జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీల మధ్య నిత్యం పోరు కొనసాగుతుంది కానీ, తెలంగాణకు వచ్చేసరికి మాత్రం ఆ రెండు పార్టీలు ఒక్కటవుతున్నాయి. అందుకే ఆ ఇరు పార్టీలు రహస్య మైత్రిని కొనసాగిస్తున్నాయనే విషయం స్పష్టమవుతున్నది. ‘రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీ నుంచి దించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ప్రయత్నిస్తున్నారు’ అని కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడటమే అందుకు ఉదాహరణ. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా? బీజేపీ అనుబంధ ప్రభుత్వమా? అర్థం కాక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఎందుకంటే ఆ రెండు పార్టీలు ఒకరికొకరు విమర్శించుకోవడం ఆపేసి ప్రతిపక్షమైన బీఆర్ఎస్ను దూషిస్తుండటమే ఇందుకు తార్కాణం.
రేవంత్ రెడ్డి సీఎం పదవి స్వీకరించిన తర్వాత కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సి నిధులు సరిగా రావడం లేదు. అయినా రేవంత్ కేంద్రంతోని పెద్దగా పేచీ పెట్టుకోవడం లేదు. ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిమ్మనకుండా ఉంటున్నారు. అధికారం చేజిక్కించుకోవడం కోసం ఆరు గ్యారెంటీల పేరిట లెక్కకు మించి హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలలైనా ఆ హామీలను నెరవేర్చడం లేదు. పైగా హైడ్రా పేరిట తెలంగాణలో విధ్వంసం జరుగుతున్నదే తప్ప వికా సం వైపు అడుగులు పడటం లేదు. ముఖ్యమంత్రిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్దామన్న తపన ముఖ్యమంత్రిలో కనిపించకపోవడమే నేటి విషాదం.
ఎంతసేపూ రేవంత్ రెడ్డి ధ్యాస మొత్తం సీఎం పదవిని కాపాడుకోవడం కోసమే కానీ, ప్రజల బాగోగులు మాత్రం ఆయనకు పట్టడం లేదు. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తున్నాడు. బడా బాబులను భయపెట్టి ఢిల్లీకి కప్పం కడుతున్నాడు. ‘ప్రభుత్వం’ అంటేనే మంత్రుల సమాహారం. కానీ సీఎం ఒక దారి, మంత్రులు ఇంకోదారిలో ఎవరికి నచ్చిన పనులు వాళ్లు చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే ముఖ్యమంత్రులు. అందుకే ముఖ్యమంత్రికి, మంత్రులకు పొసగడం లేదనే గుసగుసలు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఒక మంత్రి రాష్ట్రంలో పర్యటించడానికి హెలికాప్టర్ అడిగితే అధికారులు లేదని చెప్పారట. అంతే, ఆ మం త్రి అధికారులపై ఫైర్ అయ్యారని సమాచారం! ‘నేను కూడా సీఎం స్థాయి వ్యక్తినే, నాకెందుకివ్వరు హెలికాప్టర్. మేం పదవీ త్యాగం చేస్తేనే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడ’ని ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడట! ఈ అంతర్గత కలహాల వల్లనే సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీతో సఖ్యతగా మెదులుతున్నాడని కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. కాంగ్రెస్‌లో ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే బీజేపీలోకి జంప్ కావడానికి రేవంత్‌రెడ్డి దారులు వేసుకుంటున్నాడనే మాటలు ఇటీవల రాష్ట్రంలో జోరందుకున్నాయి.
రాష్ట్ర బీజేపీ నాయకుల వైఖరి కూడా అందుకు తగ్గట్టే ఉంటున్నది. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. బీజేపీ నాయకులు తరచూ బీఆర్ఎస్ పార్టీని విమర్శించడమేమిటో విడ్డూరం కాకపోతే. సీఎం రేవంత్‌ను బండి సంజయ్ తరచూ పొగడటం, తాజాగా ‘రేవంత్‌ను సీఎం కుర్చీ నుంచి దించేందుకు రాష్ట్ర మంత్రులు ప్రయత్నిస్తున్నార’ని వ్యాఖ్యలు చేయడం బీజేపీ, సీఎం రేవంత్ రెడ్డి రహస్య మైత్రిని బహిర్గతం చేస్తున్నాయి. ఈ తతంగం మొత్తాన్ని పరికించి చూస్తే ఏడాది నిండకముందే రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయేమోనన్న అనుమానాలు ప్రజలకు రేకెత్తుతున్నా యి. ప్రజలు కూడా రేవంత్ పది నెలల పాలనను చూసి విసిగి వేసారిపోయారు. ఇందిరమ్మ పాలన అంటే ఇండ్లు కట్టిస్తారేమోననుకున్నాం కానీ, ఇండ్లను కూలగొడ్తరనుకోలేదని వాపోతున్నారు. అవకాశం దొరికితే చాలు రేవంత్ ను గద్దె దించేందుకు తహతహలాడుతున్నారు. ‘ప్రజల్లో ఈ వ్యతిరేకత ఇంకా పెరగాలని మంత్రులు కూడా కోరుకుంటున్నారని, తద్వారా సీఎం సీటు నుంచి రేవంత్‌ను తప్పించవచ్చనేది మంత్రుల ఆలోచన’ అని బండి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదని ఇరు పార్టీల ద్వితీయశ్రేణి నాయకులు తలలు పట్టుకుంటున్నా రు. ఏదేమైనా ఇటు రాష్ట్ర ప్రజలు, అటు కాంగ్రెస్ మం త్రులు సీఎం సీటుకు ఎసరు పెట్టారని, ఇది మనం అవకాశంగా తీసుకోవాలన్నదే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎత్తుగడ. అందుకోసమే రేవంత్‌ను పావుగా వాడుకుంటున్నది. అందుకే రేవంత్ కూడా బీజేపీతో సఖ్యతతో మెదులుతున్నాడు. దొంగలు.. దొంగలు ఊరు పంచుకున్నట్టు తెలంగాణ రాష్ర్టాన్ని ఈ రెండు జాతీయ పార్టీలు పంచుకోవడమేమిటని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.