దుబ్బాక నియోజకవర్గంలో ప్రధాన సాగునీటి వనరు కూడవెల్లి వాగు. దీనిపక్కనే మా పొలం ఉండేది. వానలు కురిసి, వాగులోకి నీళ్లు వస్తేసే మా భూమి సాగయ్యేది. ఒక్కసారి వాగు నిండితే ఆ పరీవాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు జరిగేది. ఒకవేళ వానలు కురవకుంటే భూములు బీళ్లుగానే ఉండేవి. వాగు ఎండిపోతే పశుపక్ష్యాదులకు సైతం తాగునీరు లేని దుర్భర పరిస్థితులను చూశాం. ఈ క్రమంలో 2021లో యాసంగిలో కూడవెల్లి వాగులో నీళ్లు అడుగంటిపోవడంతో పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఎదురైంది.
ఉద్యమ కాలంలో తెలంగాణ వస్తేనే మన నీళ్లు మనకు, మన నిధులు మనకు, మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పిన కేసీఆర్, ఆ తర్వాత అధికారంలోకి వస్తే గోదావరి జలాలతో ప్రజల కాళ్లు కడుగుతానని మాటిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నాలుగేండ్లలో తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి మల్లన్నసాగర్లో గోదావరి జలాలను పారించారు. 2021 మార్చి 20న కూడవెల్లి వాగులో నీళ్లు గుంజుకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయని, గోదావరి నీళ్లు విడిచి పంటలకు ప్రాణం పోయాలని తొగుట మండల టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. మరునాడు గజ్వేల్ రైతులు మంత్రి తన్నీరు హరీశ్‌రావు దృష్టికి తీసుకుపోవడం, ఆయన వెంటనే స్పందించి సీఎం కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు.
‘హరీశ్ గో అహెడ్, కొడకండ్ల దగ్గర, జగదేవ్‌పూర్ దగ్గర కొండపోచమ్మ కాలువకు గండి పెట్టి కూడవెల్లికి నీటిని విడుదల చేయాలని’ కేసీఆర్ ఆదేశించారు. అప్పటికప్పుడు కొడకండ్ల వద్ద కొండపోచమ్మ కాలువను బ్రేక్ చేసే పనులు ప్రారంభించి మార్చి 23న కూడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేశారు. మండుటెండల్లో కూడవెల్లి వాగు వానకాలం లెక్క.. గలగలా పారుతూ పరవళ్లు తొక్కింది. కేవలం మూడు రోజుల్లోనే ఆ వాగు నిండి నర్మాల చెరువులో పడటంతో ఇక్కడి నేల పులకించిపోయింది. రైతుల మోముల్లో సంతోషం వెల్లివిరిసింది. చెట్టూ చేమ పచ్చగా మారగా, పక్షుల కిలకిలరావాలు వినిపించాయి. నాటి సీఎం కేసీఆర్‌ను మొక్కని రైతు లేడంటే అతిశయోక్తి కాదు.
‘గండు కరువులో, నిప్పులు కురిసే మండుటెండల్లో గోదావరి జలాలతో కూడవెల్లి వాగు ప్రాజెక్టులు కడుతాం’ అని పదేండ్ల కింద కేసీఆర్ టీవీల్లో చెప్తుంటే.. ‘ ఆ వాళ్లు ప్రాజెక్టులు కడుతరు, మాకు నీళ్లొస్తయా, నాయకుల ఇలాంటి మాటలు ఏండ్ల తరబడి వింటూనే ఉన్నాం. ఒకవేళ కట్టినా మేము కాదేమో, మా మనమండ్లు చూస్తారేమో’ అని స్థానిక ప్రజలు గుసగుసలాడేవారు. ఎక్కడి గోదావరి, ఎక్కడి మల్లన్నసాగర్.. ఇక్కడికి నీళ్లు వస్తయా.. మనం చూస్తమా అనుకున్నాం. ఎండకాలం వస్తే గోదావరిలోనే నీళ్లు తగ్గిపోతాయి. ఇక మాకు నీళ్లెలా వస్తాయనుకున్నాం. కానీ, నేడు కూడవెల్లి వాగులోకి, చెరువులు, కుంటల్లోకి గోదావరి నీళ్లను విడిచిన తర్వాత ‘కేసీఆర్‌ను చూసి గర్వపడుతున్నాం’ అని కూడవెల్లి వాగు పొంట పొలాలున్న రైతులు సంతోషంగా చెప్పిండ్రు.
2021, మార్చి 23న కాళేశ్వర జలాలు కూడవెల్లికి రావడంతో స్థానిక ప్రజలకు గోదారమ్మను అక్కడే చూసే భాగ్యం కలిగింది. కాళేశ్వరానికి వెళ్లాల్సిన వ్యయ ప్రయాసలు లేకుండా కూడవెల్లి వాగులోనే గోదావరి స్నానం చేసే అవకాశం వచ్చింది. కూడవెల్లి వాగు దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహించడంతో ప్రజలు పవిత్రంగా భావిస్తారు. గోదావరి జలాలను కూడవెల్లికు తీసుకువచ్చి నాటి ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు, నాటి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయించి కేసీఆర్ కూడవెల్లికి కొత్త నడక నేర్పారు. కూడవెల్లి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు. భోళా శంకరుని తల మీద గంగమ్మ ఉన్నట్టు, మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఈ ప్రాంత అవసరాలకు నీటికుండలా మారింది. మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు పరిసర ప్రాంత జిల్లాలు కూడా గోదారమ్మ జలాలతో సస్యశ్యామలమయ్యాయి. ఇప్పటికే హల్దీ వాగు, కూడవెల్లి వాగులతో పాటు కాలువల పనులు పూర్తయిన ప్రాం తాల్లో చెరువు, కుంటలకు నీటిని విడుదల చేశారు. మల్లన్నసాగర్ నిర్మాణంతో కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. తెలంగాణ వస్తే ఏమొస్తదని మాట్లాడినవారి చెంప చెల్లుమనేలా కూడవెల్లి ప్రవహిస్తున్నది.
-జీడిపల్లి రాంరెడ్డి