ఆదర్శాలు కలిగి ఉండటం, విలువలకు కట్టుబడి నడుచుకోవటం, ప్రజా సేవ చేయడమే మా లక్ష్యం అని కొంత మంది చెప్తుంటారు. అంతిమంగా సమసమాజ సాకారమే మా స్వప్నం అని కూడా అంటుంటారు. కానీ ఆచరణకు వచ్చేటప్పటికి అవేవీ పట్టించుకోరు. ఇచ్చిన మాటను నిబద్ధ్ధతతో పాటించేవారు మాత్రం అతి తక్కువ మంది మాత్రమే కనిపిస్తారు. అలాంటి వారి కోవకు చెందుతుంది రుద్ర రచన.
ప్రభుత్వం, ఇతర వర్గాల నుంచి సహాయం పొందినవారు చాలామంది తాము ఉన్నత స్థాయికి చేరితే అది చేస్తాం, ఇది చేస్తామని గొప్ప గా చెప్తుంటారు. కానీ ఆచరణలో మా త్రం దాన్ని పాటించరు.
నీట్ వంటి ప్రవేశ ఫలితాలు వెలువడ్డ ప్రతిసారి భావి వైద్య విద్యార్థులందరూ తాము డాక్టర్లయి పేదలకు ఉచిత వైద్య సేవలందిస్తామని గొప్పగా చెప్పుకుంటా రు. కానీ ఆ తర్వాత ఉన్నత చదువులు, ఉద్యోగాలు అంటూ విదేశాలకు వెళ్లి అక్క డే స్థిరపడతారు. ఒకవేళ దేశంలో వైద్య సేవలందించినా మంచి జీతం వచ్చే కార్పొరేట్ దవాఖానల్లో పనిచేస్తారే తప్ప ప్రభు త్వ వైద్యులు కావాలని కోరుకోరు. కేవ లం వీరే కాదు సివిల్ సర్వీస్‌లో విజేతలైన వారు, ప్రభుత్వ సహకారంతో ఉన్న త చదువులు చదివి ఉద్యోగాలు పొందినవారు కూడా ఇలాగే ప్రవర్తిస్తుంటారు.
అయితే ఇందుకు భిన్నంగా చెప్పే ఆదర్శాలకు, చేసే పనులకు కట్టుబడి నడుచుకునే వారు లేకపోలేదు. తామనుకున్న లక్ష్యాల కోసం ముందుకుసాగుతూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా, ఆదర్శవంతంగాను నిలుస్తున్నవారు ఉన్నారు. ఈ కోవలోకే వస్తుంది జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాలకు చెందిన రుద్ర రచన.
రచన ఇటీవల తన నాలుగు నెలల జీతం నుంచి అక్షరాల లక్ష రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమక్షంలో ‘ముఖ్యమంత్రి సహాయ నిధి’కి అందజేసి తన పెద్ద మనసు చాటుకున్నది. రుద్ర రచన ఒక అనాథ. అందు కే తనలాంటి ఎందరో అనాథలను ఆదుకోవాలనే సదుద్దేశంతో ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేసిం ది. ఇలా చేయడానికి ఆమెను ప్రేరేపించి న అంశాలు తెలుసుకోవాలంటే ఒకసారి రుద్రరచన జీవిత నేపథ్యంలోకి వెళ్లాలి.
రచన చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. రచన చదువు కు కొంత అక్క ఆసరాగా నిలిచింది. ఆ తర్వాత ఉన్నత చదువులు సజావుగా సాగడానికి అనేక విషమ పరిస్థితులను అధిగమించాల్సి వచ్చింది. ఒక దశలో ఇంజినీరింగ్ కాలేజీ ఫీజులు, హాస్టల్ ఫీజులు చెల్లించలేని పరిస్థితి. ఆ సమయంలో కొంతమం ది దాతలు ఆర్థికంగా చేయూతనందించా రు. అయినా ఇంకా అవసరం ఏర్పడిన సమయంలో పలువురి సూచనతో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసింది. స్పం దించిన ఆయన ఆమె చదువుకయ్యే ఖర్చులన్నీ భరించారు. అలా ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆమె నాలుగు ప్రము ఖ కంపెనీల్లో ప్లేస్మెంట్స్ను సాధించడం గొప్ప విష యం. ఆ తర్వాత ఐటీ కంపెనీలో ఉన్న త ఉద్యోగాన్ని సంపాదించింది. ఉద్యోగం రాగానే తను నడిచివచ్చిన దారిని ఏ మాత్రం మరవలేదు రచన. తాను ఉద్యో గం ద్వారా సంపాదించిన దానిలో కొంతమొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయించుకున్నది. అనుకున్నదే తడవుగా కేటీఆర్ సూ చనతో సీఎం కేసీఆర్‌ను కలిసింది. తన నేపథ్యాన్ని చెప్తూనే తను చేయాలనుకున్న సాయాన్ని తెలిపింది. ఆమె మంచి మనస్సుకు కేసీఆర్ సైతం ముగ్ధులయ్యారు. ఆమె జీవిత లక్ష్యం నెరవేరేందుకు సాయం చేస్తానని మాటిచ్చారు. అంతిమంగా ఆమె అనాథల అభ్యున్నతి కోసం కృషిచేయాలని దృఢ సంకల్పంతో ముందుకుసాగడం నిజంగా అభినందించదగిన విషయం. నిత్యం పేదరికాన్ని అనుభవించి, అనేక జీవన సంఘర్షణలను చవిచూడటం మూలంగా రుద్ర రచన తన సామాజిక బాధ్యతను మరిచిపోలేదు.
అందులో భాగంగానే లక్ష రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అం దించింది. రచన తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తున్నది. ‘సమాజంలో ఆదరణకు నోచుకోని అనా థ పిల్లలు ఎంతో మంది ఉన్నారు. వారి లో కొందరికైనా సాయం చేసి ఆదుకోవా లనేది నా ఆశయం, ఆ దిశగా ముందుకు సాగుతాను’ అని ఆమె పేర్కొనడం ఆమెలోని సేవానిరతిని తెలియజేస్తున్నది. ‘ప్రజా సేవే’ లక్ష్యంగా సివిల్ సర్వీస్‌లో విజయం సాధించే దిశగా ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలించాల ని కోరుకుందాం. తద్వా రా ఆమె మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాలు చేయడానికి మార్గం సులువు కాగలదు. అంతిమంగా ‘రుద్ర రచన’ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుందాం.
జె.జె.సి.పి. బాబూరావు
94933 19690