ఉద్యమాల గడ్డ తెలంగాణ ఏడు దశాబ్దాల క్రితం వేసిన ఆత్మగౌరవ పొలికేక 2014లో వాస్తవరూపం దాల్చింది. నాలుగు కోట్ల ప్రజల సుదీర్ఘ స్వప్నం సాకారమైంది. ఉద్యమంలో వేలు, లక్షలుగా ప్రజలు పాల్గొన్నా ఆ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన చుక్కాని ఒక్కరే. ఆయనే ప్రజా నాయకుడు. ఉద్యమ నేత కేసీఆర్. ఆయన అడుగుపెడితే చాలు హుస్నాబాద్… సిద్దిపేట ..సిరిసిల్ల… వనపర్తి… అచ్చంపేట… మునుగోడు జిల్లాలు, నియోజక వర్గాలేవైనా నేల ఈనిందా అన్నట్టు లక్షలాది మంది గుమికూడాల్సిందే.
సీఎం కేసీఆర్ ఒక సమావేశంలో పాల్గొంటున్నారంటే చాలు అక్కడ హాజరైన ప్రజలు ఆయన చెప్పే మాటలు బడిపిల్లల్లా శ్రద్ధగా వింటారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నా ఇసుమంతయినా చరిష్మా తగ్గని మేరు నగధీరుడు కేసీఆర్. 2009 నవంబర్ 29న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష పూనిన రోజు. ఆరోజు తెలంగాణ సమాజమంతా కేసీఆర్ దీక్షకు మద్దతుగా రోడ్లపైకి వచ్చి వివిధ రూపాల్లో ఆయనకు మద్దతు తెలియజేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కేసీఆర్ వెంటే ఉంటామని శపథాలు చేసి ఉద్యమంలో పాల్గొన్నది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని టీఆర్ఎస్ అధ్యక్ష స్థానంలోఉన్న కేసీఆర్ ను దీవించి గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు తెలంగాణ ప్రజలు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి సంక్షేమంలో దేశంలోనే అన్ని రాష్ర్టాల కంటే ముందు వరుసలో నిలిపారు. అది చూసిన తెలంగాణ సమాజం 2018లో కేసీఆర్‌కు మరోసారి పెద్ద ఎత్తున మద్దతు తెలియజేసి రెండవ సారి ముఖ్యమంత్రిని చేశారు.
ఈసారి మరింత బాధ్యతతో రాజకీయాలను పూర్తిగా పక్కనబెట్టి కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాలలో భారతదేశంలోనే నెంబర్ వన్ స్థితిలోకి తెచ్చారు. ఇది ఎంతమాత్రం అతిశయోక్తి కాదు గణాంకాలు ఇస్తున్న వివరణ ఇది. ఒకనాడు ఆత్మహత్యలతో కునారిల్లిన తెలంగాణ గడ్డ, నాడు బాధలు పడ్డ తెలంగాణ, గాయపడ్డ తెలంగాణ, అన్యాయానికి, పీడనకు, దోపిడీకి, హేళనకు గురైన తెలంగాణను నేడు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతికే విధంగా అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ముందుకు పోయే విధంగా సుపరిపాలన సాగిస్తున్నారు కేసీఆర్.
2023లో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి చేయడానికి తెలంగాణ సమాజం అదే ఉత్సాహంతో, అంతే ప్రేమ, ఆప్యాయతలతో గౌరవ మర్యాదలతో ఆశీర్వదిస్తున్నది. ఎన్నికల సభల్లో భాగంగా హుస్నాబాద్‌లో జరిగిన మొదటి బహిరంగ సభకు వచ్చిన ప్రజల్లో, టీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన అంతే వాత్సల్యం కనిపించింది. అదే ప్రేమ ఆప్యాయతలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సభల్లోనూ చూపిస్తున్నారు. దీంతో మూడోసారి బీఆర్ఎస్ గెలుపు, కేసీఆర్ హ్యాట్రిక్ విజయంతో ముఖ్యమంత్రి కావడం ఖాయమని తేలిపోయింది. అది తెలంగాణ మట్టి మనుషులకు, ఉద్యమ పితామహునికి మాత్ర మే అర్థమయ్యే బాష. కానీ సోషల్ మీడియాలో, ఆంధ్రా మీడియాలోనూ తప్పుడు ప్రచారాలు తప్పుడు సర్వేలతో నేటికీ సీమాంధ్ర చేతిలో ఉన్న మీడి యా చర్విత చర్వణంగా అవే గాలి వార్తలతో కేసీఆర్‌ను బలహీన పరచాలని చూస్తున్నది.
ఆ మీడియా ఇతర పార్టీల వాపును బలుపుగా ప్రచారం చేయడం, బీఆర్ఎస్ను ప్రజల్లో తక్కువ చేయాలని చూస్తున్న కుట్రలను ఎప్పటికీ తెలంగాణ సమాజం తిప్పి కొడుతూనే ఉండాలి. నేను 2018లో పార్టీ ఎలక్షన్ సెల్ మెంబర్‌గా పని చేశాను. ఎన్నికల ముందు రెండు నెలలు సీమాంధ్ర మీడియా, తెలంగాణ వ్యతిరేక శక్తులు తప్పుడు రిపోర్టులతో సోషల్ మీడియా ద్వారా ప్రజలను గాలి గాలి చేయటం చూశాను.
పార్టీ ప్రతినిధిగా ఎన్నో టీవీ చర్చలకు వెళ్లాను. ఆయా సందర్భాల్లో చర్చకు పిలిచిన ఆంధ్ర ఛానళ్లు, ‘ప్రత్యేక సర్వేలు చేయించాం. ఆ సర్వేల్లో ప్రజలు టీఆర్ఎస్, కేసీఆర్‌లకు వ్యతిరేకంగా ఉన్నార’ని తప్పుడు రిపోర్టులు చూపించేవారు. మీరు అధికారం కోల్పోతున్నారని మనల్ని బలహీనపరచాలని చూసేవారు. కానీ మన నాయకుడిచ్చిన నమ్మకంతో అనేక టీవీ డిబేట్స్‌లో ఢీ అంటే ఢీ అని చర్చల్లో పాల్గొనే వాళ్లం. రిజల్ట్ వచ్చిన తర్వాత 63 నుంచి 88 సీట్లకు పెరిగాం.
ఇప్పుడు కూడా వీళ్లు చేసే ప్రచారాలు అలాంటివే వీటిని ఏమాత్రం కూడా లెక్క చెయాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు మన నాయకుడిని జాతీయనాయకుడిగా, బీఆర్ఎస్ను జాతీయ పార్టీ స్థాయికి తీసుకెళుతుందని మా ప్రగాఢ విశ్వాసం. తెలంగాణ సమాజానికి వాస్తవాలేమిటో తెలుసు. రాబోయే కాలంలో భారతదేశ రాజకీయ యవనికలో బీఆర్ఎస్ సాధించే విజయం ఒక మైలురాయిగా మిగిలిపోతుంది. సీఎం కేసీఆర్ పాల్గొంటున్న ప్రతీ సమావేశం పార్టీ శ్రేణులను ఉత్తేజితులుగా మార్చేస్తున్నాయి. 2018 నాటి విజయాన్ని మించిన విజయం 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ స్వంతమవుతుంది. మూడోసారి కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గద్దెనెక్కడం ఖాయం. ఈవిధంగా దక్షిణ భారతంలో కేసీఆర్ చరిత్ర సృష్టించనున్నారు.
(వ్యాసకర్త : రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు)
– సీ హెచ్ ఉపేంద్ర 99632 02547