బీసీలకు ఏదో చేస్తున్నట్టు నటిస్తూ, సుమారు 59 శాతంగా ఉన్న బీసీల ఓట్ల చోరీకి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో భంగపాటు ఎదురైంది. బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేలా ఢిల్లీలో డ్రామాలాడుతూ, తప్పడు జీవోలతో తప్పుదోవపట్టిస్తూ ఒంటెద్దు పోకడతో వెళ్తూ బీసీలను మభ్యపెడుతున్న కాంగ్రెస్‌కు న్యాయస్థానం తగిన గుణపాఠం చెప్పింది.
అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్‌కు స్థానిక ఎన్నికలకు వెళ్తే ప్రజాగ్రహం తప్పదని తెలుసు. అందుకే, అతి తెలివితో 22 నెలలుగా తాత్సారం చేస్తూ ప్రజలను, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు బీసీ వర్గాలకు ఏదో ఒరగబెడుతున్నామంటూ తీసుకొచ్చిన తప్పుడు జీవోల కుట్రను రాష్ట్ర హైకోర్టు తిప్పికొట్టి, హస్తం ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. మొత్తానికి కాంగ్రెస్ బండారాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బయటపెట్టింది.
ఒకపక్క రిజర్వేషన్ల విషయమై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కండ్లముందే కనబడుతున్నాయి. అయినా ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీలకు కలుపుకొని మొత్తం 50 శాతం రిజర్వేషన్ల శ్లాబ్‌ను దాటకూడదన్న నిబంధనను కాలరాస్తూ అశాస్త్రీయ విధానాన్ని అవలంబించిన కాంగ్రెస్‌కు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తగిన బుద్ధి చెప్పింది. కాంగ్రెస్ చెప్తున్న మాటలను హైకోర్టు మాత్రమే కాదు, యావత్
తెలంగాణ సమాజం కూడా నమ్మడం లేదు.
గతంలో బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల లెక్క 59 శాతంగా తేలింది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు చేసిన సర్వేలో బీసీలు 56 శాతమే ఉండటం లెక్కల్లో తప్పిదాలను ఎత్తిచూపుతున్నది. నాడు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఒకే రోజులో రికార్డు స్థాయిలో సమగ్ర కుటుంబ సర్వే చేయించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఉన్న యావత్ సమాజాన్ని లెక్కించారు.
ఆ లెక్కలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఏదో ఒరగబెడుతున్నట్టు గప్పాలు కొడుతూ కోర్టు ముందు అడ్డంగా దొరికిపోయింది. చట్టబద్ధత లేని అంశాలతో ప్రజలను వంచించే ప్రయత్నాలను కోర్టులు అడ్డుకుంటాయని, సరైన గుణపాఠం చెప్తాయని ఈ ఘటనతో మరోసారి రుజువైంది. అంతకుముందు బీసీ నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి ఏదో చేయాలని చూసిన సీఎం రేవంత్‌రెడ్డికి ఏఐసీసీ నేతల నుంచి స్పందన కరువైంది. జీవో 9తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై కూడా హైకోర్టు స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి నాలుగు వారాలు గడువు ఇచ్చింది. దీంతో ఎన్నికల ప్రక్రియ ప్రస్తుతానికి నిలిచిపోయినట్టే. పల్లెల గోస ఇంకా కొనసాగుతాయని చెప్పక తప్పదు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదేండ్లలో దేశంలో మరే రాష్ట్రంలోనూ సాధ్యపడని విధంగా కేసీఆర్ అద్భుత ప్రగతిని సాధించారు. భారతదేశంలో తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఈ అభివృద్ధి పయనంలో ప్రతీ సందర్భంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేసీఆర్ అండగా నిలిచారు. అన్ని వర్గాలవారికి సమున్నత న్యాయం కల్పించారు. అందుకే అత్యుత్తమ పాలన అందించిన ఆయనను నేడు తెలంగాణ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.
పదేండ్లలోనే తెలంగాణలో జరిగిన చారిత్రక అభివృద్ధిని విధ్వంసం చేసేలా రేవంత్ సర్కారు చేపడుతున్న అసమర్థ విధానాలు, తప్పుడు జీవోలు సబ్బండ వర్గాలను ఆయోమయానికి గురిచేస్తున్నాయి. అలవికాని 420 హామీలిచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలన రోజురోజుకూ దిగజారిపోతున్నది. ఒకపక్క దళిత ఎమ్మెల్యేలను కించపరిచేలా, రాజకీయ విలువలు దిగజారేలా మంత్రులు మాట్లాడుతున్నారు.
రాష్ట్రం అప్పులకుప్పగా మారింది. 70 లక్షల మంది రైతులు నిత్యం కష్టాల కడలిలో ఈదుతున్నారు. పత్తి, మొక్కజొన్న రైతుల ఆవేదన తీవ్రమైంది. ఈ యాతన పడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి అడ్రస్ లేకుండాపోయింది. ఒంటరి మహిళలు, వృద్ధులకు ఇస్తామన్న పింఛన్లు, విద్యార్థినులకు స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు.. ఇలా అమలుకాని 420 హామీలు కాంగ్రెస్ నేతలను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాయి. బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు మొట్టికాయలతో అయినా కాంగ్రెస్ సర్కారు గుణపాఠం నేర్చుకోవాలి. ఇప్పటికైనా హామీల విషయంలో సరైన విధానాలను అవలంబించాలి.