దామగుండం రామలింగేశ్వర స్వామి దర్శనమైన తర్వాత ముందు రచించుకు న్న ప్రణాళిక ప్రకారం మా స్నేహితుల బృందం అక్కడు న్న ఆశ్రమంలో స్వామీజీని కలవాలనుకున్నాం. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కేరళ నుంచి 1980లో హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూడూ రు గ్రామానికి వలస వచ్చారట స్వామీజీ. గ్రామస్థుల ద్వారా ఆయన ఫోన్ నెంబ ర్ తెలుసుకొని మాట్లాడి, చెప్పిన సమయానికి ఆయన ఉండే ఆశ్రమానికి బయల్దేరాం. ఆశ్రమం అంటే వందల, వేల ఎకరాల్లో ఆడంబరంగా ఉండి చుట్టూ మందీమార్బలంతో ఉండేది కాదు. రెండు ఎకరాల్లో ఉన్న చిన్న రెండు గదుల ఇల్లు మాత్రమే.
అనుకున్నట్టుగానే సుమారు 50 ఏండ్లు పైబడిన ఆయన అపారమైన జ్ఞానంతో వచ్చిన తేజస్సుతో కాబోలు, కాషాయ వస్ర్తాల్లో వెలిగిపోతున్నారు. ‘మీకేం కావాలి’ అని ఆయనే మమ్మల్ని అడిగారు. ‘దామగుండం అడవి గురించి, అక్కడ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన రాడార్ స్టేషన్ ప్రాజెక్టు గురించి, ఇక్కడున్న వృక్ష సంపద గురించి, నిర్వాసితుల గురించి, లాభనష్టాల గురించి చెప్పండి’ అని అడిగాం. ‘మీకు అడవి వద్దా?’ అన్న ఆయన సూటి మాట నిజంగా గుండెలను తాకింది. అందరం ఒక్క క్షణం పాటు మౌనంగా ఉండిపోయాం. గలగల పారే సెలయేరులా ఆయన చెప్పుకుంటూ పోయారు.
మొత్తం 2,900 ఎకరాల అటవీ భూమిలో యాంటెన్నా పార్క్ 1400 ఎకరాలు, టెక్నికల్ ఏరియా 1090 ఎకరాలు, కార్యాలయం 310 ఎకరాలు, రేడియేషన్ సేఫ్ జోన్ 100 ఎకరాలుగా స్వామీజీ పేరొన్నారు. ఒక సంవత్సరంలో ఒక చెట్టు లక్ష లీటర్ల ఆక్సిజన్ ఇస్తుందని, ఈ రాడార్ స్టేషన్ కోసం 12 లక్షల చెట్లను కొట్టివేస్తే పర్యావరణానికి భారీ నష్టం వాటిల్లుతుందని ఆయన వివరించారు. మూసీకి వరప్రదాయిని అయిన దామగుండాన్ని కాపాడుకోకపోతే, 2800 మీటర్ల లోతు వరకు భూగర్భ జలాలు కూడా కలుషితమవుతాయని, దాని ప్రభావం హైదరాబాద్ మీదనే కాక యావత్ తెలంగాణ సమాజం మీద, వనరుల మీద, ప్రజల ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దామగుండం అడవి కొన్ని లక్షల చెట్లకు నెలవు. జింకలు, తోడేళ్లు, మనుబోతులు, అడవి పందులు, అనేకరకాల పక్షులకు ఆలవాలమైన ఈ అడవి జీవవైవిధ్యంతో అలరారుతున్నది. అంతేకాకుండా ఈ అడవి ఎన్నోరకాల అరుదైన, ఔషధ మొక్కలకు కూడా ప్రసిద్ధి. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో నిర్మిస్తున్న ఈ రాడార్ స్టేషన్‌ను పలు పర్యావరణ సంస్థలు, గ్రామ ప్రజలు, ఉద్యమకారులు కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ‘సేవ్ దామగుండం’ అనే నినాదాన్ని తీసుకొని ఈ అటవీ భూముల రక్షణకు స్థానిక ప్రజానీకం ప్రయత్నాలు ప్రారంభించారని తెలిపారు.
భారత నౌకాదళ సంస్థ దామగుండం అటవీ ప్రాంతంలో రూ.2500 కోట్లతో తక్కువ ఫ్రీక్వెన్సీ రాడార్ వ్యవస్థను నెలకొల్పాలని యోచిస్తున్నది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదన పన్నెండేండ్లుగా ఉన్నా, తెలంగాణ ఏర్పడినాక ఒక దశాబ్దం పాటు కేసీఆర్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు సహకరించలేదు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్కసారిగా ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. దామగుండం అటవీ భూములను, భారత నౌకాదళ సంస్థకు కట్టబెట్టాలన్న ఆలోచనను విరమించుకోవాలని ఇటీవలే నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరిందట. ‘మరి ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రజలంతా సంఘటితమవుతున్నారా’ అని అడిగిన ప్రశ్నకు ‘కొందరు ప్రజలు అమాయకులు.
వారు రాజకీయ నాయకుల తాత్కాలిక వాగ్దానాలను నమ్ముతున్నారు. బయటకు పోవాల్సిన అవసరం లేకుండా కొన్ని ఎకరాల్లో వాళ్లకు మార్కెట్ కట్టిస్తామని, బడి కట్టిస్తామని, ఉద్యోగ కల్పన చేస్తామని, 27 కిలోమీటర్ల మేర రోడ్డు ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారట. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో’ అని నిర్వేదంగా సమాధానం ఇచ్చారు. త్వరలో తనకున్న రెండు ఎకరాలను అమ్ముకొని శాశ్వతంగా ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోతున్నాను అంటున్నప్పుడు ఆయన కళ్లల్లో చిన్నతడి. అయినా అది కనపడనివ్వకుండా, ‘మీరంతా ఒక సాయం చేయాలి, మనందరం కలిసి ఒక మానవహారం వంటి నిరసన కార్యక్రమం చేస్తేనే ప్రభుత్వాలకు, న్యాయవ్యవస్థకు, నౌకాదళానికి మన వేదన అర్థమై ఈ ప్రాజెక్టు వెనుకకు వెళ్తుందేమో’ అనే చిరు ఆశను వ్యక్తం చేశారు.
ఈ మట్టికి, ఈ నేలకు, ఈ ప్రజలకు ఎటువంటి సంబంధం లేని ఎక్కడో పుట్టి పెరిగిన ఒక కేరళ మనిషిలో ఉన్న భవిష్యత్తు తరాలకు ఏదో చేయాలనే తపనను చూస్తే మాలో ఏదో తెలియని అపరాధభావంతో కూడిన భావోద్వేగపు చెమ్మ కలిగింది. చివరగా ‘దామగుండం పోతే యమగండం’ తప్పదు అన్న ఆయన మాటలు విన్నాక చివుక్కుమన్న మనసుతో ఆ మహా మనీషికి ప్రణామాలు అర్పించి భారమైన మనసుతో వీడ్కోలు చెప్పాం. దామగుండం అడవుల్లో లక్షలాది అరుదైన వృక్షాలను, ఔషధ మొక్కలను, జంతుజాలాన్ని పణంగా పెట్టే ఈ నేవీ రాడార్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజల పోరాటం సఫలం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
స్వర్ణ కిలారి