ఇప్పుడు దేశవాప్తంగా లక్షలాది మంది జనాల నాలుకపై నానుతున్న పేరు కేసీఆర్… కేసీఆర్… కేసీఆర్… ఈ పేరుకు ఎందుకింత క్రేజ్? పలు రాష్ర్టాల్లో లక్షల సంఖ్యలో పెరుగుతున్న ఫాలోయింగ్. ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశాలలో అక్షరాలా 4 లక్షలకు పైగా ప్రతినిధులు పాల్గొన్న సందర్భం మనం చూశాం. ఉద్యమ సారథిగా కేసీఆర్ తన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించిన తొలి రోజుల్లో యావత్ తెలంగాణలో కేసీఆర్‌కు ప్రజలు ఎలాంటి బ్రహ్మరథం పట్టారో సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో కేసీఆర్‌కు ప్రజలు అలాగే బ్రహ్మరథం పడుతున్నారు. ఆ పేరూ అలాగే మార్మోగిపోతున్నది.
గడిచిన ఎనిమిదేండ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రగతిని పరిశీలిస్తే తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో అసాధారణ ప్రగతిని సాధించింది. ఐటీ రంగంలో, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు, తెలంగాణలో నూతన చట్టాల రూపకల్పన, సాగునీటి శాఖ పునర్వ్యవస్థీకరణ, సమగ్ర భూ సర్వే, ధరణి పోర్టల్, భూ పరిపాలనలో సంస్కరణలు ఇలా.. అన్నిరంగాల్లో అభివృద్ధి దిశగా తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నదని చెప్పడంలో అతిశయోక్తిలేదు.
ఒకసారి గతాన్ని స్మరించుకుంటే ‘నాడు ఈ ఒక్కడి వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా?’ అని పిచ్చి ప్రశ్నలు సంధించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత (విమర్శించిన నోళ్లే) ప్రశంసలతో ముంచెత్తాయి. చివరికి తన చావుతోనైనా తెలంగాణ వస్తే చాలని ప్రజలకు చెప్పి ఆమరణ నిరాహారదీక్షకు దిగి దాదాపు మృత్యువు అంచులదాకా వెళ్లిన మహామనిషి కేసీఆర్. యావత్ తెలంగాణ సమాజాన్ని రాజకీయ శక్తిగా మలిచిన రాజనీతి ధురంధరుడైన కేసీఆర్ తన ఉపన్యాసాలతో ప్రజల హృదయాలను ఉప్పొంగేలా చేసి, అసాధ్యమని భావించిన స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన ఉద్యమ నాయకుడు. రథసారథిగా చరిత్ర పుటపై చెరిగిపోని సంతకం చేశారు. స్వరాష్ర్టాన్ని సాధించడమే కాదు, సాధించుకున్న తెలంగాణను నీళ్లు, నిధులు, నియామకాలతో కొత్త చరిత్రకు నాంది పలికారు.
తొమ్మిదేండ్ల స్వల్ప కాలంలోనే సంక్షేమంలో స్వర్ణయుగం నిర్మాణం చేసి తిరుగులేని చక్రవర్తిలా, సార్వభౌమునిలా ప్రజారంజక పరిపాలనను అందిస్తున్నా రు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే మరెక్కడా లేని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి అనతికాలంలోనే దేశానికి తెలంగాణ మోడల్ అవసరమని నిరూపించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటున్న వేళ తెలంగాణ జాతిపిత, బంగారు తెలంగాణ రూపశిల్పి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్యమ ప్రస్థానం, నేడు ఆయన సాగిస్తున్న సంక్షేమ స్వర్ణయుగం పరిపాలన గురించి ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
మాటల మాంత్రికుడు
ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ఉపన్యాసం చేయడంలో కేసీఆర్‌కు పోటీ లేరనేది జగమెరిగిన సత్యం. తాను ప్రసంగం మొదలుపెట్టారంటే ఎదుటివారి గుండెలను రగిలించగలరు. పోరాట పటిమను వెయ్యింతలు చేసి ఒక మహా విస్ఫోటనాన్ని రగిలించగల ధీశాలి. అందుకే ఆయన స్థాపించిన పార్టీ ప్రజల నరనరాల్లో ఇంకిపోయేలా, అనతికాలంలోనే తెలంగాణలోని ప్రజలు వాస్తవాలను గుర్తించేలా చేశారు.
స్వరాష్ట్ర సాధనకు తాను, తనతో పాటు ఉద్యమకారులు ఎన్నిసార్లు తమ పదవులకు రాజీనామాలు చేసినా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి, తెలంగాణ వాదాన్ని గెలిపిస్తూ వచ్చారు. దీనంతటికీ కారణం ఒకే ఒక్కడు కేసీఆర్. సాధించుకున్న రాష్ర్టాన్ని దేశంలోనే మణిహారంలా మార్చి చూపిన మహోన్నతుడు కేసీఆర్. ఆయన జీవిత ప్రస్థానం, ఉద్యమ పోరాట పటిమ, సాహసం, అనితర సాధ్యం.
తెలంగాణ పదాన్ని సైతం పలకడానికి భయపడే రోజుల్లో టీఆర్ఎస్ను స్థాపించి రాష్ట్ర సాధనకు తగిన వ్యూహాన్ని ఎంచుకోవడంలో కేసీఆర్ చూపిన పరిణతి భవిష్యత్ తరాలకు విలువైన పాఠ్యాంశంగా నిలిచిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మరో మహాత్ముని వలె అహింసామార్గంలో, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో, మొక్కవోని దీక్షతో పోరాటాన్ని ముందుండి నడిపిన మార్గదర్శకుడు.
స్వర్ణయుగానికి సార్వభౌముడు
సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం వల్ల తెలంగాణ సమాజం ఛిన్నాభిన్నమైంది. ప్రజలు కనీస అవసరాలు కూడా తీరక పేదరికంలో మగ్గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప ఈ సంక్షోభం నుంచి తమకు విముక్తి లభించదని భావించిన సకలజనులు, సబ్బండ వర్ణాలు ఏకోన్ముఖంగా పోరాడారు. తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైన తర్వాత అట్టడుగు వర్గాలకు, ఆర్థికంగా వెనుకబడినవారికి కనీస జీవన భద్రత కల్పించాలన్న మహోన్నత ఆశయంతో 2014 నుంచి 2023 వార్షిక బడ్జెట్లలో సంక్షేమానికి సింహభాగం నిధులు కేటాయించడమే కాకుండా, వాటిని సద్వినియోగం చేసి సరికొత్త నిర్వచనం చెప్పారు.
నాడు రూ.200లుగా ఉన్న పింఛన్‌ను ఏకంగా రూ.2,016లకు పెంచి, బడుగుల బతుకులకు భరోసా కల్పించారు. గడిచిన ఎనిమిదేండ్లలో ఆసరా పింఛన్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.57,650 కోట్లు ఖర్చు చేసిందంటే సంక్షేమం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలోని పేద ప్రజలకు తమ ఇంటి ఆడపిల్ల పెండ్లి ఆర్థికభారం కాకూడదని భావించి ఆడపిల్ల పెండ్లికి ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో అండగా నిలుస్తున్నది.
తొలుత రూ.51వేలతో ప్రారంభించి నేడు రూ.1,00,116లు చెల్లించి వారి ఆత్మగౌరవాన్ని పదింతలు చేశారు. ఇప్పటికీ కల్యాణలక్ష్మి పథకానికి రూ.8,182 కోట్లు, షాదీముబారక్ పథకానికి 1,902 కోట్లు ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రం ఏర్పడేనాటికి ప్రతి తెల్ల రేషన్ కార్డుదారునికి నెలకు 4 కిలోల బియ్యం మాత్రమే అందించేవారు. స్వరాష్ట్రంలో ఒక్కొక్కరికి 6 కేజీలు పంపిణీ చేస్తున్నారు. విద్యార్థులకు సన్నబియ్యాన్ని హాస్టళ్ల ద్వారా అందించి వారి బంగారు భవిష్యత్తుకు మార్గం చూపారు.
విద్య, వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు
గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ట్రం విద్య, వైద్యరంగాల్లో అపూర్వమైన ప్రగతిని సాధించి, దేశానికి దిక్సూచిగా నిలిచింది. ప్రధానంగా మావన వనరుల అభివృద్ధిపైనే సమాజ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న ప్రధాన అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. అందుకే విద్యారంగ వికాసం కోసం తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తున్నది. ఆవాస విద్యను ప్రోత్సహించాలని నిర్ణయించి, పెద్ద ఎత్తున గురుకులాలను స్థాపించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఉమ్మడి రాష్ట్రంలో 134 ఎస్సీ గురుకులాలు ఉండగా 82,063 మంది విద్యార్థులుండేవారు. ఇప్పుడు స్వరాష్ట్రంలో ఉన్నత ప్రమాణాలతో 238 గురుకులాల్లో మొత్తం 1.36 లక్షల మంది ఎస్సీ విద్యార్థులు అత్యుత్తమ విద్యను అందుకుంటున్నారు. ఇదొక చారిత్రక మార్కును స్థాపించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 2014కు ముందు 91 ఎస్టీ గురుకులాల్లో 31, 391 మంది విద్యార్థులుండేవారు. ఇప్పుడు మొత్తం 161 గిరిజన గురుకులాల్లో 66,168 మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. నాడు 12 మైనారిటీ గురుకులాల్లో 7,680 మంది విద్యార్థులుండగా, నేడు ఏకంగా రాష్ట్రంలో 204 మైనారిటీ గురుకులాల్లో 1,20,880 మంది విద్యార్థులున్నారు.
నాడు ఉమ్మడి ఏపీలో 19 బీసీ గురుకులాల్లో 8 వేల మంది విద్యార్థులుండగా, నేడు 280 బీసీ గురుకులా ల్లో 1,31,360 మంది విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తు కోసం చదువుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 37 జనరల్ హాస్టళ్లుండగా 22,920 మంది విద్యార్థులున్నారు. మొత్తమ్మీద రాష్ట్రం ఏర్పడకముందు 293 గురుకులాల్లో 1,52,054 మంది విద్యార్థులుండగా, నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా 920 గురుకులాల్లో ఊహించని విధంగా 4,77,450 మంది విద్యార్థులు ప్రభుత్వ గురుకులాల్లో చదువుకుంటున్నారు. ఇక డిగ్రీ కాలేజీల విషయంలోనూ అద్భుతమైన విద్యావిధానంతో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో ఉన్నది.
మొత్తం 30 ఎస్టీ డిగ్రీ కాలేజీల్లో 19,198 విద్యార్థులు, ఒక బీసీ డిగ్రీ కాలేజీలో 1,080 మంది విద్యార్థులు, 22 ఎస్సీ డిగ్రీకాలేజీల్లో 9,159 మంది విద్యార్థులున్నారు. మొత్తం 53 డిగ్రీ కాలేజీల్లో 29,437 మంది విద్యార్థులు నాణ్యమైన విద్యనభ్యసిస్తున్నారు. యావత్ రాష్ట్రంలోని గురుకులాల్లో 5,06,887 మంది విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును తరగతి గదుల్లో నిర్మించుకుంటున్నారు.
సబ్బండ వర్ణాలకు తరగని సంక్షేమం
ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న అనేక పథకాలు మరే రాష్ట్రంలోనూ అమలుకావడం లేదు. ముఖ్యంగా డబ్బు ఏండ్లుగా దళితులకు అందని సంక్షేమం గురించి సమగ్రంగా ఆలోచించి రాష్ట్రంలోని 17 లక్షల దళిత కుటుంబాలకు ఇంటికి రూ.10 లక్షల చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త చరిత్రకు నాంది పలికారు.
ఈ పథకం కింద రూ.4,404 కోట్ల నిధులు వెచ్చించి తిరుగులేని సంక్షేమం అందిస్తున్నారు. రైతుబంధు పథకానికి రూ.65,481 కోట్లు, రైతు బీమాకు రూ.5,384 కోట్లు, రైతు రుణమాఫీకి రూ.17,351 కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.57,650 కోట్లు, ఉపాధిహామీ పథకానికి రూ.27,825 కోట్లు, కేసీఆర్ కిట్ పథకానికి రూ.1,4 20 కోట్లు, ఆరోగ్యశ్రీ కింద రూ.8,000 కోట్లు, రైతుల కు ఇన్పుట్ సబ్సిడీ రూ.1,325 కోట్లు, దళితులకు మూడెకరాల భూ పంపిణీకి రూ.768 కోట్లు, రైతు వేదికల నిర్మాణానికి రూ.572 కోట్లు, ఎస్సీ పారిశ్రామిక వేత్తలకు సబ్సిడీ రూ.2,760 కోట్లు, దళితులకు ఉచిత విద్యుత్ రూ.251 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.70, 965 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.37,779 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ రూ.639 కోట్లు, ఎస్టీలకు ఉచిత విద్యుత్ కింద రూ.192 కోట్లు, సెలూన్లకు ఉచిత విద్యుత్ కింద రూ.147 కోట్లు, గేదెల పంపిణీ కింద రూ.370 కోట్లు, పంటల కొనుగోలుకు రూ.6,195 కోట్లు, ధాన్యం కొనుగోలుకు రూ.1,21,000 కోట్లు, మైనారిటీ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం రూ.435 కోట్లు, బతుకమ్మ చీరల పంపిణీకి రూ.1,536 కోట్లు, క్రాప్ ఇన్సూరెన్స్ కింద రూ.2463 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాలకు రూ.919 కోట్లు ఖర్చుచేసి ఎనిమిదేండ్లలో తిరుగులేని సంక్షేమాన్ని అందించారు.
జెట్స్పీడ్తో దూసుకుపోతున్న తెలంగాణ ప్రగతి
గడిచిన ఎనిమిదేండ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రగతిని పరిశీలిస్తే తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో అసాధారణ ప్రగతిని సాధించింది. ఐటీ రంగంలో, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు, తెలంగాణలో నూతన చట్టాల రూపకల్పన, సాగునీటి శాఖ పునర్వ్యవస్థీకరణ, సమగ్ర భూ సర్వే, ధరణి పోర్టల్, భూ పరిపాలనలో సంస్కరణలు ఇలా.. అన్నిరంగాల్లో అభివృ ద్ధి దిశగా తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
వీటితో పాటు మరెన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్న కేసీఆర్ ఇటీవల టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి, దేశంలోని ప్రజలందరికీ తెలంగాణ మోడల్‌ను అందించేందుకు సిద్ధమయ్యారు. అందుకే దేశవ్యాప్తంగా కేసీఆర్.. కేసీఆర్.. అన్న పేరు లక్షలాదిమంది నాలుకలపై నాట్యమాడుతున్నది. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అందించి దేశం గర్వించే నాయకునిగా కేసీఆర్ ఎదగాలని ఆశిద్దాం. దేశంలో బీఆర్ఎస్ పెరుగుదలకు బాటలు వేద్దాం.. జై తెలంగాణ, జై భారత్, జై కేసీఆర్…
(వ్యాసకర్త: రాజ్యసభ సభ్యులు)
వద్దిరాజు రవిచంద్ర