తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ప్రజల గుండెల్లో నిండింది ఆశలు, త్యాగాల గౌరవం, భవిష్యత్తుపై విశ్వాసం. కానీ ఇపుడు కాంగ్రెస్ పాలనలో ఆ ఆశలు ఒక్కొక్కటిగా అడుగంటుతున్నాయనే భావన స్పష్టంగా వినిపిస్తున్నది. ఉద్యమం పేరు మీద అధికారంలోకి వచ్చిన వారిని కాదని, అదే ఉద్యమ ఆత్మను మట్టిలో కలిపిన వారికి అధికారం కట్టబెడితే, మరిన్ని కష్టాల్లోకి నెట్టివేశారనే భావనలో ప్రజలు ఉన్నారు.
‘మార్పు’ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా, తప్పుడు దారిలో నడుస్తున్నదనే విమర్శలు పెరుగుతున్నాయి. అవినీతి రహిత పాలన, స్వంత రాజకీయాలకు స్వస్తి, ఉద్యమకారులకు న్యాయం..ఇవన్నీ ఎన్నికల వాగ్దానాలుగానే మిగిలిపోయాయి. ఆరు గ్యారెంటీలని చెప్పి ఓట్లను రాబట్టుకున్నా, అమలులో మాత్రం అవి గాలిలో కలిసిపోయాయి. ప్రస్తుత పాలకుల పాలనలో ఒక ప్రమాదకరమైన ధోరణి స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రకటనల పాలన. రోజుకో పథకం, రోజుకో ప్రాజెక్ట్, రోజుకో ఒప్పందం. కానీ వాటి అమలెక్కడ? గడువెక్కడ? ఫలితాలె క్కడ? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. ప్రకటనలతో పాలన నడువదు..ఫలితాలతోనే నడుస్తుంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది అధికార పార్టీ ప్రచారం కోసం ఉపయోగపడినా, అది మొత్తం ప్రభుత్వ పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చలేదు. మిగతా హామీల అమలు ఎందుకు నిలిచిపోయింది? ఇది అసమర్థతా? లేక ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమా? వ్యవసాయ రంగం పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఎన్నికల సమయంలో గొప్పగా ప్రకటించిన రుణమాఫీ ఇప్పటికీ పూర్తికాలేదు. గందరగోళానికి చిహ్నంగా రైతు భరోసా మారింది. అర్హతల మార్పులు, చెల్లింపుల ఆలస్యం, విడతలుగా నిధులు..ఇవన్నీ రైతులను ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. రైతు ఇప్పటికే ప్రకృతి, మార్కెట్ మధ్య నలిగిపోతుంటే, ప్రభుత్వం కూడా భరోసా ఇవ్వలేకపోవటం అత్యంత విచారకరం. ఎరువుల కొరత, సాగునీటి సమస్యలు మళ్లీ ముంచుకొస్తున్నాయి.
యువత పరిస్థితి మరింత విషాదకరం. తెలంగాణ కోసం పోరాడిన యువత ఇప్పుడు ఉద్యోగాల కోసం క్యూల్లో నిలబడి నిరాశతో ఎదురుచూస్తున్నారు. కొత్త నియామకాలు లేకుండా, పాత ప్రక్రియలను కొనసాగించటం ద్వారా సమస్యను తాత్కాలికంగా దాచిపెట్టటం తప్ప పరిష్కారం కాదు. ఇది యువతలో కోపం, ఆగ్రహాన్ని రగిలించుతున్నది.
రాష్ట్రంలో విద్యావ్యవస్థ క్రమేణా క్షీణిస్తున్నది. ఎన్నో పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు, మౌలిక వసతులు లేవు, దీని పర్యవసానంగా గ్రామాల్లో పిల్లలు చదువు మానేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కొత్త ప్రాజెక్టులంటూ ప్రకటనలతో కాలక్షేపం చేస్తున్నది. పాత వ్యవస్థను చక్కదిద్దలేనపుడు కొత్త వ్యవస్థలపై ప్రచారం ఎందుకో? కాంట్రాక్టర్లకు లబ్ధ్ది చేకూర్చడానికేనా? అనే సందేహం ప్రజలకు రావటంలో తప్పులేదు.
ఆరోగ్య రంగం పరిస్థితి కూడా దారుణమే. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు లేరు, సిబ్బంది లేరు. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం తగ్గటంతో ప్రజలు ప్రైవేట్ వైద్యానికి వెళ్లి అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఇది సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను మరింత దిగజారుస్తున్నది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను నింపటమే ధ్యేయంగా కాకుండా సంక్షేమ పథకాలు, అభివృద్ధి అన్నీ సమంగా నడువాలని ఎంతో తపన పడి, అందుకు అనుగుణంగా అడుగులు ముందుకు వేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ కొరవడ్డాయి. గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన ప్రస్తుత పాలకులు, ఇప్పుడు అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నా సంక్షేమ పథకాలు ఎందుకు అమలు కావడం లేదు? ఆ నిధులు లబ్ధిదారులకు ఎందుకు చేరటం లేదు? ఈ ప్రశ్నలకు సర్కార్ సమాధానం చెప్పాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చటం లేదో చెప్పాలి?మొత్తానికి ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యం కాదు..ఇది బాధ్యత వైఫల్యం. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవటం, సమస్యలను పరిష్కరించలేకపోవటం, నమ్మకాన్ని కాపాడుకోలేకపోవటం..ఇవన్నీ కలిసి పాలనను సంక్షోభంలోకి నెడుతున్నాయి.
తెలంగాణ ఇప్పుడు ఒక మలుపు దశలో ఉన్నది. ఉద్యమం ఇచ్చిన ఆశలు ఇంకా పూర్తిగా చచ్చిపోలేదు. కానీ అవి నిలువాలంటే, పాలన మారాలి. హామీలు కాదు..అమలు కావాలి. ఆర్భాటపు ప్రకటనలు కాదు..ఫలితాలు రావాలి. రైతుకు భరోసా కావాలి. యువతకు ఉద్యోగం కావాలి. విద్యార్థికి విద్య కావాలి. ప్రజలకు ఆరోగ్యం కావాలి. ఇవి నినాదాలు కాదు.. ఇవే పాలనకు అసలు ప్రమాణాలు. ప్రజాస్వామ్యంలో తుది తీర్పు ప్రజలదే.
వారు ప్రస్తుతం ఇలాంటి పనికిరాని మాటలు వినే స్థితిలో లేరు. తెలంగాణ భవిష్యత్తు నిర్ణయించేది ఇప్పుడు ఒక్కటే. హామీల రాజకీయాల నుంచి బాధ్యతాయుత పాలనకు మార్పు జరుగుతుందా? లేదా అదే మోసపూరిత చక్రం కొనసాగుతుందా? మళ్లీ తెలంగాణ ప్రజలకు ఉద్యమ మార్గం తప్ప మరోదారి లేదా అనే ప్రశ్న మెదులుతున్నది.
-సిహెచ్.వి.ప్రభాకర్‌రావు
93915 33339