ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని లగచర్ల గ్రామంలో ఫార్మా విలేజ్ భూ సేకరణపై చర్చించేందుకు వెళ్లిన కలెక్టర్, తహశీల్దార్‌పై రైతులు, గ్రామస్థులు దాడి చేయడం దేనిని సూచిస్తున్నది? ఏడాదిలోనే ఒక ప్రభుత్వం ఈ స్థాయిలో ప్రజా విశ్వాసం కోల్పోవడం మన దేశ చరిత్రలో జరిగిన దాఖలాలు లేవు. రైతుభరోసా, రుణమాఫీ వంటి హామీలు అమలు చేయలేకపోవడం, హైడ్రా వంటి తమాషాలు వెరసి కాంగ్రెస్ సర్కార్ అంటేనే అపనమ్మకం ఏర్పడింది. ఇదిలా ఉంటే, బీసీ కులగణన కోసం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పేరిట చేపట్టిన తంతుకు ప్రజల నుంచి సహకారం లేకపోగా ఎదురుతిరిగి తరిమికొట్టడం పెల్లుబుకుతున్న ప్రజాగ్రహానికి తాజా ఉదాహరణ.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీ కులగణన చేయించి, ఆ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పెద్దలు ఊరించారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లోనే బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని ఊదరగొట్టారు. కానీ, రేవంత్ సర్కారు ఆ దిశగా సరైన అడుగులు వేయకపోవడం, మోసకారి హామీలను తూచ్ చేసేందుకు అష్టవంకర్లు తిరగడం ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వహిస్తున్న సర్వేపై యథావిధిగానే ప్రజల్లో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కులగణనలో ఆస్తి, ఆదాయ వివరాలు దేనికి? రైతుబంధు, రుణమాఫీల్లో కొర్రీలు, కోతలు వేయడం తెలిసిందే. అదే తరహాలో పథకాల లబ్ధిలో కోతలు పెట్టేందుకే అదనపు వివరాలు సేకరిస్తున్నారా? అనేది అతి ముఖ్యమైన సందేహం. అందుకే ప్రజలు అధికారులకు సమాచారం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. పలుచోట్ల బాహాటంగానే సర్వేను బహిష్కరిస్తున్నారు. హమీల అమలు చేతకాక కోతలు పెడుతున్నారనే భావన బలంగా నాటుకుపోయింది. కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చుడేమో గానీ, ఇదివరకటి ప్రభుత్వం ఇచ్చినవి కూడా ఊడగొట్టేందుకు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న కసరత్తులో ఇదంతా భాగమేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
తమకు మేలు చేస్తుందని నమ్మితేనే ప్రజలు సర్కారు సర్వేకు సహకరిస్తారు. కానీ, ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. మేలు చేయడం కోసం కాకుండా మరోసారి వంచించేందుకు సర్కారు సర్వే ను చేపట్టిందని భయపడుతున్నారంటేనే విశ్వసనీయత ఏ స్థాయిలో ఉన్నదో తెలుస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం ఒక్కరోజులో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఓ రికార్డు. రాష్ట్ర జనాభాలో సింహభాగం సగానికి పైగా (51 శాతం) ఉన్నది బీసీలేనని ఆ సర్వే తేల్చిచెప్పింది. ఇం గ్లండ్‌లో జరిగిన చరిత్రాత్మకమైన ‘డోమ్స్ డే’ సర్వేతో దానిని విశ్లేషకులు పోల్చడం గమనార్హం. కరోనా రక్కసి అంటుకు లేకుండా చేసేందుకు చేపట్టిన జ్వర సర్వే కేసీఆర్ దీక్షాదక్షతలకు మరో ఉదాహరణ. కానీ, ఒక ప్రొఫార్మా అంటూ లేకుండా ఆదరాబాదరాగా, మొక్కుబడిగా కాంగ్రెస్ సర్కారు ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్వే వాటికి ఏ మాత్రం సాటిరాదు. సర్కారు చెప్పిన జనవరి గడువులోగా సర్వే పూర్తయి బీసీల లెక్కతేలుతుందా? లేక రిజర్వేషన్ల పెంపు లేకుండా ఎన్నికలను మమ అన్నట్టుగా నిర్వహించాలని చూస్తున్నదా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.