పారిశ్రామిక ప్రగతి ప్రస్థానంలో మానవ ప్రాణం ఎంత చౌకబారు వస్తువుగా మారిందో చెప్పడానికి సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ పేలుడు ఘటనే సజీవ సాక్ష్యం. 2025 జూన్ 30న సంభవించిన ఆ ఘోర విపత్తు జరిగి ఏడాది కావస్తున్నా, పారిశ్రామికవాడల్లో నేటికీ ఆ కన్నీటి గాథలు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా అమాయక వలస కార్మికుల రక్తంతో తడిసిన నేల మీద వెలసిన లాభాల సామ్రాజ్యం వెనుక ఉన్న అమానవీయతను, ప్రభుత్వ వ్యవస్థల నిర్లక్ష్యాన్ని లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఆరోజు ఉదయం వేళ.. సిగాచి కెమికల్ ప్లాంట్లో పేరుకుపోయిన దహనశీల రసాయన పొడి-మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ అకస్మాత్తుగా పేలింది. ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 54 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 46 మంది సంఘటనా స్థలంలోనే శరీరాలు ముక్కలై మరణించగా, ఆచూకీ దొరుకని మరో 8 మంది గల్లంతైన కార్మికులు సుదీర్ఘ చట్టపరమైన ప్రక్రియ, కోర్టు ఆదేశాల అనంతరం మరణించినట్లు ప్రకటించి డెత్ సర్టిఫికెట్లు ఇచ్చారు. మృతుల్లో 25 మంది శాశ్వత, 18 మంది క్యాజువల్, 11 మంది కాంట్రాక్టు వర్కర్స్ ఉన్నారు. ఈ ప్రమాదంలో 28 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద బాధితుల్లో అత్యధికులు వలస కార్మికులే.
ఈ ఘోర ప్రమాదం జరిగిన వెంటనే బాధితుల పక్షాన నిలబడి, వారికి చట్టపరమైన రక్షణ, పరిహారం అందేలా చూడటానికి పౌరసమాజం తరఫున ఒక బలమైన న్యాయపోరాటం మొదలైంది. ప్రమాదం జరిగిన వెంటనే ‘తెలంగాణ పీపుల్స్ జేఏసీ, శాస్త్రవేత్తలు, మానవ హక్కుల వేదిక, జాతీయ ఉద్యమాల ప్రజా వేదిక ఉమ్మడిగా రిటైర్డ్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కలపాల బాబురావు పేరిట హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. బాధితుల తరఫున సీనియర్ న్యాయవాది అడ్వకేట్ వసుధ నాగరాజ్ సమర్థవంతంగా కోర్టులో వాదించారు. ప్రభుత్వం, యాజమాన్యం కలిసి బాధితులకు చేస్తున్న అన్యాయాలను, చట్టపరమైన లోపాలను ఆమె కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది సాగించిన ఈ నిరంతర పోరాటం వల్లే కోర్టు కదిలింది, ఫలితంగా బాధితులకు దక్కాల్సిన కోటి రూపాయల పరిహారంలో పాక్షికంగా రూ.42 లక్షలు అందాయి. ఇతర చట్టబద్ధమైన హక్కుల కోసం రీజినల్ ఈపీఎఫ్వో కమిషనర్, ఈఎస్ఐ ప్రాంతీయ డైరెక్టర్, తెలంగాణ డ్రగ్స్ కంట్రోలర్లను కోర్టు కొత్త ప్రతివాదులుగా చేర్చింది.
సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు కేవలం ఆకస్మిక ప్రమాదం కాదు, నిబంధనలను తుంగలో తొక్కిన సామూహిక నిర్లక్ష్యకాండ. ప్రభుత్వం నియమించిన టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ సమర్పించిన 128 పేజీల నివేదిక ఫ్యాక్టరీలోని ఘోరమైన సాంకేతిక ఉల్లంఘనలను బయటపెట్టింది. టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ తన నివేదికలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యాలను తీవ్రంగా ఎండగట్టింది. అధికారుల ఈ నేరపూరిత నిర్లక్ష్యం వల్లే 54 మంది ప్రాణాలు పోయినా, ప్రభుత్వం కేవలం రూ.లక్ష తక్షణ సాయంతో తన బాధ్యత ముగిసిందని భావించడం శోచనీయం. కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం కింద రూ.2 లక్షలు ప్రకటించింది. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మొత్తాలు ఇప్పటివరకు 54 మంది మృతుల్లో కేవలం 43 మంది కుటుంబాలకే అందాయంటే ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. క్షతగాత్రులకు పూర్తి స్థాయి చికిత్సా బాధ్యతతో పాటు తీవ్ర గాయాలైన వారికి రూ.10 లక్షల చొప్పున, స్వల్ప గాయాల పాలైన వారికి ఐదు లక్షల చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, తీవ్రంగా గాయపడ్డ వారిలో కొందరిని నిర్లక్ష్యం చేస్తున్న వైనం కండ్లకు కనబడుతున్నది.
బాధితుల పక్షాన ఒత్తిడి పెరిగిన తరుణంలో, 2026 మార్చి 11న 10వ ప్రతివాదిగా ఉన్న సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ హైకోర్టులో ‘అదనపు కౌంటర్ అఫిడవిట్’ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ ద్వారా కంపెనీ ఎంత దారుణంగా బాధితులను వంచించాలని చూస్తున్నదో స్పష్టమైంది. తాము ప్రతి మృతుడి కుటుంబానికీ రూ.42 లక్షలు చెల్లించామని చెప్తున్న కంపెనీ, అసలు నిజం ఒప్పుకొన్నది. ఈ మొత్తం అనేది కేవలం కంపెనీ ఇచ్చే స్వచ్ఛంద సహాయం కాదని, అది ‘కాంపోజిట్ పేమెంట్’ అని వాదించింది. అంటే, కంపెనీ ఎక్స్గ్రేషియాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించిన మొత్తాలు, కార్మికుడి సొంత చట్టబద్ధమైన హక్కులైన పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్తో కలిపి లెక్కగట్టి చూపిస్తున్నట్లు ఒప్పుకొన్నది. అయితే, కార్మికుడు తన కష్టార్జితం ద్వారా సంపాదించుకున్న చట్టబద్ధమైన పీఎఫ్, ఈఎస్ఐలను కంపెనీ తన జేబు నుంచి ఇస్తున్న పరిహారంలో కలిపి చూపడం అమానవీయమైన చర్యగా నిలిచింది. కంపెనీ రూ.42 లక్షలు మాత్రమే చెల్లించడానికి ప్రభుత్వంతో ఒప్పందం జరిగినట్లు కూడా పేర్కొన్నది. కానీ ఒప్పందపత్రాలను అటు కంపెనీ గాని, ప్రభుత్వం గాని బయటపెట్టలేదు.
ప్రమాదం జరిగిన మరుసటి రోజు స్వయంగా సీఎం రేవంత్రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి, మరణించిన ప్రతి కార్మికుని కుటుంబానికీ రూ. కోటి పరిహారం అందిస్తామని చెప్పారు. జూలై 2, 2025న కంపెనీ కూడా బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో రూ.కోటి పరిహారం ఇస్తామని తెలిపింది. కానీ ఆ తర్వాత అసెంబ్లీలో సమర్పించిన అధికారిక లెక్కల ప్రకారం..54 మంది బాధితులకు చెల్లించిన సగటు పరిహారం కేవలం రూ.45.40 లక్షలే. సీఎం హామీలో సగం కంటే ఎక్కువ బకాయిని ప్రభుత్వం బాధితులకు అందకుండా కంపెనీకి పరోక్షంగా సహకరిస్తున్నట్లుగా ఉన్నది.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 54 మంది కుటుంబాల పరిస్థితి ఒక ఎత్తయితే, సగం కాలిపోయిన శరీరాలతో ప్రాణాలతో బయటపడిన క్షతగాత్రుల పరిస్థితి మరణించిన వారి కంటే దారుణంగా ఉన్నది. నేటికీ వారి పట్ల కంపెనీ అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నది. సిగాచి ఉదంతం నేర్పిన పాఠాల నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు పునరావృతం కాకుండా ఉండటానికి కంపెనీ, ప్రభుత్వం, సమాజం తమ బాధ్యతలను నెరవేర్చాలి. పౌరసమాజం, ప్రజాసంఘాలు, మీడియా సిగాచి బాధితుల వంటి అమాయకులకు చట్టపరమైన న్యాయం జరిగే వరకు నిరంతరం గళం వినిపిస్తూ పాలకులపై సామాజిక ఒత్తిడిని సృష్టించాలి. వ్యవస్థలో ఈ మార్పు వచ్చినప్పుడే భవిష్యత్తులో కార్మికుల ప్రాణాలు బలిపీఠాలు ఎక్కకుండా రక్షించేందుకు ఆస్కారం ఉంటుంది.
– (వ్యాసకర్త: వై.అశోక్ కుమార్, టీపీజేఏసీ సంగారెడ్డి జిల్లా చైర్మన్ )
వై.అశోక్ కుమార్