కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన తర్వాత గత ఆరేడేండ్లలో వరుసగా భారీ వర్షాలు ఎగువ గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్నందువల్ల శ్రీరాంసాగర్ జలాశయంలోకి పూర్తిస్థాయిలో నీళ్లు చేరుకున్నాయి. దీనితో ‘కాళేశ్వరం అవసరమే లేద’నే వితండవాదం ప్రచారమవుతున్నది. రాష్ట్రంలో సాగునీటి చరిత్ర, పరిస్థితులపై ఏ మాత్రం అవగాహన, అధ్యయనం, లేనివారే ఇలాంటి వాదనలను ముందుకుతెస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, నిజాంసాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి యాభై ఏండ్లలో ఎన్నిసార్లు నదిలోకి నీళ్లను వదిలారు. వరుస కరువుల వల్లనే కదా ఉపాధి లేక ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వలసలు మొదలైనాయి? ఈ కరువు వల్లనే కదా వేలాదిగా యువకులు నక్సలైట్లుగా మారింది?
కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వ్యయంలో రీ-ఇంజినీరింగ్ చేసిన మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల బ్యారేజీలు, పంపులు, సబ్స్టేషన్ల ఖర్చు 10-12 శాతం కూడా కాదు. తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నప్పుడు, ఎగువ గోదావరి నుంచి వరద రానప్పుడు, ముఖ్యంగా వర్షాకాలం నాట్ల కోసం అవసరమైన నీటిని నిల్వ చేసుకోవడానికి, వేసంగి పంటలకు నీరందించడానికి, గోదావరిలో తెలంగాణ వాటా జలాల పూర్తి వినియోగానికి, పాత ప్రాజెక్టుల క్రింది సుమారు 19-20 లక్షల ఎకరాల స్థిరీకరణకు ప్రాజెక్టుల రీ-ఇంజినీరింగ్ కేసీఆర్ ప్రభుత్వం చేపట్టింది.
1979లోనే బచావత్ అవార్డు ద్వారా ఉమ్మడి రాష్ర్టానికి లభించిన 1480 టీఎంసీలలో నాలుగింట మూడువంతుల నీరు తెలంగాణ ప్రాంతం లో వినియోగించుకునే అవకాశం ఉన్నా ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలోని కొన్ని వాగులపై మాత్ర మే నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించాయి తప్ప ప్రధాన గోదావరిపై శ్రీరాంసాగర్ దిగువన ఒక ఎల్లంపల్లి తప్ప మరే బ్యారేజీ గానీ, డ్యాంను కానీ నిర్మించే ప్రయత్నం చేయలేదు. దీనికి కారణం గోదావరి డెల్టాలోని 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఖరీఫ్, రబీ పంటలకు అవసరమైన స్టోరేజీ లేక తెలంగాణలోని వాగుల నుంచి,, ప్రాణహిత నుంచి వచ్చే నీటిని మళ్లించుకుపోవాలనే కోస్తాంధ్ర దురాలోచనే. 2001లో తెలంగాణ ఉద్యమ ఫలితంగా 38 టీఎంసీలతో దేవాదుల ప్రాజెక్టు మొదలుపెట్టినా గోదావరిపై బ్యారేజీ నిర్మాణం చేపట్టలేదు. బొందలో నుంచే నీటిని ఎత్తిపోసుకోమని సూచించారు అప్పటి సీఎం చంద్రబాబు. ఒకవైపు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నా దేవాదుల ప్రాజెక్టు పనులు వేగవంతం చేయలేదు, కేసీఆర్ పాలనలోనే దీని క్రింది ఆయకట్టుకు తొలిసారి నీరందింది.
కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టుల రీ-ఇంజినీరింగ్ ఫలితంగానే మొట్టమొదటిసారి గోదావరి జలాల్లో సంపూర్ణ వాటా (968 టీఎంసీల)ను వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని 7 లింకుల్లోని 28 ప్యాకేజీల ద్వారా 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టు 18,75,000 ఎకరాల ప్రాత ప్రాజెక్టుల (సింగూరు, నిజాంసాగర్, ఘణపురం ఆనికట్, శ్రీరాంసాగర్ వరద కాల్వ, మొదటి, రెండవ దశ, అప్పర్ మానేరు, ఎల్లంపల్లి, చెరువుల క్రింది) స్థిరీకరణతో పాటు చెన్నూరు ఎత్తిపోతల పథకం (లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టు) వంటివి మరెన్నో చేపట్టే అవకాశం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాధ్యమైంది. ప్రధాన గోదావరి నదిలో మణుగూరు సీతమ్మసాగర్ నుంచి ఖానాపూర్ సదర్మాట్ బ్యారేజీ బ్యాక్ వాటర్ వరకు 312 కిలోమీటర్ల దూరం సుమారు 100 టీఎంసీలు, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరులో 100 టీఎంసీలు మల్లన్నసాగర్, కొండ పోచమ్మ, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, అనంతసాగర్, రంగనాయకసాగర్, బస్వాపూర్, చెరువులు, ఇతర జలాశయాల్లో కలిపి మరో 100 టీఎంసీలకు పైగా మధ్య గోదావరి ప్రాంతంలో గోదావరి జలాలను నిల్వ చేసుకునే అవకాశం కాళేశ్వరంలోని వివిధ విభాగాల ద్వారా ఏర్పడింది. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ప్రభుత్వం సుమారు రూ.30 వేల కోట్ల అదనపు ఖర్చుతో మూడో టీఎంసీ ఎత్తిపోతలకు కాళేశ్వరం నుంచి ఏ ర్పాట్లు చేసింది. దాదాపు పనులన్నీ పూర్తయ్యాయి.
మేడిగడ్డకు దిగువన గోదావరి నదిపై సమ్మక్క బ్యారేజీ నిర్మాణాన్ని ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది. దేవాదుల ప్రాజెక్టుకు అవసరమైన 38.18 టీఎంసీల నీటిని ఎత్తిపోసి (3 దశల్లో) 5,57,654 ఎకరాలకు సాగు నీరందించే అవకాశం ఈ సమ్మక్క బ్యారేజీ ద్వారా సాధ్యమైంది. దీనిలో 7 టీఎంసీలను నిల్వ చేయవచ్చు.
వై.ఎస్ 2009 ఎన్నికలకు ముందు కంతనపల్లి వద్ద ఇదే బ్యారేజీకి శంకుస్థాపన చేసినా తట్టెడు మన్ను తీయలేదు. కేసీఆర్ ప్రభుత్వం రికార్డు టైం మూడేండ్లల్లో ఈ బ్యారేజీని నిర్మించింది. కాంతనపల్లి వద్ద బ్యారేజీని నిర్మిస్తే 12 ఆదివాసీ గ్రామాలు, 11 వేల ఎకరాల ఆదివాసీ భూములు ముంపునకు గురవుతాయని భావించిన కేసీఆర్ ప్రభుత్వం ఈ బ్యారేజీని 20 కిలోమీటర్ల ఎగువన గల తుపాకులగూడెంకు మార్చి రీ-డిజైన్ చేసింది. దీనివల్ల ఏ గ్రా మం గానీ, ఒక్క ఎకరం గానీ ముంపు లేదు. పైగా కంతనపల్లి బ్యారేజీలో ముంపునకు గురవుతుందనుకున్న ఆయకట్టుకు సాగు నీరందించే అవకాశం ఏర్పడింది. సమ్మక్క బ్యారేజీ నుంచి శ్రీరాంసాగర్ రెండవ దశ ఆయకట్టు 4,40,000 ఎకరాలకు నీరందించే అవకాశం ఏర్పడింది. కాకతీయులు నిర్మించిన రామప్ప, గణపురం, లక్నవరం, పాకాల వంటి పెద్ద చెరువుల కింద ఆయకట్టు స్థిరీకరణ, కొత్త ఆయకట్టు కల్పన సాధ్యమైంది.
సమ్మక్క బ్యారేజీకి దిగువన దుమ్ముగూడెం పాత ఆనికట్‌కు కొద్దిగా ఎగువన సీతమ్మసాగర్ ప్రాజెక్టును ప్రారంభించింది కేసీఆర్ ప్రభుత్వం. జలయజ్ఞంలో భాగంగా 2005లో అప్పటి సీఎం వైఎస్ చేపట్టిన రాజీవ్-దుమ్ముగూడెం, ఇందిరాసాగర్ ప్రాజెక్టులకు రీ-ఇంజినీరింగ్ అవసరమైం ది. రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఇందిరాసాగర్ రుద్రమకోట ప్రాజెక్టు ప్రాంతం (7 మండలాలు) ఆంధ్రలో కలపడం వల్ల సమీకృత సీతారామ ప్రాజెక్టుకు 2018, ఫిబ్రవరి 16న కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం చాలావరకు పూర్తయింది. 6,74,000 ఎకరాలకు సాగునీటిని వివిధ దశల ఎత్తిపోతలు, ప్రవాహ కాల్వల ద్వా రా అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు రీ-డిజైనింగ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 27.72 టీఎంసీల వినియోగంతో 3,33,000 ఎకరాలకే నీరందించాలని రాజీవ్-దుమ్ముగూ డెం, ఇందిరాసాగర్-రుద్రమకోట ప్రాజెక్టులను ప్రారంభించింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా కిన్నెరసాని వన్యప్రాణి నివాస ప్రాంతంలో 18 కిలోమీటర్ల కాల్వ నిర్మించడానికి అనుమతులు కూడా ఆటంకంగా మారడం, 27.72 టీఎంసీలను వినియోగించాల్సిన ప్రాజెక్టులలో కేవలం 1.2 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం మాత్రమే అదనంగా కల్పించడం తదితర కారణాల వల్ల ఈ ప్రాజెక్టును రీ-డిజైనింగ్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. సమగ్ర సీతారామ ఎత్తిపోతల పథకంలో 36.57 టీఎంసీల నీటిని గోదావరిలో నిల్వ చేయడంతో పాటు ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన చెరువుల నీటి నిల్వ సామర్ధ్యాన్ని కూడా 12.38 టీఎంసీలకు పెంచింది. గోదావరిలో +47.50 మీటర్ల ఎత్తున గల దుమ్ముగూడెం నుంచి +523.60 మీటర్ల ఎత్తున ఉన్న సింగూరు డ్యాం వరకు, ఛత్తీస్‌గఢ్-ఏపీ సరిహద్దులోని భద్రాది కొత్తగూడెం జిల్లా నుంచి మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వరకు విస్తరించిన మొత్తం తెలంగాణ ప్రాంతంలోని సుమా రు 60-70 లక్షల ఎకరాలకు 1000 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించాలనే మహా సంకల్పంతో కేసీఆర్ వివిధ ప్రాజెక్టులకు రీ-డిజైన్ చేస్తే కేవలం మేడిగడ్డలోని రెండు పియర్లు కుంగితే ఆ మహానేత పేరు ప్రతిష్ఠలను దిగజార్చే విధంగా సీఎం రేవంత్ చేస్తున్న కుట్రలను ప్రజలు ప్రతిఘటించాలి.
2025, ఆగస్టు 22న హైదరాబాద్‌లో ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు రేవంత్ ప్రభుత్వం అంగీకరించడం మేడిగడ్డను శాశ్వతంగా జలసమాధి చేయడానికే. దేవాదుల, సీతారామ ప్రాజెక్టులను ఎండబెట్టి బనకచర్ల ద్వారా ఆంధ్రకు గోదావరి నీటిని తరలించే కుట్ర కోణం కూడా దీని వెనుక దాగి ఉన్నది. రేవంత్ సర్కార్ కుట్రల వల్ల ‘గోదావరి, కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి, పచ్చని మాగాణంలో పసిడి సిరులు చూ డాలి. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండా లి. స్వరాష్ట్రం తెలంగాణ స్వర్ణ యుగం కావాల’ని యావత్తు తెలంగాణ గళాల్లో మార్మోగిన ఆశయా లు, ‘నా తెలంగాణ – కోటి ఎకరాల మాగాణం’ అని స్వప్నించి ఆ దిశగా కృషిచేసిన కేసీఆర్ కలలు బూడిద పాలు కావాల్సిందేనా. మన బతుకు మళ్లీ బొంబాయి, దుబాయి, బొగ్గు బాయేనా?
(వ్యాసకర్త: చైర్మన్, భారత వర్షాధార నదీ పరీవాహక ప్రాంతాల కౌన్సిల్)
-వి.ప్రకాశ్