హైదరాబాద్ ఫ్రెండ్స్ ఆర్టిస్ట్ గ్రూప్ నుంచి రాలిపోయిన మరో చిత్రకళా నక్షత్రం కవితా దేవుస్కర్. మా ఆర్టిస్టు గ్రూపులోని గొప్ప కళాకారిణి. చిత్రకారుల ఇంట్లో జన్మించడం ఒక వరమనే చెప్పాలి. ఆ వరాన్ని అందిపుచ్చుకొని జాతీయ చిత్రకారిణిగా పరిణతి చెంది దేశ, విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన కళాకారిణి కవితా దేవుస్కర్. ఆమె తాతగారు రామకృష్ణ వామన్ దేవుస్కర్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన సాలార్జంగ్ మ్యూజియం వ్యవస్థాపకులు. సాలార్జంగ్తో కలిసి అనేక దేశాల్లోని ప్రముఖ శిల్పాలను, చిత్రాలను మ్యూజియం కోసం సేకరించిన నిపుణులు. తండ్రి సుకుమార్ దేవుస్కర్ కూడా గొప్ప కళాకారుడు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతిలో చిత్రకళాభ్యాసం చేసి హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ప్రిన్సిపాల్‌గా ఆయన సేవలందించారు. కవితా దేవుస్కర్ కూడా తాత, తండ్రి కళా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చదివి, అక్కడే ఉపాధ్యాయ వృత్తిలో సేవలందించి చాలామంది యువ కళాకారులకు స్ఫూర్తినిచ్చారు.
రంగుల్లోని వైవిధ్యాలను నైపుణ్యంతో అందిపుచ్చుకొని తనదైన శైలిలో శ్రమజీవులు, సాధారణ, మధ్యతరగతి, పురాణ గాథల వ్యక్తులకు సంబంధించిన చిత్రాలకు దేవుస్కర్ ప్రాణం పోశారు. 1970లో కళాభవన్‌లో ప్రారంభమైన ఆమె కళాయాత్ర అనేక దేశాల్లో చిత్రకళా ప్రదర్శనలతో ప్రశంసలందుకున్నారు.
జవహర్లాల్ నెహ్రూ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ హెచ్వోడీగా, ప్రొఫెసర్‌గా చాలామంది చిత్రకళాభ్యాస విద్యార్థులను తీర్చిదిద్ది సమాజానికి అందించారు. బోధనారంగంలో దేవుస్కర్ చేసిన సేవలు చిరస్మరణీయం. చిత్రకళలో ఆమె చిత్రించని అంశం లేదు. స్టిల్ లైఫ్, పోర్ట్రెయిట్, ల్యాండ్ స్కేప్, శ్రామిక మహిళలు, మ్యూరల్స్ ఇలా తనదైన శైలిలో వివిధ మాధ్యమాల్లో ప్రయోగాలు చేసి గుర్తింపు పొందారు కవిత. ఆమె వద్ద శిష్యరికం చేసే అదృష్టం నాకు దక్కింది. తదనంతరం 21 ఆర్టిస్టు గ్రూపులలో ఆమెతో కలిసి అనేక గ్రూప్ ఎగ్జిబిషన్లు చేసి మంచి మిత్రులమయ్యాం. అనేక ప్రొఫెషనల్ టెక్నిక్స్, ముఖ్యంగా తన నుంచి కంపోజిషన్స్ ఎంతో అద్భుతంగా నేర్చుకున్నాను. తాజ్ గౌరవ పురస్కారాన్ని పొందిన మా ప్రొఫెసర్, మంచి మిత్రురాలు, గొప్ప కళాకారిణి ఇకలేరు. ఆమెకు ఇదే మా బాష్పాంజలి.
సురభి వాణిదేవి
(వ్యాసకర్త: శాసనమండలి సభ్యురాలు)