రంగారెడ్డి, మే 25 (నమస్తే తెలంగాణ) : తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని కొహెడ గ్రామంలో సోమవారం ఉద్రిక్తత నెలకొన్నది. బాటసింగారం పండ్ల మార్కెట్‌కు శాశ్వత భవనాల ఏర్పాటు కోసం ప్రభు త్వం సర్వేనంబర్ 167/1లోని 179 ఎకరాలను కేటాయించింది. అయితే ఆ భూమిని కొన్నేండ్లుగా ఆ ఊరికే చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు సాగు చేసుకుని జీవిస్తున్నారు. కాగా, సోమవారం ఉదయం పండ్ల మార్కెట్‌కు సంబంధించిన అధికారులు భారీ పోలీస్ బందోబస్తుతో కలిసి ఆ స్థలాన్ని చదును చేసేందుకు జేసీబీలతో కలిసి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు ఒక్కసారిగా అక్కడికి వందలాదిగా చేరుకుని అధికారులను అడ్డుకున్నారు.
పోలీసులు రైతులను అక్కడి నుంచి పంపించేందుకు యత్నించగా పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేదిలేదని తేల్చిచెప్పా రు. జేసీబీలు ముందుకుసాగకుండా కొందరు మహిళలు అడ్డంగా పడుకున్నారు. తమను చంపి భూ ములు తీసుకోవాలంటూ కన్నీరు కార్చారు. ప్రభుత్వం తమ భూములను బలవంతంగా తీసుకోవాలని చూడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూమిని తమ పూర్వీకుల నుంచి సాగుచేసుకుని జీవిస్తున్నామని..ఆ భూములు తమవి అని.. చెప్పకుండానే భూముల్లోకి ఎలా వెళ్తారని మండిపడ్డారు. తమ జీవనాధారాన్ని లాక్కోవద్దన్నారు. కాగా, ఈ సర్వేనంబర్ 167/1లో ప్రభుత్వ భూమితోపాటు సావుకారిగుట్ట, దేవాలయమూ ఉన్నది. ఈ భూమి ఉమ్మడి రాష్ట్రంలో షెడ్యూల్-9కిందికి వస్తుంది. కాగా, దానిని ప్రభుత్వం పండ్ల మార్కెట్‌కు కేటాయిస్తూ క్యాబినెట్ తీర్మానించింది. అయినప్పటికీ రైతులు తమదేనని కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ భూవివాదం కోర్టులో ఉన్నా.. అధికారులు అవి పట్టించుకోకుండానే.. భూమి చదును పనులకు పూనుకున్నారు.
వ్యతిరేకిస్తున్న రైతులు
గత కేసీఆర్ ప్రభుత్వం కొహెడలోని సర్వేనంబర్ 548లో 133 ఎకరాలు, సర్వేనంబర్ 507లో 44 ఎకరాల ప్రభుత్వ భూమిని బాటసింగారం పండ్ల మార్కెట్‌కు కేటాయించింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మార్కెట్‌ను నిర్మించాలని భావించి డీపీఆర్‌ను కూడా సిద్ధం చేసింది. కాగా, ఆ సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలొచ్చి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ భూమిని రేవంత్ సర్కార్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పేరుతో ఇతరులకు కేటాయించేందుకు టీజీఐఐసీకి బదిలీ చేసింది. ఆ తర్వాత అనేక వివాదాల్లో చిక్కుకున్న సర్వేనంబర్ 167లో గల 179 ఎకరాలను పండ్ల మార్కెట్‌కు కేటాయించింది. మరోవైపు ఈ భూమిని సాగుచేసు కుని జీవిస్తున్న వందలాది మంది రైతులు ఈ కేటా యింపును మొదటినుంచి వ్యతిరేకిస్తున్నారు.