2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, స్వామినాథన్ సిఫారసులను పూర్తిగా అమలు చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఆ హామీలను అమలు చేయటం కాదుకదా.. వాటికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నది. వ్యవసాయరంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచడం మానేసి, రానురాను తగ్గిస్తున్నది.
కేంద్రం ధోరణి ఇలా ఉన్నప్పటికీ.. రాష్ర్టాలు మాత్రం సాగుకు తగిన ప్రాధాన్యమిస్తున్నాయి. ఆ రంగంలో పెట్టుబడులు పెంచుకుంటూ పోతున్నాయి. ‘ఫౌండేషన్ ఫర్ అగ్రేరియన్ స్టడీస్’ సంస్థ నిర్వహించిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
బెంగళూరుకు చెందిన ‘ఫౌండేషన్ ఫర్ అగ్రేరియన్ స్టడీస్’ 2011-12 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 వరకు అన్ని రాష్ర్టాల బడ్జెట్లను, కేంద్రప్రభుత్వ బడ్జెట్లను విశ్లేషించింది. ఈ పరిశోధనకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ ఆర్.రామకుమార్ నాయకత్వం వహించారు. జేఎన్‌యూకి చెందిన రాయదాస్, సెంటర్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్‌కి చెందిన అభినవ్ సూర్య తదితరులు ఇందులో పాలుపంచుకున్నారు. గత నెల 19న వ్యవసాయ రంగంపై జరిగిన ఓ ఆన్లైన్ సదస్సులో పరిశోధనపత్రాన్ని సమర్పించారు.
గడిచిన దశాబ్దకాలంగా వ్యవసాయంలో స్థూల విలువ జోడింపు (గ్రాస్ వాల్యూ ఎడిషన్-జీవీఏ)లో కేంద్రప్రభుత్వ వ్యయం గణనీయంగా తగ్గిపోయినట్టు పరిశోధన పత్రం స్పష్టం చేసింది. ఒక వస్తువు మొత్తం విలువలో దాని ఉత్పత్తికయ్యే వ్యయం మినహాయించగా నికరంగా వచ్చే విలువనే జీవీఏ అంటారు. ఒక రంగం నికర ఉత్పాదకతను లెక్కించడానికి ఇది కీలకం. మన దేశంలో సరళీకరణ, ప్రపంచీకరణ మొదలైన నాటి నుంచి, కేంద్రప్రభుత్వాలు ఒకవైపు సుస్థిర వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఇంకోవైపు వ్యవసాయంపై కేటాయింపులు తగ్గించాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాల వ్యయం పెరుగడం విశేషం.
సాగుకు కీలకమైన నీటి పారుదల, పంట పండే దశ, పంట కోత దశల్లో కేంద్రప్రభుత్వం ఖర్చుని గణనీయంగా తగ్గించగా రాష్ర్టాలు పెంచాయని వెల్లడైంది. భారత వ్యవసాయరంగానికి ప్రభుత్వ దన్నే కీలకం. గతంలో కేంద్రంలో అధికారం చేపట్టిన ప్రభుత్వాలు భారీ ప్రాజెక్టుల నిర్మాణం, నూతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, రైతులకు అనుకూలంగా ధరల్లో జోక్యం, మార్కెట్ కమిటీల వంటి వాటి ద్వారా మార్కెటింగ్ సౌకర్యం కల్పించటమేగాక ప్రభుత్వపరంగా భారీ పెట్టుబడులు పెట్టటం వల్ల హరిత విప్లవం సాధ్యమైంది. దేశం కరువు కోరల నుంచి బయటపడి స్వయంసమృద్ధి సాధించింది. కానీ, ఇప్పుడేమో కేంద్రప్రభుత్వాలు ఈ బాధ్యత నుంచి మెల్లగా తప్పించుకొంటున్నాయి.
ప్రజా సంక్షేమానికి, సదుపాయాలకు ప్రపంచంలోకెల్లా జీడీపీలో అతి తక్కువగా భారతదేశం ఖర్చు పెడుతున్నది. అమెరికాలో ఇది 33 శాతం ఉండగా, ఇటలీలో 43 శాతం ఉంది. మన దేశంలో ఇది 15 శాతం మాత్రమే. అతి కీలకమైన విద్య, వైద్య రంగాలనే తీసుకుంటే మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సగటున 10 శాతం ఖర్చుపెడుతుండగా భారత్ కేవలం 1.5 శాతం మాత్రమే వ్యయం చేస్తున్నది. కేంద్రప్రభుత్వాలు ఈ విధంగా ప్రజలకు సంబంధించిన బాధ్యతల నుంచి తప్పించుకుంటూ ఉండగా, ఆ భారం రాష్ర్టాలపై పడుతున్నది. కేంద్రప్రభుత్వం తప్పించుకునే వైఖరి వల్ల సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటున్నదని పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన రామకుమార్ చెప్పారు.
ఇదే సదస్సులో ‘అఖిల భారత కిసాన్ సభ’ సంయుక్త కార్యదర్శి విజ్జు కృష్ణన్ మాట్లాడుతూ.. వ్యవసాయరంగంపై ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తుండటం వల్ల ఆ రంగంపై ఆధారపడ్డ అనేక పేద కుటుంబాలు, ముఖ్యంగా పేద మహిళల పరిస్థితి దారుణంగా తయారవుతున్నదని చెప్పారు. ప్రభుత్వ వ్యయం తగ్గింపు వల్ల సన్నకారు రైతులు, మహిళా రైతులు, రైతు కూలీలు మరింతగా పేదరికంలోకి జారుకుంటున్నారని అన్నారు. రైతు, రైతుకూలీ సంఘాలు 1990 నుంచి ఈ విధానాలను ఖండిస్తున్నాయి అని తెలిపారు.
ప్రభుత్వ సహాయం తగ్గటం వల్ల రైతులు అధికవడ్డీలకు అప్పులు తెచ్చుకొని, రుణచట్రంలో ఇరుక్కొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మోదీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి, ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి వాటి సంగతే పక్కన పెట్టింది. అంతేకాదు, రైతు వ్యతిరేక చర్యలతో చట్టాలను తీసుకొస్తున్నది.
ప్రజా సంక్షేమానికి, సదుపాయాలకు ప్రపంచంలోకెల్లా జీడీపీలో అతి తక్కువగా ఖర్చు పెడుతున్న దేశం భారత్. అమెరికాలో ఇది 33 శాతం ఉండగా, ఇటలీలో 43 శాతం ఉంది. మన దేశంలో ఇది 15 శాతం మాత్రమే. అతి కీలకమైన విద్య, వైద్య రంగాలనే తీసుకుంటే మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సగటున 10 శాతం ఖర్చుపెడుతుండగా భారత్ కేవలం 1.5 శాతం మాత్రమే వ్యయం చేస్తున్నది.
కేంద్రప్రభుత్వాలు ప్రజలకు సంబంధించిన బాధ్యతల నుంచి తప్పించుకుంటూ ఉండగా, ఆ భారం రాష్ర్టాలపై పడుతున్నది.