బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆదివారం నాడు విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రముఖంగా కనిపించేది మానవాభివృద్ధికి పెద్దపీట వేయడం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధితో పాటు మానవాభివృద్ధి సమాంతరంగా జరగాలన్నది మొదటినుంచీ ఆయన ఫిలాసఫీ. ‘సంపదలు పెంచుదాం, ప్రజలకు పంచుదాం’ అన్న ఒక్క వాక్యంలోనే ఆ ఫిలాసఫీ వేద మంత్రం వలె ధ్వనిస్తుంది. గతంలో పలుమార్లు ప్రకటించిన ఈ విషయాన్నే ఆయన మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా పునరుద్ఘాటిస్తూ, పదేండ్ల పాలనలో తాము అమలుచేస్తున్న విధానాలే ఇందుకు నిదర్శనమని చెప్పటం గమనించదగ్గది.
ఒక ఉదాహరణ చూడండి. గత వారమే విడుదలైన ప్రపంచ దేశాల ఆకలి సూచీ మోదీ పాలనలో భారతదేశపు ర్యాంకు 125 దేశాలలో 111వది. ఈ ర్యాంకు 2014లో 55. అనగా రెట్టింపు స్థాయికి పతనమైంది. ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచీలో 190 దేశాలలో ఇండియా ర్యాంకు 130కి పైగానే. గత 20 ఏండ్లుగా ఇదే పరిస్థితి. మరొకవైపు రైతులు కష్టించి పండించే ధాన్యానికి కొరత లేదు. నానాటికి శతకోటి కోటీశ్వరులవుతున్నవారికి కొరత లేదు. ధనవంతులకు లక్షల కోట్ల రుణాల మాఫీకి సమస్య లేదు. దేశ జీడీపీ ప్రపంచంలో ఐదవ స్థానానికి పెరిగిందంటారు. పేదరికానికి సంబంధించిన అన్ని ర్యాంకుల్లో మాత్రం నిన్న కాంగ్రెస్ పాలించినా, నేడు బీజేపీ పాలిస్తున్నా దేశానిది అధ్వాన్న స్థితే.
కేసీఆర్ పదే పదే ఎత్తిచూపుతున్నది ఈ దౌర్భాగ్య పరిస్థితినే. ఉద్యమకాలం నాటికే తన కు కలిగిన ఈ అవగాహన ఒకవైపు, స్వయంగా తన తెలంగాణ ఆర్థిక, సామాజిక స్థితిగతుల వెనుకబాటుతనం ప్రభావం మరొక వైపు కలగలిసి ఆయనలో ఈ ఫిలాసఫీని రూపుదిద్దాయి. అందువల్లనే ఈ పదేండ్లుగా, ఎక్కడా వీసమెత్తు తేడా లేకుండా, కేసీఆర్ మ్యానిఫెస్టోలు, బడ్జెట్లు, విధానాలు, పరిపాలనా చర్యలు సమస్తం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, సంక్షేమ రూపంలో మానవాభివృద్ధికి సమానమైన ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాయి. అందుకే ఈ రోజున, కేవలం పదేండ్లు ఇంకా పూర్తికాకుండానే, ఒకప్పటి తెలంగాణ ఇప్పుడెట్లా ఉన్నదనే మాట ఇక్కడి ప్రజల్లోనే కాదు, దేశమంతటా అబ్బురంగా వినవస్తున్నది. చివరికి తెలంగాణ నుంచి విడిపోయిన పక్క రాష్ట్రంవారు సైతం, 170 ఏండ్ల కిందటే కృష్ణా, గోదావరి ఆనకట్టలు కట్టుకొని వర్ధిల్లినవారు, అక్కడి సంపన్నులు, సామాన్యులు కూడా, ఈ రోజున, తమకు తెలంగాణ వంటి నాయకత్వం ఉంటే ఎంత బాగుండేదని విస్తృతంగా వ్యాఖ్యానిస్తున్నారు.
దీనికంతటికీ మూలమంత్రం ‘సంపదలు పెంచటం, వాటిని ప్రజలకు పంచటమనే’ కేసీఆర్ ఫిలాసఫీ. ఆదివారం నాటి మ్యానిఫెస్టోలో ప్రకటించిన అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీ మానవాభివృద్ధిని ఏ విధంగా సంకల్పిస్తుందనేది తేటతెల్లమవుతుంది. ముఖ్యంగా తెలంగాణ వంటి ఒక వర్ధమాన సమాజంలో వ్యవసాయం సహా వివిధ వృత్తుల వారు, కుటుంబాలు, వ్యక్తులు, నిరాధారులైన బలహీనులు, వ్యవస్థ నిర్మాణంలోని లోపాల కారణంగా అణగారుతున్న సామాజిక వర్గాలూ, ఆర్థిక-సామాజిక కోణాలలో- వ్యక్తిగత స్థాయిలోనూ ముందుకుపోగలిగే అవకాశాలు లభించినప్పుడే మానవాభివృద్ధి సాధ్యమవుతుంది. వారికి ఆర్థికాభివృద్ధి ద్వారా ఒక పునాది ఏర్పడి, దాని ఆధారంగా తమ మానవాభివృద్ధికి అవకాశాలు లభిస్తాయి.
ఈ తొమ్మిదేండ్లలో కేసీఆర్ చేసింది, ఇప్పుడు మరొక మ్యానిఫెస్టో ద్వారా కొనసాగించబూనుతున్నది అదే. అన్నింటికన్న ముఖ్యంగా 93 లక్షల తెల్లరేషన్ కార్డు కుటుంబాలకు రైతుబీమా పద్ధతిలోనే రూ.5 లక్షల కేసీఆర్ బీమా, రైతుబంధు సహాయాన్ని రూ.16,000కు పెంచటం, బీపీఎల్ కుటుంబాల మహిళలకు కొత్తగా నెలకు రూ.3,000, ఆసరా పింఛన్లు, వికలాంగుల పింఛన్ల పెంపు, ఆరోగ్యరక్ష పరిమితి రూ.15 లక్షలకు హెచ్చింపు, మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు, అనాథ పిల్లల విధానం, అసైన్డ్ భూములపై ఆంక్షల ఎత్తివేత వంటివన్నీ మానవాభివృద్ధి చర్యలే. విషయాన్ని సరైన దృక్పథంతో అర్థం చేసుకోలేనివారు, దురుద్దేశాల వారు వీటిని జనాకర్షణ అని, పాప్యులిజం అని మాట్లాడవచ్చు. కొందరు సంక్షేమం అనవచ్చు. కానీ, సంక్షేమం అన్న మాట కూడా అసంపూర్ణమైన పదమే. సంక్షేమ రూపంలో ఉండే చర్యలు వాహికలు, లేదా సాధనాలు. వాటి లక్ష్యం మాత్రం మానవాభివృద్ధి. ఆ వర్గాల ప్రజలను కేవలం ఆకలి దప్పులు, ఇతర మౌలిక అవసరాల కొరతల్లేకుండా జీవింపజేయటం మాత్రమే కాదు. ఒరిజినల్‌గా బిస్మార్క్ తలపెట్టినట్టు ఆ వర్గాలలో అశాంతి తలెత్తకుండా జాగ్రత్తపడటమే కాదు. ఆ వర్గాలకు క్రమక్రమంగా తక్కిన సమాజ ప్రజల వలెనే సామాజికాభివృద్ధి అవకాశాలు లభించాలి. వారు జీవితంలో ఎదగాలి. అదే ఒక ధర్మ సమాజం అవుతుంది. అటువంటి పాలకుడే ధర్మపాలకుడవుతాడు. కేసీఆర్ ఇన్నేండ్ల ఆలోచనలను, మాటలను, చేతలను, వాటి ఫలితాలను, ప్రభావాలను సూక్ష్మంగా పరిశీలించినప్పుడు ఈ ధోరణులు స్పష్టంగా కనిపిస్తాయి.
ఆదివారం నాడు మ్యానిఫెస్టో ప్రకటించిన ముఖ్యమంత్రి, ఇంతకుముందటి మానవాభివృద్ధి కార్యక్రమాలు యథావిథిగా కొనసాగుతూనే ఈ కొత్తవి అమలుకు వస్తాయన్నారు. మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినవి అయినా అమలుచేయకపోవటం ఇతర పార్టీ ప్రభుత్వాల ఆనవాయితీ కాగా, తమ ప్రభుత్వం అట్లా చెప్పనివి సైతం కొల్లలుగా అమలుపరచటాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు. వాటిలో భారీ ఖర్చుతో కూడుకొని, లక్షలాదిమంది గల విస్తృతమైన వర్గాల జీవితాలనే మార్చివేస్తున్న రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బీసీ బంధు, కొత్తగా స్కూలు పిల్లలకు ప్రవేశపెట్టిన బ్రేక్‌ఫాస్ట్ పథకం వంటివి ఉన్నాయి. ఈ విధంగా పాతవి, కొత్తవి అన్నీకలసి తెలంగాణ రాష్ర్టాన్ని, కేసీఆర్ పాలనలో, మరొక ఐదేండ్లు గడిచేసరికి మానవాభివృద్ధిలోని అన్ని అంశాల్లో మొత్తం దేశంలోనే అగ్రగామిగా నిలిపితే ఆశ్చర్యపడనక్కరలేదు.
తలసరి ఆదాయం, విద్యుత్తు వాడకం, ధాన్యం దిగుబడి తదితర ఆర్థికాభివృద్ధి అంశాలతో పాటు, మంచినీరు, పచ్చదనం, హరిత గ్రామాల వంటి సామాజికాభివృద్ధి, మానవాభివృద్ధి అంశాల్లోనూ ఇప్పటికే అగ్రస్థానాలకు చేరిన తెలంగాణ, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం వంటి పలు ఇతరరంగాలలో కూడా వేగంగా ముందుకు పోతున్నది.
విశేషమేమంటే, దేశం స్వతంత్రం కాకముందు బ్రిటిష్ వలస పాలనాకాలం నుంచి కూడా కేరళ, తమిళనాడు, కర్ణాటక రాజ్యాలు విద్య, వైద్యం, సంక్షేమం, సంస్కరణలు, సామరస్యతల వంటి రంగాల్లో తక్కిన భారతదేశం కన్న ముందడుగులో ఉన్నాయి. సమస్యలు లేవనికాదు. కానీ, అనేక విధాలుగా మెరుగుగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మూడు రాష్ర్టాలలో లేని అనేక గొప్ప పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. సంతోషించదగినదేమంటే, వందల ఏండ్ల ఫ్యూడల్ నేపథ్యం, దశాబ్దాల అంతర్గత పాలన నుంచి బయటపడి ఇంకా పదేండ్లయినా పూర్తికాని తెలంగాణ ఈ తీరున ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధి సాధిస్తున్నదంటే, అది అద్భుతానికి తక్కువ కాదని అనదగిన అద్భుతమే.
టంకశాల అశోక్