పిల్ల పుట్టకముందే ఖుల్ల కుట్టిపెట్టిండంట ఎనకటికి ఒకడు. టీపీసీసీ అధినేత రేవంత్‌రెడ్డి వ్యవహారం కూడా అచ్చంగా అలాగే ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసినట్టు, మంత్రివర్గంలోకి ఎవరెవర్ని తీసుకునేది అప్పుడే ప్రకటించేస్తున్నారు. ఇప్పటికే షబ్బీర్ అలీ, మల్లురవి, భట్టి విక్రమార్క, చిన్నారెడ్డి, సంపత్ కుమార్, మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తారని ప్రకటించారు. గాంధీ భవన్‌కు రెగ్యులర్‌గా వచ్చే మహిళా నేతలకే మంత్రి పదవులు దక్కుతాయని కూడా మెలికపెట్టారు. అధిష్ఠానం ప్రమేయం లేకుండానే ఎమ్మెల్యే టిక్కెట్లు, మంత్రి పదవులు భర్తీ అయిపోతుంటే ఇక మా సంగతేంటీ? అని సీనియర్ నేతలు నేరుగా రాహుల్‌గాంధీ దృష్టికే తీసుకెళ్లారు. ఇక ముందు అలాంటి ప్రకటనలు చేయవద్దని ఆయన హెచ్చరించారు. ఈ విషయాన్ని ఇక్కడిదాకా ఎందుకు తీసుకువచ్చారు? సీనియర్ల కోసం ఎలాగూ తత్కాల్ కోటా ఉంటుంది కదా అని బెర్త్‌లు ఖరారైన నేతలు సర్ది చెప్పారట.