బంజారాల ఆరాధ్య దైవం, అహింసామూర్తి, సమాజ సంసర్త శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల వేళ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన గిరిజన లోకంలో ఒక పెను సంచలనానికి, చర్చకు దారి తీసింది. నల్లమల అడవుల్లోని అచ్చంపేట ప్రాంతంలో సేవాలాల్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామన్న ప్రతిపాదన పట్ల లంబాడా గిరిజన సంఘాలు బలమైన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అది కేవలం ఒక దేవాలయం గురించి కాదు.. అది తమ జాతికి దకాల్సిన చారిత్రక గౌరవం గురించి.. కీలక అభ్యంతరాలు ఉన్నాయి.
తెలంగాణలోని అన్ని జిల్లాలకు, ఇతర రాష్ట్రాల గిరిజనులకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా ఉంటుంది. అందుకే సేవాలాల్ ఆలయం హైదరాబాద్‌లో నిర్మించాలని బంజారాలు డిమాండ్ చేస్తున్నారు. అటవీ ప్రాంతం కంటే నగరానికి సమీపంలో ఉంటే భక్తుల తాకిడి, పర్యాటక అభివృద్ధి ఎకువగా ఉంటుంది. అటవీ ప్రాంతంలో భారీ నిర్మాణాల వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉన్నదని కొందరు ఆందోళన చెందుతున్నారు. సేవాలాల్ మహారాజ్ కేవలం గిరిజనులకే పరిమితమైన ఆరాధ్యుడు కాదు. ఆయనను ఒక విశ్వగురువుగా కొలుస్తారు. అలాంటి మహనీయుడి ఆలయాన్ని అడవిలో నిర్మిస్తే అది కేవలం మారుమూల ప్రాంతానికే పరిమితం చేసే ప్రయత్నంగా గిరిజనులు భావిస్తున్నారు.
బ్రిటిష్ కాలం పూర్వం నుంచి ఇప్పటి వరకు దేశంలో రవాణా వ్యవస్థలు, రైలు మార్గాలు లేని రోజుల్లో హైదరాబాద్ నగరాన్ని నిర్మించడంలో బంజారాలు కీలక పాత్ర పోషించారు. ఉత్తరాది నుంచి దక్షిణాదికి, సముద్ర తీరాల నుంచి నగరాలకు ఉప్పు, ధాన్యాలు, ఆయుధాలు, నిర్మాణ సామగ్రిని తమ ఎడ్ల బండ్ల ద్వారా చేరవేసింది బంజారాలే. గోలొండ కోట బురుజుల నిర్మాణానికి కావాల్సిన రాళ్లను, సున్నాన్ని నల్లమల అడవుల నుంచి మోసుకొచ్చింది వీరి శ్రమశక్తే. నేటి బంజారాహిల్స్ ఒకప్పుడు వీరి విడిది కేంద్రం. నిజాం రికార్డుల ప్రకారం, హైదరాబాద్ నడిమధ్యన వేల ఎకరాల భూమి బంజారాల పూర్వీకుల అధీనంలోనే ఉండేది. కాలక్రమేణా నగరీకరణ పేరుతో ఆ భూములు ప్రభుత్వాల వశమయ్యాయి. నగర నిర్మాణం, రక్షణలో బంజారాలు చేసిన త్యాగాలు చరిత్ర పుటల్లో తకువగా కనిపించవచ్చు. కానీ ఈ నగర ప్రతి గల్లీలో వారి కృషికి ఆనవాళ్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన అచ్చంపేట ప్రాంతం పట్ల గిరిజన సమాజం కొన్ని ప్రాథమిక ప్రశ్నలను సంధిస్తున్నది. ‘మేం మళ్లీ అడవికేనా? మమ్మల్ని ఎప్పుడూ అడవికే పరిమితం చేయాలనే ధోరణి మారాలి. హైదరాబాద్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన జాతికి, వారి ఆరాధ్య దైవానికి ఇక్కడ చోటు లేకపోవడం ఏమిటి?’
సేవాలాల్ మహారాజ్ వంటి విశ్వగురువు విగ్రహం, మ్యూజియం, గిరిజన సాంసృతిక కేంద్రానికి సువిశాలమైన భూమిని కేటాయించాలి. అంతర్జాతీయ స్థాయి క్షేత్రంగా అభివృద్ధి చేయాలి. ఒకనాడు తమ పూర్వీకులకు వేల ఎకరాల భూమి హైదరాబాద్‌లో ఉండేదని, ఇప్పుడు అలాంటి వర్గానికి ఆరాధ్యుడైన సేవాలాల్‌కు సముచితమైన భూమి కేటాయించాలని గిరిజనులు కోరుతున్నారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ కేవలం ఒక తెగకు పరిమితమైన ఆరాధ్య గురువు కాదు. 18వ శతాబ్దంలో అహింస, జీవకారుణ్యం, పర్యావరణ పరిరక్షణ, మద్యపాన నిషేధం వంటి గొప్ప సూత్రాలను బోధించిన ఆరాధ్యుడు. ఆడపిల్లలను రక్షించాలని, మూఢనమ్మకాలను వీడాలని ఆయన చేసిన బోధనలే నేడు బంజారా జాతి అభివృద్ధికి పునాదులు.
సీఎం నుంచి పీఎం వరకు అందరూ సేవాలాల్‌కు నివాళులు అర్పిస్తున్నారంటే, ఆయన సిద్ధాంతాల విశ్వజనీనత అర్థమవుతున్నది. ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి. హైదరాబాద్ కేంద్రంగా సేవాలాల్ క్షేత్రం ఉంటే, అది తెలంగాణలోని అన్ని జిల్లాల గిరిజనులకే కాకుండా, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక భక్తులకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇకడ గిరిజన మ్యూజియం, వేద పాఠశాల, సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తే పర్యాటక పరంగా కూడా హైదరాబాద్‌కు వన్నె తెస్తుంది. సేవాలాల్ మహారాజ్ క్షేత్రం అనేది కేవలం ఒక కట్టడం కాదు.. అది తరతరాలుగా శ్రమించిన ఒక వీర జాతికి ఇచ్చే చారిత్రక గౌరవం.