న్యూఢిల్లీ, మే 25: కర్ణాటక కాంగ్రెస్ నాయకత్వ మార్పుపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో మంగళవారం జరిగే సమావేశం తర్వాత దీనిపై నిర్ణయం వెలువడవచ్చని వారు చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో పెరుగుతున్న గ్రూపు రాజకీయాల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. పోటీ వర్గాలకు చోటు కల్పించేందుకు సిద్ధరామయ్య మంత్రివర్గాన్ని విస్తరించడం, ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడానికి బదులుగా ఆయనకు జాతీయ సంస్థాగత పాత్రను ఆఫర్ చేయడం, లేదా డీకే శివకుమార్‌కు అనుకూలంగా నాయకత్వ మార్పును ప్రారంభించడం వంటి పలు ప్రత్యామ్నాయాలను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అంతేగాక ఏకాభిప్రాయ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కర్ణాటక రాజకీయాల్లోకి తీసుకురావాలనేది చర్చలో ఉన్న మరో ప్రతిపాదన అని తెలిపాయి. సిద్ధరామయ్య, డీకే మధ్య రొటేషన్ పద్ధతిలో ముఖ్యమంత్రి ఒప్పందం ఉందన్న వదంతులు కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో అత్యంత కీలకమైన ఈ సమావేశం జరగనున్నది. సమావేశానికి ముందు విలేకరులతో సిద్ధరామయ్య మాట్లాడుతూ ఢిల్లీ నుంచి తనకు పిలుపు వచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే సమావేశం అజెండా గురించి తనకు తెలియదని ఆయన అన్నారు.