రష్యాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు జరిపిన ఘోరమైన దాడితో ప్రపంచం మరోసారి ఉలిక్కిపడింది. మాస్కో శివార్లలోని క్రాకస్ సిటీ హాల్లో సంగీత కార్యక్రమం జరుగుతుండగా సాయుధులు ప్రవేశించి బాంబులు, తుపాకులతో విరుచుకుపడినప్పుడు 137 మందికి పైగా మరణించారు. వందమందికి పైగా గాయపడ్డారు. ఇప్పటివరకు పట్టుబడ్డ నలుగురు ఉగ్రవాదులపై మాస్కో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ నలుగురు అనుమానితులు ఉజ్బెకిస్థాన్‌కు చెందినవారని తెలుస్తున్నది. ఈ దాడితో రష్యన్లకు గతంలో చెచెన్యా ఉగ్రవాదులు సృష్టించిన అరాచకపు రోజులు గుర్తుకువచ్చాయి. పాతికేండ్ల కిందట ఉగ్రవాదాన్ని అంతం చేస్తాననే ప్రతిజ్ఞతో పుతిన్ అధికారం చేపట్టారు. చెచెన్యాలో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసి దేశంపై తన పట్టును బిగించారు. రష్యా ప్రజలకు భద్రత కల్పిస్తాననే హామీతో ఇటీవలే తిరిగి అధికారంలోకి వచ్చిన పుతిన్‌కు మాస్కో దాడి సవాల్‌గా మారింది. భద్రతా లోపాలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ప్రస్తుతం ఏర్పడింది. ఉక్రెయిన్ యుద్ధంతో సతమతమవుతున్న రష్యా నాయకత్వానికి ఇది అదనపు భారమే అవుతుంది. మాస్కో దాడి గురించి రష్యా నాయకత్వానికి ముందే హెచ్చరించినట్టుగా అమెరికా చెప్పుకొంటుండటం పుతిన్‌కు పరువు సమస్యగా మారింది.
ఆరేండ్ల కిందట సిరియా, ఇరాక్‌లోని ఐఎస్ కాలిఫేట్ స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత జరిగిన అతిపెద్ద దాడి ఇది. ఐఎస్ పూర్తిగా అంతమైపోలేదని, మరోసారి పడగ విప్పేందుకు సరిపడా శక్తిని సంతరించుకున్నదని మాస్కో దాడి సూచిస్తున్నది. 2021లో అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా పూర్తిగా వైదొలగిన తర్వాత తాలిబన్లు మరోసారి అధికారం చేజిక్కించుకున్నారు. ఇది ఐఎస్-కే తిరిగి పుంజుకోవడానికి దోహదం చేసిందని చెప్పాలి. అఫ్ఘానిస్థాన్లోని ఖొరాసాన్ స్థావరం నుంచి ఐఎస్ ప్రస్తుతం ఖొరాసాన్ గ్రూప్ (ఐఎస్-కే) పేరుతో పనిచేస్తున్నది. తాలిబన్ల అండతోనే టర్కీ, సిరియా, అఫ్ఘానిస్థాన్లలో భారీ దాడులు జరిపి తన ఉనికి చాటుకున్నది.
2015లో సిరియాలో రష్యా జరిపిన జోక్యం అక్కడి ఐఎస్ కార్యకలాపాలకు చావుదెబ్బ కొట్టింది. 2010 దశకంలో పశ్చిమదేశాలపై విషం చిమ్ముతూ కార్యకలాపాలు విస్తరించిన ఐఎస్ ప్రస్తుతం రష్యా, ఇరాన్‌పైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించింది. ఇటీవలి కాలంలో రష్యాకు, అధ్యక్షుడు వ్లదీమిర్ పుతిన్‌కు వ్యతిరేకంగా వీడియోలు విడుదల చేస్తూ ఇస్లామిక్ తీవ్రవాదుల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నది. ఐస్ కార్యకలాపాలు రష్యాకు తలనొప్పిగా మారాయి. మధ్యాసియా దేశాలకు చెందిన కార్మికులు రష్యాలో పెద్ద సంఖ్యలో ఉండటమే అందుకు కారణం. తీవ్రవాద ఇస్లాం ప్రభావంలోకి వచ్చిన తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ వంటి మధ్యాసియాకు చెందిన మాజీ సోవియెట్ దేశాల యువతను చేర్చుకుంటూ బలపడుతున్నది. పశ్చిమాసియాలో పట్టు కోల్పోయిన ఐఎస్ ఇప్పడు అఫ్గానిస్థాన్ నుంచి తన కార్యకలాపాలు నిర్వహించడానికి అక్కడి అస్థిర పరిస్థితులే కారణం. ప్రపంచ దేశాలు సమన్వయంతో వ్యవహరించి ఐఎస్‌కు నిలువ నీడ లేకుండా చేయడం ఒక్కటే ప్రస్తుత పరిస్థితుల్లో పరిష్కారం కాగలదని చెప్పాలి.