దశాబ్దాల పాటు దేశాన్ని, రాష్ర్టాల్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన తీరు చరిత్రలో సుస్పష్టం. ఉమ్మడి ఏపీ విషయానికొస్తే రాష్ట్ర పాలనను ఎప్పుడూ ఆంధ్రుల చేతుల్లో పెట్టి ఆ పార్టీ తెలంగాణను ఎంత నిర్లక్ష్యం చేసిందో తెలిసిందే. వద్దు వద్దు అన్నా వినకుండా తెలంగాణను ఆంధ్రులతో ముడివేసింది కాంగ్రెస్సే. తొలి, మలి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల్లో జరిగిన అన్ని నష్టాలకు కారణం కాంగ్రెస్సే.
1973-78 మధ్యకాలంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న జలగం వెంగళరావు నక్సలైట్ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు. ఆ కిరాతకానికి బలైనవారిలో తెలంగాణ బిడ్డలే ఎక్కువ. 1977 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంగళరావుకు పోటీగా సత్తుపల్లిలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు నిలబడ్డారు. అది కేవలం వెంగళరావు ప్రజా ఉద్యమాల అణచివేతకు నిరసనగా చేసిన పోటీయే. ఆ ఎన్నికల్లో కాళోజీ తరఫున ప్రచారం చేయడానికి శ్రీశ్రీ సహా ఎందరో రచయితలు, కళాకారులు సత్తుపల్లిలో మకాం వేశారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాళోజీ పేరిట ఇస్తున్న పురస్కారాన్ని తెలంగాణ ప్రగతిశీల రచయితలు అందుకుంటున్నారు. ఆనాటి ఎన్కౌంటర్లపై విచారణకు ఊర్లలోకి వచ్చిన నిజ నిర్ధారణ కమిటీల్లో పాల్గొన్నవారు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పదవులు, అవార్డుల కోసం ఆశపడుతున్నారు.
తెలంగాణ మేధావిగా, హక్కుల నేతగా కోదండరాం గతంలో కాంగ్రెస్‌ను నిలదీసినవారే. రాజకీయాల్లోకి వచ్చిన ఆయన సొంత పార్టీ పెట్టుకొని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. చివరకు టికెట్ల విషయంలో కాంగ్రెస్ ఆయనకే మొండిచె య్యిచ్చింది. ఇంతకాలం ఓపిగ్గా కాంగ్రెస్‌తో కలిసి తిరుగుతున్నందుకు ఆయనకు ఎమ్మె ల్సీ పదవి దక్కింది. ఈ మధ్య దాన్ని సుప్రీంకోర్టు లాగేసుకున్నప్పుడు ఆయనను నెటిజన్లు సెటైర్లతో ఆడుకున్నారు. ఈసారి ఆయనతో పాటు వివాదాస్పదుడైన అజారుద్దీన్ ఎమ్మెల్సీ అవుతున్నారు. అయితే, ఇలా కాంగ్రెస్ చేతిలో తెలంగాణ మేధావులు ఆటబొమ్మలుగా మారిపోతున్నారు.
ఈ నెల 9న జరగబోయే దేశ ఉప రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి పోటీగా తెలంగాణకు చెందిన ఓ న్యాయకోవిదుడు నిలబడ్డారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన ఆయన నిష్కల్మష ప్రజా పక్షపాతి. రాజ్యాంగం పట్ల అపారగౌరవమున్న వ్యక్తి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వేదికలెక్కి తన గొంతును స్పష్టంగా వినిపించే వక్త, మేధావి. సోనియాగాంధీ, తదితర కాంగ్రెస్ పెద్దలు వెంట రాగా ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. కూటమి నుంచి వెళ్లిపోయిన ఆప్ కూడా మద్దతివ్వడంతో తాను ప్రతిపక్షాల అభ్యర్థిగా మారిపోయానని సంతృప్తి ప్రకటించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో తన పోటీ అని ఆయన స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రధాన పక్షంగా ఏర్పడ్డ కూటమి అభ్యర్థికి ఓట్ల కోసం ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందరికీ నిజాయితీపరుడైన అభ్యర్థి కనబడుతున్నారు. ఆయన వెనుక హస్తం ఉందన్న విషయం అప్రాధాన్యమైంది. రాజ్యాంగాన్ని సొంత ప్రయోజనానికి వాడుకొని ఎమర్జెన్సీతో దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కర్కశంగా తొక్కేసిన కాంగ్రెస్‌కి మద్దతుగా నిలబడ్డారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వీరినే నిలబెట్టేదా? అంటే ఔనని ఒక్కరూ అనకపోవచ్చు. తమ చెప్పుచేతల్లో ఉండే పార్టీలోని ఓ సీనియర్‌కు ఈ పదవిని కట్టబెట్టేవారు. గెలిచే అవకాశం లేని చోట రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ ముసుగు వేసుకొని కాంగ్రెస్ నీతులు వల్లిస్తున్నది. తోడుగా నిజాయితీపరులను వాడుకుంటున్నది. కేంద్రంలో మతతత్వ పార్టీ అధికారంలో ఉన్నందున ప్రజాస్వామ్యవాదులకు దేశానికి అవసరమైన పార్టీగా కాంగ్రెస్ కనబడుతున్నది. అయితే కష్టాల్లో ఉన్న ఆ పార్టీ గట్టెక్కేందుకు రాజ్యాంగ జపం చేస్తున్నది. ఇది పులి పశ్చాత్తాపం లాంటిదే. పార్టీల తోకలు వదిలేసి మేధావులు ఎప్పటి మాదిరి ప్రజలను చైతన్యవంతులను చేసే పనిలో పడితే అందరికీ మంచిది.
-బద్రి నర్సన్