రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై నెల కావస్తున్నది. విద్యార్థుల దీన మోములతో కళాశాలలు దర్శనమిస్తున్నాయి. ఉస్మానియా లాంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు సైతం మనుగడ కోసం విద్యార్థుల జేబులకు చిల్లులు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి తలెత్తడం కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనం.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేటి ప్రభుత్వ పెద్దలు అనేక హామీలతో హోరెత్తించారు. విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తామని గొప్పలు చెప్పారు. బస్సు యాత్రల పేరిట మేధావులు వాళ్లకు వంత పాడారు. కానీ, నేడు విద్యార్థుల దుస్థితి గురించి మాట్లాడటానికి కనుచూపు మేరలో ఏ ఒక్కరూ కనిపించడం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 (4), (5) ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు దేశంలో విద్య ప్రాధాన్యతను నొక్కి చెబుతున్నాయి. ఈ సూత్రాలకు విరుద్ధంగా నేడు తెలంగాణలో పాలన సాగుతున్నది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాలను సర్కారు ఉద్దేశపూర్వకంగా నీరుగారుస్తున్నది. దీంతో లక్షల మంది పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల్లో విద్యారంగం లేనే లేదు. అందుకే సుమారు రూ.8 వేల కోట్ల వరకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పేరుకుపోయాయి. ముఖ్యమంత్రి వద్ద ఉన్న విద్యాశాఖ సమస్యలు సంక్షోభ స్థాయికి చేరాయి. పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు గతంలో సమ్మెబాట పట్టాయి. వారితో చర్చలు జరిపి సమస్య పరిష్కరిస్తామని ఉన్నత విద్యామండలి ఇచ్చిన హామీలు నీటిపై రాతలయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి పరిధిలో 235 ప్రభుత్వ, 805 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు 285, ఎంటెక్ కళాశాలలు 99, ఎం ఫార్మసీ కళాశాలలు 15, పీజీ కాలేజీలు 313, లా కాలేజీలు 26, ఎడ్యుకేషన్ కాలేజీలు 206, మొత్తంగా 14 రకాల కోర్సులకు సంబంధించి 2,479 కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 7,20,948 మంది విద్యాభ్యాసం చేయవచ్చు. కానీ, 2024-25 గణాంకాల ప్రకారం.. వీటిలో 4,13,508 మంది విద్యార్థులు మాత్రమే ఆయా విభాగాల్లో చదువుకుంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో విడుదల కాకపోవడమే అందుకు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని వివిధ విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, యాజమాన్యాలు నిరసనలు తెలుపుతూనే ఉన్నాయి. కానీ, ప్రభుత్వం వారి ఆవేదనను పట్టించుకోవడం లేదు.
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైనా విద్యాశాఖ మంత్రిని నియమించలేదు. దీంతో విద్యార్థుల గోడు వినేవారు లేకుండాపోయారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు, సంఘాలు విద్యాసంస్థల నిర్వహణలో ఎదురవుతున్న ఆటంకాలను ప్రభుత్వ పెద్దలతో మొర పెట్టుకుంటూనే ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో జీతాలు, అద్దెలు, కళాశాల నిర్వహణ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు తలకు మించిన భారంగా మారుతున్నది. ఉచిత విద్య, ఫీజు రాయితీల హామీలు ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు ఓట్లు తెచ్చిపెడతాయి. కానీ, ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వహణ అట్లా సాధ్యం కాదు కదా? అందుకే విద్యార్థుల నుంచి కళాశాలల యాజమాన్యాలు ఫీజులను వసూలు చేస్తున్నాయి. కొన్ని చోట్ల విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో సమస్యను ప్రభుత్వం సానుభూతితో పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
-డాక్టర్ ఎస్.నాగేశ్వరరావు,
99486 66802