తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకున్నది. ఢిల్లీ పార్టీలు తెలంగాణకొచ్చి తమ ప్రచారం కొనసాగిస్తున్నాయి. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పర్చిన ఉత్సాహంతో కాంగ్రెస్ తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయగలనని పగటికలలు కంటున్నది. కేంద్రంలోని అధికారాన్ని ఉపయోగించి బ్లాక్ మెయిల్ రాజకీయాల ద్వారా తెలంగాణలో అడుగుపెట్టాలని బీజేపీ భావిస్తున్నది. మరో దిక్కు ఎవరితోనో పొత్తు పెట్టుకొని ఒకటో, రెండో సీట్లు అడుక్కోవాలనే ప్రయత్నంలో కమ్యూనిస్టు పార్టీలున్నాయి. మరో జాతీయపార్టీ బీఎస్పీ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేకున్నా, అంత సులభంగా అధికారంలోకి రావడం సాధ్యం కాదని తెలిసినా రాష్ట్రంలో ప్రవేశం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో నామమాత్రంగా ఉన్న మరికొన్ని పార్టీలు ప్రకటనలతోనే కాలం ఎల్లదీస్తున్నాయి.
కొన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించే ప్రయత్నాలు చేస్తూ, ఆయారాం గయారాంలతో సంప్రదింపులు జరుపుతూనే, ఎన్నికల వ్యూహాలు పన్నుతున్నాయి. ఈ పార్టీలన్నింటికీ భిన్నంగా తనదైన శైలిలో ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ పక్కా వ్యూహంతో అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం దిశగా పరుగులు తీస్తున్నది. గెలుపు వ్యూహాలను పన్నడంలో చాణక్యుడిని మించిన రాజనీతిజ్ఞుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎదుటి పార్టీలను పద్మవ్యూహంలో బంధించడంలో ఆయనను మించినవారు లేరు. ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టడంలోనూ తనకు తానే సాటి. అట్లని ఇతర పార్టీల వలె మాటలతో కోటలు గట్టి, పనులేవీ చేయకుండా ఓట్లడిగే తత్వం కాదు ఆయనది.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఆంధ్రా పాలకుల పాలన నుంచి తెలంగాణను విముక్తం చేసినందుకే కేసీఆర్‌ను ప్రజలు రెండుసార్లు గెలిపించారు. మరీ… ఈ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో తెలంగాణను అందరాని ఎత్తులకు తీసుకెళ్లినందుకు ఇంకెన్నిసార్లు గెలిపించాలో ప్రజలకు తెలుసు. వ్యవసాయం, ఐటీ రంగం, పారిశ్రామిక ప్రగతి, సంక్షేమ పథకాలు, నీటికొరత, విద్యుత్తు కొరత లేకుండా తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌ది. ఇప్పుడు తెలంగాణ దేశానికే ఓ రోల్ మాడల్. దేశంలోని చాలా రాష్ర్టాలు తెలంగాణ అభివృద్ధి మాడల్‌ను అనుసరిస్తున్నాయి. తెలంగాణ ఆచరిస్తే, దేశం అనుసరిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలేమంటున్నాయో తెలుసుకుందాం.
ఇటీవలి కాలంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేసీఆర్ గురించి, తెలంగాణ అభివృద్ధి మాడల్ గురించి అన్న మాటలు నవ్వు తెప్పించేవిగా ఉన్నాయి. ఆ మాటల్లో భూతద్దం పెట్టిచూసినా సత్యాలు కనపడవు. అలాగే రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటనలో అన్న మాటలు, తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఇతర నాయకులు అన్నమాటలు కూడా సత్యానికి సుదూరతీరంలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కేసీఆర్ గురించి, తెలంగాణ పథకాల గురించి అన్న రెండు ముఖ్య విషయాల గురించి విశ్లేషిస్తే.. ఆ మాటల్లోని డొల్లతనం అర్థమవుతుంది.
అమిత్ షా, కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… తమ పార్టీ బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ రైతుల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ప్రవచనాలిచ్చారు. ఈ మాటలు విన్న అతి సామాన్య నిరక్షరాస్యుడైన మానవుడు కూడా ఆశ్చర్యంతో ముక్కు మీద వేలేసుకోకుండా ఉండలేడు. ఈ మాటలు చాలు తెలంగాణ రైతులంతా బీజేపీని కాదని కేసీఆర్‌ను అపూర్వ మెజారిటీతో గెలిపించడానికి. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఆ పార్టీ రైతుల కోసం ఏం చేస్తున్నది?అక్కడ ఏం చేసిందో సెలవిస్తే, ఇక్కడ ఏం చేస్తారో అర్థమవుతుంది కదా? ఇదే సమయంలో కేసీఆర్ రైతులను హృదయానికి హత్తుకున్నారు. వ్యవసాయాన్ని పండుగ చేయడానికి రైతుబంధు, కాళేశ్వరం లాంటి బృహత్తర ప్రాజెక్టును, రుణమాఫీని, రైతు ధాన్యాన్ని కల్లంలోనే కొనుగోలు చేయడం లాంటి అనేక పనులు చేశారు. రైతుకు ఆత్మబంధువుగా నిలిచారు. తెలంగాణను నీటి నిధిగా, ధాన్యపుసిరిగా నిలిపి దేశానికే ఆదర్శప్రాయం చేశారు. తెలంగాణ వ్యవసాయ మాడల్, ఆర్థికాభివృద్ధి నమూనా బీజేపీ గుజరాత్ తరహాలో కార్పొరేట్ మాడల్ కాదు. రైతును రాజును చేసే దేశీయ మాడల్. అరిచి గీ పెట్టినా, దేశంలో అన్నదాతల ఆత్మహత్యలు జరుగుతున్నా కిమ్మనకుండా గిట్టుబాటు ధర కూడా ఇవ్వని బీజేపీ కేసీఆర్ రైతు బంధుత్వాన్ని విమర్శించడం ఈ శతాబ్దపు పెద్ద జోక్. గ్రామాలను హరిత వనాలుగా మారుస్తున్న కేసీఆర్‌ను రైతు వ్యతిరేకిగా విమర్శించడం హాస్యాస్పదం. తాను రైతు వ్యతిరేకియై కేసీఆర్‌ను రైతు వ్యతిరేకి అనడంలో ఔచిత్యం లేదు. రైతుబంధువును విమర్శించడమంటే బీజేపీ ఎంత రైతు వ్యతిరేకో అర్థమవుతున్నది.
ఇక కాంగ్రెస్ చేస్తున్న డిక్లరేషన్ గురించి.. ఇలాంటి డిక్లరేషన్లు కాంగ్రెస్ ఇంతకుముందు కూడా చేసింది. మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్‌సింగ్, ఉమ్మడి ఏపీలో దామోదర రాజనరసింహ లాంటివారు దళిత డిక్లరేషన్ చేశారు. కానీ, దాంతో ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి? కాంగ్రెస్ దళిత పక్షపాతిగా ఉండి ఉంటే బీఎస్పీ లాంటి పార్టీలు రావాల్సిన అవసరమేమున్నది. 56 ఏండ్లు కేంద్రంలో పాలన చేసిన కాం గ్రెస్ దాదాపు అన్ని రాష్ర్టాలను పాలించినా దళితులకు ఒరగబెట్టిందేమీ లేదు. రైతులకు చేసిందేమిటి? పిట్టగూడుల్లాంటి ఇండ్లు.. అవీ ఊరి బయటనే కట్టించి దళితులకేమో చేశామని జబ్బలు చరుచుకోవడంలో ఔచిత్యమేమున్నది? కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదు. రూ.10 లక్షల ఆర్థికసాయంతో వేలాదిమంది దళితులు పారిశ్రామికవేత్తలుగా, స్వయం ఉపాధితో బతికేవారిగా, వాహనాల యాజమానులుగా మారిపోయారు. దళితబంధు ఎంతోమంది దళితులకు ఆర్థిక సాధికారిత కలిగేటట్టు చేసింది. వాళ్లలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. రైతుబంధు, వృద్ధాప్య పింఛన్ ద్వారా దళిత కుటుంబాలెన్నో లబ్ధి పొందాయి. కానీ, జగ్జీవన్రాంను ప్రధాని కాకుండా ఆపింది కాంగ్రెస్ అయితే, దళిత రాష్ట్రపతిని పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాకుం డా అడ్డుకున్నది బీజేపీ. నిజానికి రైతుల సమస్యలను, దళితుల సమస్యలను పట్టించుకొని పరిష్కార మార్గాలను చూపింది బీఆర్ఎస్.
దేశంలోని అన్నివర్గాల, వర్ణాల ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. బీఆర్ఎస్ పథకాలను కాంగ్రెస్ తన సహజ ధోరణిలో విమర్శిస్తుంటే బీజేపీ తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మత సెంటిమెంట్లను, మైనారిటీ వ్యతిరేకతను రెచ్చగొడుతున్నది. బీఆర్ఎస్ మాత్రం తనదైన శైలిలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తూ తెలంగాణ ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నది. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని మాయమాటలు చెప్పినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయం తప్పదు. తెలంగాణ ప్రజలు ఉప్పుతిన్న ఇల్లును, అన్నం పెట్టిన చెయ్యిని మరిచిపోరు.
డాక్టర్ కాలువ మల్లయ్య
91829 18567