగా అంబేద్కర్ 1920లో పాత్రికేయుడిగా రంగప్రవే శం చేసి ‘మూక్ నాయక్’ పత్రిక ద్వారా అణగారిన జనాలకు గొంతునిచ్చారు. ఆ అనుభవంతో అంబేద్కర్ పత్రికకు ఉండవలసిన స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలోని 19(1) ఆర్టికల్లో పొందుపరిచారు. అలాగే సమగ్ర స్వతంత్ర న్యాయవ్యవస్థ అన్న భావనను అంబేద్కర్ అభివృద్ధి చేశారు. ఆర్థిక కమిషన్, భాషా కమిషన్, ఏక పౌరసత్వం తదితర భావనలను అంబేద్కరే అభివృద్ధి చేశారు. ఆయుధాలను ఉపయోగించడం కన్నా, మనిషే ఆయుధంగా మారడం ఎలాగో నిరూపించారు. వెనుకబడిన జాతులు, కులాల గురించే కాకుండా యావత్ దేశానికి సంబంధించి తపనపడ్డారు. సమగ్ర వికాసంతో కూడిన జాతి నిర్మాణానికి అవసరమైన నియమాలను రూపొందించారు.
–మాందాల భాస్కర్