తె(గు)లుగు మీడియా, తెలంగాణ వ్యతిరేక మీడియా, పచ్చ మీడియా, ఆంధ్రా మీడియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మీడియాకు, తెలంగాణలోని ఓ వర్గం మీడియాకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. అసలు దీనిని మీడియా అనడం కంటే తెలంగాణకు, కేసీఆర్‌కు వ్యతిరేక కూటమి అనడం ఉత్తమం. తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ బీఆర్ఎస్. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ అంటే తెలంగాణ ఇంటి పార్టీ. ప్రజలు కూడా ఏ పార్టీకి ఓటేస్తావ్ అంటే తెలంగాణ పార్టీకి అంటారు. కాంగ్రెస్ పార్టీ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కుని బీఆర్ఎస్ను దెబ్బతీయాలని చూసింది. కానీ ఆ పదిమంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నట్టు చెప్పుకోలేని దారుణమైన పరిస్థితి కాంగ్రెస్‌ది. కాంగ్రెస్‌లో చేరినట్టు చెప్పుకోలేని దిక్కుమాలిన దుస్థితి ఆ ఎమ్మెల్యేలది. బీఆర్ఎస్ను దెబ్బతీయడం సాధ్యం కాదని తేలినందున కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలను అక్రమ కేసులతో వేధించడమే పనిగా పెట్టుకున్నారు.
స్వతహాగా తెలంగాణ వ్యతిరేక శక్తులు, ఓ వర్గం మీడియా వంత పాడుతున్నాయి. కాంగ్రెస్‌కు తెలంగాణ వ్యతిరేక మీడియా అండ దొరకడంతో విశృంఖలత్వం పెరిగిపోయింది. కాళేశ్వరం కమిషన్, ఫోన్‌ట్యాపింగ్, ఫార్ములా ఈ-కార్ రేస్ సిట్ల పేరుతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మసిపూసి మారేడు కాయ చేస్తున్నది. గడచిన 75 ఏండ్ల తెలంగాణ చరిత్రను పరిశీలిస్తే 1950 తర్వాత ఈ నేల మీద పుట్టినవారంతా పోరాటగాథలు వింటూ ఎదిగిన వారే. మరో రకమైన కథలు చూస్తూ పెరిగిన వారు ఎవరూ ఈ ప్రాంతంలో ఉండరు. 1946 నుంచి 1951 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, 1952లో ముల్కీ ఉద్యమం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, 1969 తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత మరెన్నో ఉద్యమాలను చూసిన నేల ఇది. తెలంగాణది నిరంతరం పోరాటమే. పోరాటమే తెలంగాణ ఊపిరి. నరనరాన పోరాటాన్ని పుణికిపుచ్చుకున్న తెలంగాణ సమాజాన్ని లీకులు, ఫేకులతో బురిడీ కొట్టించాలనుకునే మీడియా, కాంగ్రెస్ సర్కారు తీరు ఆత్మహత్యాసదృశ్యమే. భవిష్యత్తులో దాని ఫలితం కూడా వారికి అశనిపాతమే. కాంగ్రెస్ జిమ్మిక్కుల పాలనకు, వంత పాడుతున్న బంటు మీడియా మూల్యం చెల్లించుకోక తప్పదు.
-డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్
ప్రశ్నించే గొంతుకలను అరెస్టులతో నొక్కేస్తారా?
రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ భయపెట్టాలని చూస్తున్నది. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పోరాడటానికి ప్రతిపక్ష నాయకులకు అవకాశం ఉంటుంది. అందుకే వారు నిరంతరం పాలక పక్షాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. అదే కోవలో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, 421 హామీలు అమలు చేయాలని ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు రైతు భరోసా కింద రైతులకు ఎకరాకి రూ.15 వేలు ఇస్తామని చెప్పి నేడు రూ.12 వేలు ఇస్తామని అంటున్నది. రేవంత్ సర్కార్ ఇస్తామన్న హామీల గురించి అడిగితే అక్రమ కేసులతో కోర్టుల చుట్ట్టూ తిప్పుతున్నది. అయినా ప్రజల వైపు మాట్లాడుతూ ప్రజల కోసమే పనిచేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. పదేండ్లపాటు రాష్ర్టాన్ని ఏలిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు. గతంలో పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించిన కాంగ్రెస్ నేడు బీఆర్ఎస్ పార్టీపై గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకుని రాజకీయాలు చేస్తున్నది.
ఇలా కాంగ్రెస్ చేస్తున్న నిరంకుశ విధానాలను ఎత్తి చూపితే అక్రమ అరెస్టులు చేస్తున్నది. రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు ఎక్కడ పర్యటించినా అక్కడి ప్రతిపక్ష నేతలను ముందస్తు హౌస్ అరెస్టులు చేస్తున్నది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజా నాయకుల హక్కులు హరిస్తున్నది. ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నది. ఇప్పటివరకు కూడా రైతులకు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ కాలేదు. కార్ రేస్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుపై అసూయతో ఏసీబీ, ఈడీ దాడులు చేసినా కేసీఆర్ ధాటికి కాంగ్రెస్ ప్రభుత్వం నిలువలేకపోయింది. సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ హవా కొనసాగింది. ప్రజలలో బీఆర్ఎస్ బలపడుతున్నదని ఓర్వలేక నెపంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అగ్రనేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లను విచారణకు పిలిచింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పస లేకున్నా బీఆర్ఎస్ను బదనాం చేయాలని కాంగ్రెస్ చూస్తున్నది. త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గించాలని ప్రయత్నిస్తున్నది. సింగరేణి టెండర్లలో జరుగుతున్న అవినీతిపై మాట్లాడితే నోటీసులు విచారణల పేరుతో బీఆర్ఎస్ నాయకులను భయపెట్టాలని చూస్తున్నది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వారు ప్రజలలోనే ఉంటారు.. ప్రజల తరపున పోరాడుతారు. కేసీఆర్ సైన్యాన్ని కాంగ్రెస్ పార్టీ పాలకులు అణచివేయాలని చూస్తే బీఆర్ఎస్ మరింత బలమైన గళం వినిపిస్తుంది.
-మిద్దె సురేశ్, బీఆర్ఎస్వీ నాయకుడు, 9701209355