తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుటిల రాజకీయాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. లక్షల క్యూసెక్కుల వరదను సైతం తట్టుకొని నిలబడి, తెలంగాణ ప్రజల బతుకులను నిలబెడుతున్న బహుళార్థ సాధక ప్రాజెక్టును కూల్చేందుకు హస్తం పాలకులు చేస్తున్న కుట్రలు కుళ్లి కంపు కొడుతున్నాయి. కమిటీల మీద కమిటీలు, కమిషన్ల మీద కమిషన్లు వేస్తూ కొండను తవ్వి ఎలుకను అయినా పట్టుకోలేకపోయామని తెగ బాధ పడిపోతున్న హస్తం ప్రభుత్వాన్ని చూసి తెలంగాణ సమాజం అసహ్యించుకున్నది. కరువు నేలపై సిరులు పండించిన ప్రాజెక్టును పండబెట్టేందుకు, తెలంగాణను ఎండబెట్టేందుకు పాలకులు చేస్తున్న కుతంత్రాల సాగును చూసి సాగుదారులు సలసల మరిగిపోతున్నారు. గోదావరి వరదను వదిలి బురద రాజకీయాలు చేస్తూ కరువును ఆహ్వానిస్తున్న తీరుపై కర్షకులు కన్నెర్ర జేస్తున్నారు.
ఒకప్పటి నా తెలంగాణ కరువుకు కేరాఫ్ అడ్రస్, వలస పాలకుల పాపాలకు చితికిపోయి చితికి చేరే అన్నదాతలకు శాశ్వత చిరునామా. తలాపున గోదారి పారుతున్నా గొంతు తడారని దుస్థితి. ఆరు దశాబ్దాల పాటు మనపై అధికారం చెలాయించిన వలస పాలకులు రోత చేశారే తప్ప, మన రాత మార్చలేదు. మనల్ని గోసపుచ్చారే తప్ప, మన గోడు తీర్చలేదు. పంటలు పండక, కడుపులు నిండక, డొక్కలు ఎండిన తెలంగాణ బిడ్డలకు కాటికి దారులు వేశారే తప్ప, కన్నీళ్లు తుడవలేదు. మన దుఃఖంతో నిండి పరుగులు పెడుతున్న గోదారికి అడ్డుకట్ట వెయ్యలేదు కానీ, వాళ్లు మాత్రం ఆనకట్టలు కట్టుకున్నారు. అలాంటి దుర్భర పరిస్థితుల్లోనే ఉద్యమనేత కేసీఆర్ నీళ్లను ఒక ఉద్యమ నినాదంగా మలిచారు. మన నరనరాన పారించారు. మన కన్నీళ్లనే నీళ్లుగా తలచి తెలంగాణ ఉద్యమ సాగు చేశారు.
క‘నీళ్ల’ సాగుబడితో వచ్చిన దిగుబడి మన తెలంగాణ. కాబట్టి, స్వరాష్ట్రంలో నీళ్లను తొలి ప్రాధాన్య అంశంగా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నారు. పాలనా పగ్గాలు చేపట్టిన తొలి రోజు నుంచే గంగమ్మను దివి నుంచి భువికి తేవాలని సంకల్పించారు. అభినవ భగీరథుడి అవతారమెత్తారు. నిత్యం మేధోమథనం చేసి, రేయింబవళ్లు శ్రమించి గంగమ్మను నెత్తిన మోస్తున్న కాళేశ్వరుడి పేరిట కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. గోదారమ్మను తెలంగాణ తల్లి ఒడికి చేర్చారు. పాతాళంలో పారుతున్న గోదారికి తెలంగాణకు దారి చూపించారు. ఆ గోదారమ్మ రాకతోనే తెలంగాణ ఇంట సిరుల పంట పండింది. అట్లాంటి ప్రాజెక్టుపైనే నేడు కాంగ్రెస్ పాలకులు అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఆరోపణల అబాంఢాలు వేసి కూలగొట్టాలని చూస్తున్నారు. పచ్చని తెలంగాణ మోడుబారేలా చేయాలని కుట్రలు పన్నుతున్నారు. అందులో భాగంగానే కమిషన్ పేరు చెప్పుకొని, పనికిరాని కాగితాలను ముందటేసుకొని కారుకూతలు కూస్తున్నారు.
తెలంగాణను నిలబెట్టిన ప్రాజెక్టును పడగొట్టాలని కాంగ్రెస్ సర్కారు టక్కు టమార విద్యలన్నీ ప్రదర్శిస్తున్నది. లక్షల ఎకరాల బీడు భూమి గొంతు తడిపిన ప్రాజెక్టుపై, కోట్ల మందికి అన్నం పెట్టిన ప్రాజెక్టుపై ఎన్నో కమిటీలు, కమిషన్లు వేస్తున్నది. ఇప్పటి ఘోష్ కమిషన్ మాత్రమే కాదు, గతంలో అనేక కమిటీలు కాళేశ్వరాన్ని కదిలించలేక చతికిల పడ్డాయి.
మేడిగడ్డ ప్రమాదం జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) హడావుడిగా పరుగులు పెడుతూ తెలంగాణలో వాలింది. కేసీఆర్‌పై బట్టకాల్చి మీద వేసేందుకు మేడిగడ్డ ఏడవ బ్లాక్‌లో కుంగిన పిల్లర్ల పర్రెల మధ్య పుర్రెలు పెట్టి వెతికింది. వాళ్లకేం కానరాకపోవడంతో నిందలేసి వెళ్తూ వెళ్తూ చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో నైపుణ్యం లేని నిపుణుల కమిటీని వేసింది. దారినపోయే దానయ్య చెప్పే కాకమ్మ కబుర్లు చెబుతూ ఆ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు ఆ నివేదికలో ఏముందో భూతద్దం పెట్టి వెతకాలని ఇరిగేషన్ శాఖ అధికారులతో ఒక కమిటీ, ఇతర నిపుణులతో మరో కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిం ది. ఆ కమిటీలు ఏం చెప్పాయో ఇప్పటికీ తెలువదు. అదీ చాలాదన్నట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆధ్వర్యంలో సర్కారు మరో విచారణ చేయించింది.
అయినా సంతృప్తి పడని కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఏడాదికి పైగా సుదీర్ఘ విచారణ అనంతరం తాజాగా ఆ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను పీల్చి పిప్పి చేసి తమకు కావలసిన కట్టు కథలు తయారు చేసి ఇచ్చేందుకు అధికారుల కమిటీని వేసింది. ఆ కమిటీ కూడా నివేదిక ఇచ్చేసింది. ఒక్క ప్రాజెక్టు కోసం పదుల సంఖ్యలో కమిటీలు, కమిషన్లు. అయినా ఒక్క కమిటీ కూడా పర్రెలను పూడ్చే మార్గం చెప్పలే. బాగు చేయాలన్న బుద్ధి సర్కారుకు లేనప్పుడు.. కమిటీలకు ఎక్కడి నుంచి వస్తుంది? అయినా ఈ కమిటీలన్నీ వేసింది.. బురద జల్లేందుకే తప్ప, మరమ్మతుల మార్గం చూపడానికి కాదు కదా?
ప్రమాదం జరిగింది ఒక్క మేడిగడ్డ ప్రాజెక్టులో మాత్రమే. అందులోనూ ఏడవ బ్లాక్‌లోనే. ఏడో బ్లాక్‌లో ఒకటో, రెండో పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయి. ఇంకా సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు మహా కట్టడాల వలె నిలబడే ఉన్నాయి. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు. మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల పొడవైన టన్నెల్, వందల కిలోమీటర్ల పొడవైన కాలువలు, 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, 240 టీఎంసీల నీటిని తోడే సౌలభ్యం. ఇదీ సమగ్రంగా కాళేశ్వరం స్వరూపం. కాళేశ్వరం రూపుదిద్దుకున్నాకే ఎస్సారెస్పీ ప్రాజెక్టు బతికి బట్టకట్టి నల్లగొండ, సూర్యాపేట చివరి అంచులకు పరుగులు పెట్టింది. కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్, అన్నపూర్ణ, రంగనాయకసాగర్.. ఇలా ఎన్నో రిజర్వాయర్లు తెలంగాణ తల్లికి జలహారతి పట్టాయి. ఒక బ్యారేజీకి చిన్న ప్రమాదం జరిగినంత మాత్రాన ప్రాజెక్టు మొత్తం పనికి రాకుండా పోతుందా? మేడిగడ్డకు జరిగిన ప్రమాదం మహాసముద్రంలోని ఒక నీటి బిందువు లాంటిది. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని చెబుతూనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గంధమల్లకు శంకుస్థాపన చేయలేదా? మల్లన్నసాగర్ నీళ్లతో మూసీ మురికిని కడుగుతానని ప్రగల్భాలు పలకలేదా? ఇవన్నీ కాళేశ్వరం ఫలాలు కావా?
ఇప్పుడు కూడా ఎగువ గోదారి, కడెం నది ఎండిపోయి ఉన్నాయి. కానీ, దిగువ గోదావరిలో సంద్రం దిశగా ప్రాణహిత పరుగులు పెడుతున్నది. ఇలాంటి సందర్భంలోనే కదా కాళేశ్వరాన్ని ఉపయోగించుకోవాల్సింది. కన్నెపల్లి పంప్‌హౌజ్ మోటర్లను రన్ చేసి గోదావరిని ఎగువకు పరుగులు పెట్టించాల్సింది ఇప్పుడే కదా? గోదారిని ఎత్తిపోసి అన్నారానికి, అక్కడినుంచి సుందిళ్లకు, తద్వారా రిజర్వాయర్లు, కుంటలు, చెరువులు నింపుకోవాల్సింది. అప్పుడే చెరువులు మత్తళ్లు దుంకుతాయి. పంటలు పండుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయాలనే కుట్రతో కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది నీళ్లను ఎత్తిపోయలేదు. వర్షాకాలంలో సమృద్ధిగా వాన పడటంతో నీళ్లు సరిపోయాయి. కానీ, యాసంగికి వచ్చేసరికి లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. పశువులకు గడ్డి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ యేడు వర్షాలు కూడా లేవు. ఆగస్టులోనే పంటలు ఎండిపోతున్నాయి. చాలా చోట్ల విత్తిన విత్తు భూమిలోనే మాడిపోతున్నాయి. ఇప్పుడు కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లను ఎత్తిపోసి చెరువులు నింపకపోతే రాబోయే రోజుల్లో దుర్భర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. నీళ్లున్నప్పుడే దారి మళ్లించాలి. లేకపోతే ఆ నీళ్ల కోసం రాష్ర్టాలతో కాదు, మనలో మనమే కొట్లాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి బురద రాజకీయాలు మాని, ప్రాణహిత వరదను తెలంగాణ భూములకు మళ్లించాలి.
ఇప్పుడు కూడా ఎగువ గోదారి, కడెం నది ఎండిపోయి ఉన్నాయి. కానీ, దిగువ గోదావరిలో సంద్రం దిశగా ప్రాణహిత పరుగులు పెడుతున్నది. ఇలాంటి సందర్భంలోనే కదా కాళేశ్వరాన్ని ఉపయోగించుకోవాల్సింది. కన్నెపల్లి పంప్ హౌజ్ మోటర్లను రన్ చేసి గోదావరిని ఎగువకు పరుగులు పెట్టించాల్సింది ఇప్పుడే కదా? గోదారిని ఎత్తిపోసి అన్నారానికి, అక్కడినుంచి సుందిళ్లకు, తద్వారా రిజర్వాయర్లు, కుంటలు, చెరువులు నింపుకోవాల్సింది. అప్పుడే చెరువులు మత్తళ్లు దుంకుతాయి.
తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగిందిలా..
2014- 1.31 కోట్ల ఎకరాలు
2023- 2.68 కోట్ల ఎకరాలు
ధాన్యం ఉత్పత్తి పెరుగుదల ఇలా..
2014- 68 లక్షల టన్నులు
2023- 350 లక్షల టన్నులు
-డాక్టర్ దాసోజు శ్రవణ్
(వ్యాసకర్త: రాష్ట్ర శాసనమండలి సభ్యులు)