కేవలం పదిహేను నెలల్లో అంతా తలకిందులైపోయింది. ఆదాయం అదాటున అట్టడుగుకు అంటే డెడ్ స్టోరేజీ లెవల్‌కు ఎలా పడిపోయింది? జీఎస్టీ వసూళ్లలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం కేవలం ఒకే ఒక శాతం వృద్ధి రేటుతో అధమస్థాయికి ఎలా పడిపోయింది? ముప్పొద్దులా ఢిల్లీ పర్యటనలు సాగుతూనే ఉంటాయి కానీ, మూడు పావలాలు కూడా రాష్ర్టానికి రావు. పథకాలు, వాటికి సంబంధించిన ప్రకటనలు పత్రికల్లో బోలెడు వస్తుంటాయి. కానీ, బొచ్చెడు నిధులు కూడా సమకూరవు. ఏం చెయ్యాలయ్యా అంటే.. సింపుల్ రూట్ ఏమిటంటే అమ్మకాలు.. శిష్యుడు భూములమ్ముకుంటాడు. తన గురువుకు గురువేమో ఉన్న ప్రభుత్వ సంస్థలను తుక్కు కింద చిల్లరకు అమ్మేస్తాడు. ఈ అమ్మకాలకు నాంది పలికింది ఆ గురువే కాబట్టి.. ఈ శిష్యుడు, ఆ గురువుకు ప్రస్తుత మిత్రుడు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సిర్పూర్లో కాగజ్‌నగర్ మిల్లును పునరుద్ధరించడంతో పాటు, మరికొన్ని ప్రభుత్వరంగ సంస్థల పునరుజ్జీవం కోసం ప్రయత్నించి సాధించింది. అనేక అంశాల్లోనూ ప్రభుత్వరంగానికి ప్రాధాన్యం ఇస్తూ వాటిని కాపాడుకుంటూ వచ్చింది. విద్యుత్తు రంగంలో ప్రభుత్వ సంస్థల చేతనే ఉత్పాదన సాగేలా, ప్రైవేట్ డిస్కంల పాత్రను నామమాత్రమయ్యేలా చూసింది. దామరచర్ల థర్మల్ పవర్‌స్టేషన్‌కు సంబంధించి టెండర్లను నవరత్నాల్లో ఒకటైన బీహెచ్ ఈఎల్కు అప్పజెప్పింది. దీనంతటికీ కారణం ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుంటే.. ప్రజలకు నాణ్యమైన సేవలు లభిస్తాయి. అంతకుమించి అవినీతికి ఆస్కారం అనేదే ఉండదు. కానీ, రెండు జాతీయ పార్టీలకు ఆ సోయి ఏ మాత్రం లేదని మళ్లీ మళ్లీ రుజువవుతూనే ఉన్నది.
కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నా సరే.. మొండిగా ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెగనమ్మేస్తున్నది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 వేల మందికి ఉపాధి కల్పించే ఈ సంస్థను తిరిగి ప్రారంభించాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి వందలకొద్దీ వినతిపత్రాలు ఇచ్చింది. కేవలం అంటే కేవలం బీఆర్ఎస్పైనా, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై వ్యక్తిగత కక్షతో ఈ వినతులన్నింటినీ కేంద్ర ఆర్థిక, పరిశ్రమల శాఖల మంత్రులు బుట్టదాఖలు చేశారు. దీన్నిలాగే ఉంచితే తెరవాలన్న డిమాండ్స్ మళ్లీ మళ్లీ వస్తాయన్న భయంతో.. మూడేండ్ల కిందటి నుంచే ఈ పరిశ్రమలోని యంత్ర సామగ్రినంతా తుక్కు కింద అమ్మేయాలని కేంద్రం సన్నాహాలు మొదలుపెట్టింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత అధికార పార్టీ అనుబంధ కార్మిక సంఘాలతో సహా అఖిల పక్షాలూ కేంద్రం ప్రయత్నాలను అడ్డుకున్నాయి. అప్పటి కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ ఆదిలాబాద్ వచ్చి సీసీఐని తిరిగి ప్రారంభిస్తామని ఓ హామీ ఇచ్చి వెళ్లారు. కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. కాంగ్రెస్ ముసుగేసుకున్న తమ మిత్రుడి శిష్యుడు అధికారంలోకి రావడంతో కేంద్రం పని చాలా సులువైపోయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా తన అధిష్ఠానాన్ని కలవడం కంటే కూడా ప్రధాని, ఆయన అంతేవాసులతో జరిపే రహస్య మంతనాలే ఎక్కువ అని ఆయన పార్టీ వాళ్లే చెప్పుకొంటుంటారు. కాకపోతే.. కాంగ్రెస్ పార్టీకి వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఏమీ చేయలేకుండా ఉన్నారు. తాము ఎలా అంటే అలా సాగే పరిస్థితి ఉండటంతో కేంద్ర ప్రభుత్వం సీసీఐపై మళ్లీ పంజా విసురుతున్నది. సీసీఐలో యంత్రసామగ్రికి రూ.43 కోట్ల విలువ ఉంటుందని తేల్చేసి అంగట్లోకి తెచ్చిపడేశారు. సిమెంట్‌కు డిమాండ్ ఉన్నప్పటికీ, పునః ప్రారంభించడానికి అన్నిరకాల అవకాశాలున్నప్పటికీ ఇవేవీ కూడా కేంద్రానికి పట్టడం లేదు.
ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని.. అక్కడ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రానంత వరకు అదానీకి అమ్మాలని ప్రయత్నించిన కేంద్ర సర్కారు.. టీడీపీ అధికారంలోకి రాగానే ఆ ఆలోచన మారిపోయింది. విశాఖ ఉక్కు కర్మాగారానికి రివైవ్ ప్యాకేజీ ప్రకటించేసింది. అంటే, కేంద్రం రాజకీయ కోణంలో మాత్రమే పరిపాలన చేస్తున్నది తప్ప, ప్రజా ప్రయోజనాలు ఏమిటి? కార్మికుల ప్రయోజనాలు ఏమిటి? ఏది సముచితం, ఏది అసంబద్ధం అన్న విశాల దృష్టికోణం పూర్తిగా కొరవడింది.
అధికారం మనదైతే ఒకలాగా, లేకపోతే మరొకలాగా వ్యవహరించడం ఏ విధంగా సమర్థనీయమో అర్థం కాదు. ఆదిలాబాద్ సీసీఐ కూడా రివైవల్ ప్యాకేజీకి పూర్తిగా అర్హమైనదే. కానీ, కేంద్రం ఆ దృష్టితో ఆలోచించడం లేదు. తెలంగాణ విషయంలో మోదీ ప్రభుత్వం మొదటినుంచీ నిరాకరణే చేస్తున్నది.
రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొదటి ఐదేండ్లలో బీఆర్ఎస్తో సఖ్యతగా ఉన్న మోదీ ప్రభుత్వం ఆ ఐదేండ్లలోనూ రాష్ర్టానికి చేసిందేమీ లేదు. ఇందుకు కారణం కూడా పొరుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండటం, ఆయన కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటమే. ఈ కారణంగానే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మోదీ సర్కారును గట్టిగా నిలదీసింది. నామమాత్రంగా పసుపుబోర్డు, టెక్స్టైల్ పార్క్, రక్షణ భూములు, కోచ్ ఫ్యాక్టరీ, మామునూరు విమానాశ్రయం వంటి వాటికి సంబంధించి ఉత్తర్వులైతే ఇచ్చింది. వాటికి రూపాయి కూడా విదిల్చింది లేదు. ఇవ్వాల్సింది, ఇవ్వకపోగా కొద్ది ఖర్చుతో పునరుజ్జీవం పొందేలా చేయాల్సిన సంస్థలను కూడా అమ్మేసి ప్రజల పొట్ట కొడుతున్నది.