స్వరాష్ట్రం కోసం కేసీఆర్ నాయకత్వంలో పిడికెడు మందితో జలదృశ్యం నుంచి ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్థానం, ఇవాళ దేశంలో ప్రభంజనం సృష్టించడానికి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. కరీంనగర్ సింహగర్జన నుంచి వరంగల్ మహాగర్జన వరకు అనేక విజయాలు సాధించారు కేసీఆర్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ క్రమంలో చూసిన ప్రతి సమస్యకు ఇవాళ పరిష్కారం చూపారనడంలో అతిశయోక్తి లేదు.
నెర్రెలు బారిన నేలకు నీళ్లను అందించడం కోసం కాళేశ్వరమనే విశ్వఖ్యాతి గడించిన ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ భూములను పచ్చని పైర్లతో సస్యశ్యామలం చేశారు కేసీఆర్. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటిని పంపిణీ చేసి ఆడబిడ్డల తాగునీళ్ల కష్టాలకు స్వస్తి చెప్పారు. తద్వారా తెలంగాణ ప్రజల సాగు, తాగునీటి కష్టాలు తీర్చిన నేతగా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయా రు. ఇక వృద్ధులకు అండగా ఉండాలనే ఆలోచనతో ఆసరా పింఛను అందించడమేగాక, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతకార్మికులు, గీతకార్మికులు, బోదకాలు, క్యాన్సర్, డయాలసిస్, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులతోపాటు బీడీ కార్మికులకు కూడా పింఛన్లను అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలని కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని తీసుకువచ్చి వారి హృదయాల్లో సీఎం కేసీఆర్ చెరగని ముద్ర వేసుకున్నారు. బిడ్డకు జన్మనిచ్చిన మాతృమూర్తికి పౌష్టికాహారం అందించాలనే తపనతో కేసీఆర్ కిట్ అందిస్తున్న మహిళా పక్షపాతి సీఎం కేసీఆర్. వ్యవసాయం, వైద్యం, విద్య, సాగునీటి, సంక్షేమ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి తెలంగాణను దేశానికి దిక్సూచిలా నిలిపారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నప్పటికీ దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. వారి ప్రాథమిక హక్కుల సాధన కోసం ఇంకా ఉద్యమాలు కొనసాగడం బాధాకరం. రైతుల బతుకులు మారాలని, అన్నదాతలు సుభిక్షంగా ఉంటేనే దేశం అభివృద్ధివైపు పరుగులు పెడుతుందని గ్రహించిన నాయకుడు సీఎం కేసీఆర్. ఉద్యమ సమయంలో వారి కష్టా లు, కన్నీళ్లను చూసి, స్వయంపాలనలో వాటి పరిష్కారం కోసం అనేక పథకాలను అమలుచేస్తున్నారు. సమృద్ధిగా పంట పండించాలంటే రైతుకు ప్రభుత్వాలు బాసటగా ఉండాలని భావించారు. రైతుగా గుర్తించాలంటే ఆ రైతుకు భూమి ఉండా లి. అందుకోసం ముందుగా భూరికార్డుల ప్రక్షాళన చేపట్టి ఆ తర్వాత ధరణి పోర్టల్ ద్వారా కొత్త పాస్‌బుక్‌లను ఇచ్చారు. రైతు వ్యవసాయం చేయాలంటే నీరు, కరెంటు అవసరం. 24 గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వడంతోపాటు, కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల ద్వారా సమృద్ధిగా నీరందిస్తున్నారు. కోటి ఎకరాల మాగాణికి నీరిస్తామని చెప్పిన కేసీఆర్ ఇవాళ తెలంగాణలో కోటిన్నర ఎకరాలకు సాగునీరందిస్తున్నారు. భూమి, నీరు, కరెంటు అందుబాటులో ఉన్నా రైతుకు కావాల్సింది పెట్టుబడి సాయం. రైతుబంధు పథ కం ద్వారా ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలను రైతు ఖాతాలో జమ చేస్తున్నారు. పండించిన పంటను కూడా ప్రభుత్వమే ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నది. రైతు ఏ కారణం వల్ల మరణించినా ఆ కుటుంబం ఛిన్నాభిన్నం కావొద్దని, ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతు బీమా పథకాన్ని తీసుకు వచ్చిన తొలి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇవన్నీ భారతదేశంలో అమలు కావాలన్నది కేసీఆర్ కోరిక . అందుకే రైతు పక్షపాతిగా ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అంటూ దేశం కోసం బయలు
దేరారు కేసీఆర్.
విద్యాభివృద్ధి కోసం మహాత్మా జ్యోతిబాపూలే, డా.బీ ఆర్ అంబేద్కర్ల స్ఫూర్తితో రాష్ట్రంలో గురుకులాలను ఏర్పాటు చేశారు. ఆ గురుకులాల్లో పాఠశాల విద్య మొదలుకొని గ్రాడ్యుయేట్ విద్య వరకు ఉచితంగా అందిస్తున్నారు. విదేశాల్లో చదివే విద్యార్థుల కోసం ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల ను కూడా ప్రభుత్వం అందిస్తున్నది. ప్రజలకు కావాల్సిన వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలదని గ్రహించిన సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ దవాఖానల అభివృద్ధితోపాటు జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి వైద్య విద్యను ప్రోత్సహిస్తున్నారు. బస్తీ దవాఖాన, పల్లె దవాఖానల పేరుతో దవాఖానలు ఏర్పాటు చేసి ప్రజలకు విలువైన, నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నారు.
ప్రతి ప్రభుత్వ భవిష్యత్ సంక్షేమ రంగం పైననే ఆధారపడి ఉంటుంది. తెలంగాణలోని సబ్బండ వర్గాల సంక్షేమం కోసం కేసీఆర్ బహుళ పథకాలను రూపొందించి అమలుచేస్తున్నారు. వారి సంక్షేమం కోసం డబుల్ బెడ్రూం ఇండ్లు, యాదవులు, కురుమలకు గొర్రెల పంపిణీ, ముదిరాజ్, బెస్తలకు చేప పిల్లల పంపిణీ, ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్, కల్లుగీతకార్మికులకు ఎక్సైజ్ సుంకం ఎత్తివేత, రజక, నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ వంటి జనరంజక పథకాలకు తెలంగాణ కేంద్ర బిందువుగా నిలుస్తున్నది.
తెలంగాణలో మత సామరస్యాన్ని, పరమత సహనాన్ని గొప్పగా పాటిస్తున్నారు కేసీఆర్. రంజాన్, క్రిస్మస్ సందర్భంగా ముస్లిం, క్రైస్తవ సోదరీ సోదరులకు ప్రభుత్వం భారీఎత్తున విందును ఏర్పాటు చేయటమేగాక బట్టలు పంపి ణీ చేస్తున్నారు. బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తున్నారు. తెలంగాణలో మహాపుణ్యక్షేత్రంగా వెలిసిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పునఃనిర్మించి చరిత్రలో నిలిచిపోయారు.
ఇక ప్రధానంగా, సమాజంలో అభివృద్ధికి దూరంగా ఉన్న దళితుల బతుకుల్లో వెలుగు నింపాలనే లక్ష్యంతో మహోన్నత పథకం ‘దళిత బంధు’ ను కేసీఆర్ రూపొందించి అమలు చేస్తున్నారు. ఇలాం టి పథకాన్ని గతంలో ఏ నాయకుడు అమలు చేయలే దు. ఇట్ల అనేక సంక్షేమ పథకాలతో బీఆర్ఎస్ పాలన దేశానికే ఒక దిక్సూచిలా నిలుస్తున్నది. ఈ తరుణంలో ఇలా ంటి పథకాలన్నీ ఒక తెలంగాణ రాష్ర్టానికే పరిమితం కాకుండా యావత్ దేశ ప్రజలకు అందాలని ఆ దిశగా బీఆర్ఎస్ జైత్రయాత్రకు కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఈ దేశ వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమ రంగాలను ఛిన్నాభిన్నం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరం. దేశం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ విజన్ దేశమంతా అమలు కావాలి. ప్రజల ఆకాంక్షల సాధన కోసం బీఆర్ఎస్ పేరుతో మహోన్నత పోరాటానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. దైవబలం, బుద్ధిబలం, సంకల్పబలం అంతకుమించి అన్నింటికంటే ముఖ్యమైన అఖండ ప్రజాబలం కేసీఆర్ సొంతం. ఆ బలంతో బీఆర్ఎస్గా కేసీఆర్ దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ఖాయం. తెలంగాణ పథకాలన్నీ దేశవ్యాప్తంగా అమలుకావాలంటే బీఆర్ఎస్ విజయం సాధించాల్సిందే.
కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ పారిశ్రామిక రంగం ఊహించనిరీతిలో అభివృద్ధి చెందుతున్నది. ప్రపంచంలో ఉన్న పెద్దపెద్ద కంపెనీల నుంచి విస్తృత పెట్టుబడులను తీసుకువస్తున్నా రు. టీహబ్ ద్వారా నూతన పారిశ్రామిక విప్లవానికి కేటీఆర్ నాంది పలికారనడంలో అతిశయోక్తి లేదు. కేసీఆర్ అడుగుజాడల్లో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కేటీఆర్ కృషి చేస్తున్నారు.
75 ఏండ్లలో గత ప్రభుత్వాలు చేసిన అప్పు కంటే మోదీ ప్రభుత్వం రెట్టింపు అప్పు చేసింది. దేశ సంపదను ఆదానీ, అంబానీలకు పంచి పెడు తూ దేశాన్ని అప్పులకుప్పగా మార్చింది. సాగు చట్టాల పేరుతో రైతులను అనేక ఇబ్బందులకు గురిచేసిన మోదీ పారిశ్రామికవేత్తలకు మాత్రం లక్షల కోట్ల అప్పులను మాఫీ చేశారు. మతం పేరుతో దేశ ప్రజల మధ్య చిచ్చుపెడుతూ పబ్బం గడపుకోవటం తప్ప మన దేశానికి నరేంద్రమోదీ చేసిందేం లేదు. ఈ నేపథ్యంలోనే, ప్రత్యామ్నాయాన్ని భారతదేశ ప్రజానీకం బలంగా కోరుకుంటున్నది.
బీఆర్ఎస్కు అవకాశమిస్తే దేశమంతా తెలంగాణ పథకాలను అమలు చేస్తామని కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. ఆ లక్ష్యసాధన కోసమే గొప్ప సాహసంతో ముందుకు సాగుతున్నారు. ఆ దిశగా మనం కూడ ఆయన వెంట అడుగులు వేద్దాం.
(వ్యాసకర్త: శాసనసభ్యులు తుంగతుర్తి)
-డాక్టర్ గాదరి కిశోర్ కుమార్