పంటలకు ఉన్న ప్రస్తుత కనీస మద్దతు ధర నిర్ణయ విధానం అసంబద్ధంగా ఉన్నది. ద్రవ్యోల్బణంపై ఆధారపడి కనీస మద్దతు ధర నిర్ణయించటమే రైతులకు ఆదాయ భద్రత కలిగిస్తుంది. ఈ విషయాన్ని పట్టించుకోకుండా కేంద్రం రైతులను మార్కెట్కు బలి చేస్తున్నది.
1960ల తర్వాత హరిత విప్లవం కారణంగా దేశం ఆహారోత్పత్తిలో గణనీయ వృద్ధి సాధించింది. ఈ నేపథ్యంలోంచే.. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) విధానం 1967లో వచ్చింది. ఎంఎస్పీ రెండు ప్రధాన లక్ష్యాలతో ముందుకు వచ్చింది. రైతులకు ఎంఎస్పీతో ఆర్థిక భద్రతను చేకూర్చటంతో పాటు, పేదలకు ఆహారభద్రతను కల్పించటం ముఖ్యమైనది. ఈ విషయంలో ఆశించిన లక్ష్యాలను సాధించినా మద్దతు ధర కల్పించటంలో మాత్రం కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది.
ఆర్థిక, సాంకేతిక కారణాల ఆధారంగా ఎంఎస్పీ నిర్ణయ తీరు ను రైతులు ప్రశ్నిస్తున్నారు. మొదటిది-2014లో బీజేపీ అధికారంలోకి వచ్చేముందు ఎన్నికల ప్రచారంలో రైతులకు అనేక హామీలిచ్చింది. అందులో ఒకటి- స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం.. ఎంఎస్పీ కల్పిస్తారని రైతులు ఆశించారు. వ్యవసాయ ఉత్పత్తుల ‘కనీస మద్దతు ధర’ ఉత్పత్తి ఖర్చు కన్నా 50 శాతం ఎక్కువగా ఉండాలని స్వామినాథన్ కమిషన్ తెలిపింది. కానీ, ఎంఎస్పీ పెంపు 2014 తర్వాత అంతకు ముందున్న దానికన్నా తక్కువ ఉన్నది. దీంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది.
2007-08, 2013-14 మధ్యకాలంలో వరి కనీస మద్దతు ధర సుమారు రెండు రెట్ల కన్నా ఎక్కువ పెరిగింది. కానీ 2013-14, 2021-22 మధ్య కాలంలో 48 శాతమే పెరిగింది. మద్దతు ధరను దశలవారీగా పెంచినా స్వామినాథన్ కమిషన్ సూచించిన దానిలో సగం కూడా ఎందుకు లేదని రైతు సంఘాల నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. రెండవది- 2014 తర్వాత కాలంలో ఉత్పత్తి ఖర్చును లెక్కించటం విషయంలో తీవ్ర వివాదం నెలకొన్నది. మద్దతు ధర నిర్ణయంలో కీలక భూమిక పోషించే అనేక ఇతర కారణాలతో పాటు, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ నిర్ణయించే ఉత్పత్తి ఖర్చు లెక్కలే కీలకంగా ఉంటాయి.
స్వామినాథన్ సిఫారసుల ప్రకారం.. 2006లో ఉత్పత్తి ఖర్చులపై 50 శాతం అధికంగా మద్దతు ధర నిర్ణయించారు. వ్యవసాయానికి అవసరమయ్యే అన్ని రకాల ఇన్పుట్స్ ఖర్చులు, తరుగుదల, మూల పెట్టుబడిపై వడ్డీ, వ్యవసాయ కుటుంబం వెచ్చించిన పనిదినాల శ్రమ విలువ, భూమి వాస్తవ కౌలు విలువ, స్థిరపెట్టుబడిపై వడ్డీ, వ్యవసాయ నిర్వహణకుగాను అయిన ఖర్చుల కింద 10 శాతం కలుపుకొని మొత్తం ఉత్పత్తి ఖర్చును నిర్ణయిస్తారు. ఉత్పత్తి ఖర్చుకన్నా 50 శాతం అధికంగానే మద్దతుధర ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. కానీ స్థిర మూలధనంపై వడ్డీ, వ్యవసాయ నిర్వహణలో రైతు చేసిన శ్రమకు విలువ కట్టడం లాంటిదాన్ని కేంద్రం మద్దతు ధర నిర్ణయంలో లెక్కలోకి తీసుకోలేదు! ఇక భూమి కౌలు తదితర ఖర్చుల సంగతి సరేసరి. వాటిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోనే లేదు. మద్దతు ధర నిర్ణయించటంలో అనుసరించిన ‘సవరింపు విధానం’లో ఉత్పత్తి ఖర్చును తక్కువగా గణించింది.
మూడవది- 2014 తర్వాత వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా వ్యవసాయానికి అవసరమయ్యే ఎరువుల ధరలు సుమారుగా రెండింతలు పెరిగాయి. వ్యవసాయ కూలీల వేతనాలు కూడా రెండు రెట్లు అయ్యాయి. వ్యవసాయంలో వినియోగించే యంత్రాల ఖర్చులు కూడా (పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదలతో) రెట్టింపయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఏటా 8-10 శాతం ఉత్పత్తి ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి.
నాలుగవది- ఇటీవలి కాలంలో ప్రధాన పంటల దిగుబడిలో స్తబ్దత నెలకొన్నది. వరి దిగుబడిలో ఏటా ఒక శాతం పెరుగుదల ఉన్నా, 2014 తర్వాత పత్తి దిగుబడిలో ఎలాంటి పెరుగుదల లేదు. ఈ విధమైన పంటల దిగుబడితో ఏటా పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులను కలుపుకొని, ద్రవ్యోల్బణం అనుసరించి కనీస మద్దతు ధరను పెంచాల్సిన అవసరం ఉన్నది. కానీ 2014-21 మధ్య కాలంలో సరాసరి కనీస మద్దతు ధర ఏ రీతిన పెంచారో అది, నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి సమానంగా ఉన్నది.
కాబట్టి కనీస మద్దతు ధర పెంపులో పెరుగుదల లేని స్థితే ఏర్పడింది. 2014 తర్వాత పెరిగిన మద్దతు ధరలను ద్రవ్యోల్బణమే మింగేసింది. ఇంకా చెప్పుకోవాల్సిందేమంటే.. ఉత్పత్తి ఖర్చుల ప్రభావం, పెరిగిన దిగుబడి అనేవి మద్దతు ధర పెరిగినా ద్రవ్యోల్బణంతో ప్రయోజనం లేకుండాపోయింది. ఈ పరిస్థితుల్లో వాస్తవ రైతుల రాబడి 2014 తర్వాత తగ్గినట్లయ్యింది. దీంతో మద్దతు ధర పెంపుతో ప్రయోజనం లేకుండా పోతున్నది.
ఈ నేపథ్యంలో.. మద్దతు ధర నిర్ణయానికి సరికొత్త విధానం అవసరం. ప్రస్తుతం అనుసరిస్తున్న ‘సవరింపు’ విధానాన్ని అనుసరించి మద్దతు ధర నిర్ణయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. రైతులకు ప్రయోజనం చేకూరాలంటే.. ప్రస్తుతం అనుసరిస్తున్న సంక్లిష్ట ఉత్పత్తి ఖర్చు ఆధార మద్దతు ధర నిర్ణయాన్ని, ద్రవ్యోల్బణ ఆధారితంగా మార్చాలి. ద్రవ్యోల్బణ రేటు కూడా ఏటా వినియోగ వస్తువుల ధరల ఆధారంగా నిర్ణయించాలి.
(వ్యాసకర్త: జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో ఆర్థికశాస్త్ర ఆచార్యులు)‘ది హిందూ’ సౌజన్యంతో…
ఉద్యోగులకు జీతభత్యాల పెంపు విషయంలో ‘డీఏ’ను ఎలా నిర్ణయిస్తారో, అలాగే మద్దతు ధర నిర్ణయంలో ద్రవ్యోల్బణ రేటును కూడా నిర్ణయించాలి. ప్రభుత్వం ద్రవ్యోల్బణం పునాదిగా మద్దతు ధర నిర్ణయాన్ని ఆర్థిక పునాదిగా చేసుకోవాలి. అప్పుడే రైతులు, వ్యవసాయ కూలీలకు మద్దతు ధర అనేది దన్నుగా నిలుస్తుంది.
–ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య