ఏ వ్యక్తి అయినా ముఖ్యమంత్రి పదవి చేపట్టేటప్పుడు రాగద్వేషాలు లేకుండా పరిపాలన చేస్తానని రాజ్యాంగం సాక్షిగా, దైవసాక్షిగా ప్రమాణం చేస్తారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అలానే చేశాడు. కానీ, ఈ ఒక్క సంవత్సరంలో తన తీరు చూస్తే పాలన లేదు కానీ, కేవలం పగ, ప్రతీకారం మాత్రమే కనిపిస్తున్నది. మొదట తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా బురద జల్లడానికి ఒక కమిషన్ ఏర్పాటుచేశారు.
ఆశ్చర్యకర విషయం ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బీజేపీ సిద్ధాంతకర్తను ఆ కమిషన్‌కు చైర్మన్‌గా నియమించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే విద్యుత్తు సమస్యను పరిష్కరించినందుకు కేసీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ కమిషన్ చైర్మన్ మీడియా పబ్లిసిటీ కోసం బురదజల్లే ప్రయత్నం చేశారు. దీంతో సుప్రీంకోర్టు ఆయన తీరును తప్పుపడుతూ కమిషన్ చైర్మన్‌ను పదవి నుంచి తొలగించింది. రేవంత్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు ఇది మొదటి చెంపపెట్టు.
2024లో ఇచ్చిన గ్యారెంటీలను పక్కనపెట్టి, చెప్పిన 420 హామీలను మరిచి కేవలం కేసులు, బెదిరింపులు, దాడులు, జైలు, ఇదే అజెండాపై రేవంత్ ప్రభుత్వం దృష్టిపెట్టింది. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల మెట్రో కు ఆర్థిక నష్టాలు వచ్చాయని దేశంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థ సీఎఫ్‌వో వ్యాఖ్యానిస్తే ఆయనను అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టు సీఎం రేవంత్ ఒక జాతీయ చానల్లో చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు సంబంధించి కీలక అంశాలు ఉన్నప్పుడు అసెంబ్లీలో చర్చించకుండా కీలక సమయాన్ని సినీ పరిశ్రమ, సినీ నటులను టార్గెట్ చేయడానికి ఉపయోగించారు. కొడంగల్ మహిళలపై అశ్లీల దాడులు, రైతులకు బేడీలు వేసి జైలుపాలు చేయడం, సామాజిక మాధ్యమా ల్లో ప్రభుత్వ వైఫల్యాలను విద్యుత్తు కోతలను ప్రశ్నిస్తున్న పౌరులపై అక్రమ కేసులు వేయ డం, ఒక్క సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోలేక కేసీఆర్ ప్రభు త్వం ఇచ్చిన ఉద్యోగాలకే ఫొటోలు దిగుతూ ప్రచారం చేసుకుంటున్నారని నిలదీసిన యువతపై లాఠీచార్జి చేయడం, పోలీస్ బెటాలియన్ల కుటుంబాలను రోడ్డుపైకి లాగడం, న్యాయం చేయాలనడిగిన వారిని ఉద్యోగం నుంచి తొలగించడం, ఇవన్నీ కూడా ప్రజలను ఇబ్బందులు పెట్టే పాలన కిందకే వస్తాయి.
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఎప్పుడూ రేవంత్ అభద్రతాభావంతో వ్యక్తిగతంగా కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. రేవంత్ నోటి దురుసు కొండా సురేఖకు శాపంగా మారి జాతీయస్థాయిలో తీవ్ర విమర్శను ఎదుర్కొని అబాసుపాలైంది. ఆమె చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలకు గతంలో రేవంత్ బీజం వేసినవే అని సమాజంలోని పౌరులు వ్యాఖ్యానించారు. అయినా, రేవంత్ ఆగలేదు, నేరుగా సీఎం కార్యాలయం నుంచి కేటీఆర్ కుటుంబసభ్యుల విందులో మాజీ మంత్రి పాల్గొనకపోయినా, ఆయనపై కుట్ర చేయడానికి దాడిచేశారు. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి రేవంత్ ఒక అబద్ధాన్ని విస్తృతంగా ప్రచారం చేపించాడు, కేటీఆర్ రాజకీయాలు వదిలి అమెరికాకు పారిపోతాడని. కానీ, కేటీఆర్ రైతుల కోసం, కొడంగల్ గిరిజన మహిళల కోసం, ఆటో డ్రైవర్ల కోసం, బుల్డోజర్లతో కూల్చేసిన పేద, మధ్య తరగతి బాధితుల కోసం, బాధిత పోలీస్ బెటాలియన్ల కోసం, నేతన్నల కోసం విరామం లేకుండా పోరాడారు, పోరాడుతున్నారు కూడా. ఇది తట్టుకోలేని రేవంత్ ఎలాగైనా కేటీఆర్‌ను ఆపడానికే కుట్రపూరితంగా ‘ఫార్ములా ఈ’ కారు రేసులో ఇరికించి జైలుకు పంపించేందుకు కంకణం కట్టుకున్నారు. కానీ, అసలు కేసు లేని విషయంలో ఇప్పుడు రేవంత్‌ను వెనుకేసుకోలేక సీనియర్ కాంగ్రెస్ మంత్రులు మౌనంగా ఉంటున్నారు. రేవంత్ చుట్టూ తిరిగే తొట్టి గ్యాంగ్ తన్లాడుతూ మీడియా ముందు జోకర్లు అవుతున్నారు.
మంత్రిగా కేటీఆర్ చేసిన కృషి వల్లే అమెజాన్ సంస్థ అమెరికా బయట తన అతిపెద్ద కార్యాలయ క్యాంపస్‌ను తెలంగాణ రాష్ట్రంలో నిర్మించింది. ఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ తెలంగాణలో పరిశ్రమను ఏర్పాటుచేసింది. ఇది కేటీఆర్ చేసిన ప్రయత్నాలతోనే కుదిరింది. ‘కిటెక్స్’ అనే అతిపెద్ద పిల్లల వస్ర్తాల సంస్థ కేరళ నుంచి ఇతర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని ప్రకటించినప్పుడు, దేశంలోని పలు రాష్ర్టాలు పోటీ పడ్డాయి, కేటీఆర్ హెలికాప్టర్ పంపించి ఆయనను తెలంగాణ రాష్ర్టానికి రప్పించి హుటాహుటిన వరంగల్‌లో పెట్టుబడి పెట్టే విధంగా అధికారిక ప్రకటన చేయించి, దానికి సంబంధించిన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. క్యాబినెట్ ఆమోదం లేకుండా ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ హెలికాప్టర్ ఎలా పంపించారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేసు వేస్తుందా ఏమిటి? ‘ఫార్ములా ఈ’ అనే ప్రయత్నం కేవలం ఒక రేసు కోసమే కాదు, తెలంగాణ రాష్ర్టాన్ని సుస్థిరాభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు గాను నాటి కేసీఆర్ ప్రభుత్వం నూతన విధానాలను అవలంబించింది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ బీవైడీ లాంటి అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం చేసుకున్నది. అమర్ రాజా బ్యాటరీ సంస్థ వేల కోట్ల పెట్టుబడులతో పాటు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థను కూడా హైదరాబాద్‌కు తీసుకురావాలనే దూరదృష్టితో 190 దేశాల్లో అభిమానులుండే ఫార్ములా ఈ రేసును మొట్టమొదటిసారి మన నగరంలో నిర్వహించింది. ఈ పోటీలకు అంతర్జాతీయ క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, సినీ తారలు, క్రీడాభిమానులు, ఆఖరికి బీజేపీ నుంచి కేంద్ర మం త్రులు కూడా హాజరై తిలకిం చారు.
పగతో, పచ్చకామర్లతో ఉన్న రేవంత్ మెప్పు పొందడానికి కొందరు అధికారులు ఇందులో పెద్ద కుంభకోణం జరిగిందని చెవులు కొరికేసరికి రేవంత్ ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. అందుకే, కేటీఆర్‌ను ఇరికించాలని చూస్తున్నాడు. అంతేకాదు, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి కేసు వేసే దిశగా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి చిక్కులు ఉండవద్దని గవర్నర్ ఆమోదం కోసం అర్జీ పెట్టుకున్నాడు. అది ఆలస్యమవుతున్న సమయంలో ఢిల్లీకి వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కూడా కలిశారు. ఆ తర్వాత 24 గంటల్లోపే ఏం అద్భుతం జరిగిందో కానీ, నెల నుంచి కదలని గవర్నర్ ఆమోదం వెంటనే వచ్చేసింది. ఆ తర్వాత హుటాహుటిన ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత 24 గంటల్లోనే కేంద్ర విచారణ సంస్థ ఈడీ కూడా రంగంలోకి దిగింది. రేవంత్ తన సొంత తమ్ముడి కంపెనీతో అమెరికాలో వెయ్యి కోట్ల ఒప్పందం చేసుకుంటే విచారణ లేదు, రేవంత్ తన సొంత బావమరిది కంపెనీకి కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద రూ.1,137 కోట్ల కాంట్రాక్టు ఇస్తే విచారణ లేదు, రేవంత్ తన అల్లుడి కోసం మెడికవర్ మ్యాక్స్‌బీన్ ఫార్మా కంపెనీలను ప్రమోట్ చేసినా విచారణ లేదు, రేవంత్ వాడిన ల్యాండ్ క్రూజర్ కోట్ల రూపాయల విలువ గల టీఎస్ 07 ఎఫ్ఎఫ్ 0009 వాహనం ఏ కంపెనీకి చెందిందో ఆ కంపెనీకి వందల కోట్ల కాంట్రాక్టులు దక్కడం, దానికి రేవంత్‌కు సంబంధం ఏమిటో విచారణ లేదు. కానీ, హైదరాబాద్ నగరానికి ప్రపంచ స్థాయిలో మంచి పేరు తెచ్చిపెట్టిన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కేటీఆర్‌ను నేరస్థుడిగా చిత్రీకరిస్తున్నారు. కేటీఆర్ ఖుల్లంఖుల్లా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తానే తీసుకున్నట్టు బహిరంగంగా మీడియా ముందు, అసెంబ్లీ సాక్షిగా కూడా ప్రకటించారు. చర్చకు సిద్ధమని ఆహ్వానించారు. కానీ, రేవంత్ ధైర్యం చేయలేకపోయాడు. మొదట డబ్బు ఎక్కడుందో అని ప్రచారం మొదలుపెట్టి, ఆ తర్వాత అవినీతి అని తిప్పి, ఇప్పుడు అవినీతి నిరూపించలేక నియమ నిబంధనల బేఖాతరు అని ప్రచారం చేసి, ఆఖరికి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాడికి వచ్చారు. గొప్పగా పని చేసినందుకు ఒక మంత్రిని జైలులో పెడితే రానున్న తరాల్లో తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషిచేయడానికి రాజకీయ నాయకులు భయపడతారు. ప్రభుత్వాలు మారిన తర్వాత కక్షపూరితంగా కేసులను సృష్టించి జైల్లో వేస్తే ఒక కొత్త ధోరణికి తెరలేపినట్టు అవుతుంది.
కేసీఆర్ ప్రభుత్వాన్ని రెండు పర్యాయాలు తెలంగాణ ప్రజలు చూశారు. రేవంత్ నోట్ల సంచితో అడ్డంగా దొరికినప్పుడు ఆయన కాంగ్రెస్ నాయకుడు కాదు, కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి డబ్బులతో రేవంత్ దొరికితే దాన్ని టార్గెట్ చేసినట్టు చూడలేం. అదే, కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎన్నో వ్యాపారాలు ఉన్న వివేక్, దామోదర రాజనర్సింహ, ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిని కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ టార్గెట్ చేయలేదు. ఏ నాడూ గీత దాటి సోనియా గాంధీని విమర్శించలేదు. కానీ, రేవంత్ అన్ని హద్దులు మీరాడు. వ్యక్తిగత దూషణ చేశాడు, ఇప్పటికీ అసభ్యకరంగా చేస్తూనే ఉన్నాడు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే సీతక్క నియోజకవర్గాన్ని జిల్లాను చేస్తూ కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. భట్టి నియోజకవర్గాన్ని దళితబంధు మోడల్ నియోజకవర్గంగా తీసుకొని సంక్షేమ పథకాన్ని అందించారు. అందరికీ తెలియని విషయం ఏమంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రేవంత్ కుటుంబ సభ్యులకు చెందిన భూపాల్ ఇన్ఫ్రా లాంటి కంపెనీలకు కోట్ల రూపాయల ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా దక్కాయి.
కానీ, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. సామాన్య ప్రజలు రేవంత్ చేస్తున్న రాజకీయాలను ఆంధ్ర ప్రతీకార రాజకీయాలతో పోలుస్తున్నారు. నేరం చేయని కేటీఆర్‌ను జైల్లో పెడితే మొదటిసారి కేవలం స్వార్థం, సైకో పైశాచికానందం పొందడానికే ఒక నాయకుడిని జైల్లో పెట్టారని స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో రేపు బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. పార్టీ కార్యాలయాల్లో కేసీఆర్ చిత్రపటాన్ని అగౌరవంగా ధ్వంసం చేస్తున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తే నష్టం ఎవరికి?శాంతి భద్రతలు కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి అల్లరి మూకలకు రక్షణ ఇస్తే, సాక్షాత్తు సీఎం రేవంత్ తన ఉపన్యాసాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే, నాయకులను జైల్లో పెడితే, వ్యాపారవేత్తలను బెదిరిస్తే, కళాకారులను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తే, ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు బనాయిస్తే రాష్ట్ర అభివృద్ధికి భారీ ఇబ్బందులు వస్తాయి. రానున్న నాలుగేండ్ల దారుణమైన రేవంత్ ప్రభుత్వంలో మన రాష్ర్టానికి ఇంకెంత అపకీర్తి వస్తుందో, ఆలోచిస్తేనే బాధ కలుగుతున్నది.
(వ్యాసకర్త: కార్పొరేషన్ మాజీ చైర్మన్)
-డాక్టర్ క్రిశాంక్ మన్నె