గోడలపై పేర్లు చెరిపేయొచ్చు..ఫైళ్లలో పేర్లు మార్చేయొచ్చు.. పథకాలకు కొత్త పేర్లు పెట్టొచ్చు. కానీ ప్రజల గుండెల్లో ముద్రపడిన చరిత్రను ఏ ప్రభుత్వమూ చెరిపేయలేదు. అలాంటిదే తెలంగాణకు, కేసీఆర్కు ఉన్న చరిత్ర. ప్రత్యేక తెలంగాణ సాధించడంలో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేయడంలో ఆయన ముద్రను ఎవరూ చెరిపివేయలేనిది. ప్రభుత్వాలు మారడం ప్రజాస్వామ్యంలో సహజం. కానీ ప్రభుత్వం మారిన ప్రతీసారి గత ప్రభుత్వ నిర్ణయాలను రాజకీయ కక్షతో తిరుగరాయడం, పథకాలకు పేర్లు మార్చడం, గత పాలనను పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య విలువలకు శ్రేయస్కరం కాదు.
రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని వైఖరులపై ఇదే కారణంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేర్లు మార్చవచ్చు.. పథకాలకు కొత్త రూపు ఇవ్వొ చ్చు.. కానీ ప్రజల జ్ఞాపకాల నుంచి ఒక మంచి పాలనా కాలాన్ని చెరిపేయలేరు. తెలంగాణలో కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనతో ముడిపడిన అంశాలపై జరుగుతున్న చర్చ ఈ తేడాను మరోసారి ముందుకు తెస్తున్నది. బీఆర్ఎస్ పాలనలో ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు, కార్యక్రమాలు ప్రజల రోజువారీ జీవితంతో ముడిపడ్డాయి. రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, పల్లె ప్రగతి వంటి పేర్లు ఒక దశలో తెలంగాణ పరిపాలనా పదజాలంలో భాగమయ్యాయి.
ప్రస్తుత ప్రభుత్వ అధికారిక పథకాల జాబితాలో ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత తదితర పేర్లు ఉన్నా యి. అయితే పాలనకు పేర్లు ఉంటాయి.. కానీ పాలనకు జ్ఞాపకాలు కూడా ఉంటాయి. ఒక పథకానికి కొత్త పేరు పెట్టినంత మాత్రాన దాని ద్వారా లబ్ధి పొందిన వ్యక్తిగత అనుభవాన్ని మర్చిపోడు. అదే సమయంలో గత ప్రభుత్వ పథకాన్ని కొనసాగిస్తే, అది ఆ ప్రభుత్వ రాజకీయ వారసత్వాన్ని అంగీకరించినట్లేనని భావించాల్సిన అవసరం కూడా లేదు.
ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి కార్యక్రమాలను కొనసాగించడమే పరిపాలనా పరిపక్వత. ఇదే విషయాన్ని పాఠశాల విద్యార్థుల అల్పాహార పథకం ఒక ఉదాహరణగా స్పష్టం చేస్తున్నది. బీఆర్ఎస్ సర్కార్ ప్రారంభించిన ఈ పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 202627 విద్యా సంవత్సరంలో మళ్లీ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
తెలంగాణ ప్రత్యేక ఏర్పడిన తర్వాత కొత్త రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టడం అంత సులభమైన పని కాదు. పరిపాలనా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడం నుంచి సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, వ్యవసాయం, సంక్షేమం, మౌలిక వసతుల వరకు అనేక రంగాల్లో ప్రభుత్వం ఒకేసారి దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఈ ప్రక్రియలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారు. 24 గంటల ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం ప్రాజెక్టు, దళిత బంధు వంటి విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలు పాలనా నమూనాలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. హైదరాబాద్ మౌలిక వసతుల విస్తరణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, వ్యవసాయ మౌలిక వసతులపై కూడా దృష్టి పెట్టారు. ప్రత్యేకంగా భారీ సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ, వంటి చర్య లు రాష్ట్ర వ్యవసాయ రంగంపై ప్రభావం చూపాయి. తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ ప్రభుత్వం వేసిన పునాదులు, తీసుకున్న వి ధాన నిర్ణయాలు వారసత్వంగా మిగిలాయి.
రాజకీయ ప్రత్యర్థిని విమర్శించడం ప్రజాస్వామ్య హక్కు. కానీ వ్యక్తిగత విమర్శలు, అవమానకర వ్యాఖ్యలు, గత పాలకులపై నిరంతర నిందారోపణలే రాజకీయ ఎజెండాగా మారితే అసలు సమస్యలు పక్కదారి పడతాయి. ప్రజలకు కావాల్సింది గత ప్రభుత్వంపై విమర్శల కంటే ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తున్నది? రేపటి తెలంగాణకు ఏం చేయబోతున్నది? అనేది అవసరం. గత ప్రభుత్వ ఆనవాళ్లను చెరిపేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం రాజకీయ ప్రతీకారంగా మిగిలిపోతుంది. తెలంగాణకు కావాల్సింది కక్షల రాజకీయాలు కాదు, కొనసాగుతున్న అభివృద్ధి. విధానాలు మెరుగుపడాలి కానీ ప్రజాప్రయోజనం మాత్రం మారకూడదు. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన రాజకీయ సంస్కృతికి మాటలకు, పోరాటానికి ప్రత్యేక గౌరవం ఉన్నది.
ఆ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత అధికార పక్షానిదే. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాటలను ప్రజలు మరింత జాగ్రత్తగా గమనిస్తారు. ప్రత్యర్థి పార్టీల నేతలను విమర్శించడంలో రాజకీయ అంశాలు, విధానాలు, ప్రజా సమస్యలపై మాట్లాడటం సమర్థనీయం. కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం వల్ల విమర్శల అసలు ఉద్దేశమే బలహీనపడుతుంది.
ప్రజల జీవితాలను తాకిన పథకాలు, నిర్మించిన మౌలిక వసతులు, తెలంగాణ అభివృద్ధిలో వేసిన పునాదులు రాజకీయ రంగు మార్చుకున్నంత మాత్రాన కనుమరుగుకావు. పథకం ప్రజలకు ఉపయోగపడుతున్నదా? ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన విధానాలు కొనసాగితే వాటి కర్త ఎవరో చరిత్ర చెబుతుంది.కాలం గడిచేకొద్దీ ప్రభుత్వాల పేర్లు మారినా, ప్రజల అనుభవాలే అసలైన చరిత్రగా మిగులుతాయి.
చరిత్రను చెరిపేయాలని ప్రయత్నించే ప్రతి అధికారం చివరకు చరిత్రలోనే ఒక అధ్యాయంగా మిగిలిపోతుంది. ఆనవాళ్లను చెరిపే రాజకీయాల కంటే ప్రజల జీవితాల్లో ఆనవాళ్లు మిగిల్చే పాలనే అసలైన విజయం.
– (వ్యాసకర్త: అధ్యాపకుడు, కాకతీయ యూనివర్సిటీ)
డా.బొల్లికొండ వీరేందర్ 9866535807