ఎవరి మీద కోపం వచ్చినా ఐటీ, ఈడీ, సీబీఐల దాడులా? మరి గింతన్యాయమా? అని ఎవరైనా వాపోతే బీజేపీ అంటే గిట్టనివాళ్లు అట్లాగే మాట్లాడుతారనుకుంటారు. కానీ ఈ మాటలన్నది ఎవరో కాదు, స్వయానా ఒక కేంద్ర మంత్రి గారే సెలవు ఇచ్చినట్టు లోకమాత పేపర్లో తాటికాయంత అక్షరాలతో రాశారు. బయటివారి మీద అయితేనేమో దాడులు, పార్టీలో పడని వారైతేనేమో బ్లాక్ లిస్టులని సదరు అమాత్యుడు వాపోయినట్టు రాశారు. మోదీ- షాకు అసలు పొసగడం లేదంటూ నే వాళ్లే లోలోపల కొట్టుకుచస్తున్నారని వార్త సారాంశం. అయితే మోదీని దించాలంటే తమకు పెద్ద పనేం కాదని, 252 మంది ఎంపీలు తమవైపే ఉన్నారని సదరు మంత్రి చెప్పినట్టు పేర్కొన్నారు. అంతెందుకు స్వయానా రాజ్‌నాథ్‌సింగ్ కుమారుడు, ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే పంకజ్ సింగ్‌ను మంత్రివర్గంలో చేర్చుకోకుండా సీఎం యోగికి ప్రధాని మోదీ నుంచే ఫోన్ వెళ్లినట్టు సదరు నాయకుడు బయటపెట్టి వాపోయారని ఆ పత్రికా కథనం.
-వెల్జాల