ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) ఇంటర్వ్యూ ఒకటి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నది. ‘యాదగిరిగుట్టను (Yadagiri Gutta) నేనే కట్టాను. భద్రాచలం, కీసర, బాసర.. ఇలా తెలంగాణలోని ఆలయాలన్నింటినీ నేనే కట్టాను’ అని చంద్రబాబు ధైర్యంగా చెప్తుంటే ఇంటర్వ్యూ చేస్తున్న ఆయన తన్మయత్వంతో వింటున్నారు. అయితే, 1987లో సంగారెడ్డిలో నేను జర్నలిస్ట్‌గా చేరినప్పుడు నారాయణఖేడ్‌లో తొలిసారి చంద్రబాబును చూశాను. అప్పటినుంచీ నాకు ఆయన తెలుసు. యాదగిరిగుట్ట ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా రిపోర్టర్‌గా కూడా నేను సేవలందించా. 1995 నుంచి రాష్ట్ర విభజన వరకు తెలుగుదేశం రిపోర్టర్‌ను నేనే. యాదగిరి గుట్టకు చంద్రబాబు వెళ్లలేదని కూడా నాకు తెలుసు. అసలు యాదగిరిగుట్టకే వెళ్లని చంద్రబాబు ‘యాదగిరిగుట్టను నేనే కట్టాను’ అని చెప్పడం విస్మయం కలిగిస్తున్నది. కొంత కాలం గడిచిన తర్వాత యాదగిరిగుట్టను చంద్రబాబు నిర్మించారని చెప్పడానికి ఇదే చారిత్రాత్మక సాక్ష్యమంటూ వాళ్లు ఈ వీడియోను చూపించినా ఆశ్చర్యపోనవసరం లేదు.
టీడీపీ ప్రభుత్వంలో దేవేందర్ గౌడ్ ‘నంబర్ టు’గా వెలిగిపోయారు. ఆ రోజుల్లో ప్రత్యేకంగా దృష్టిపెట్టి తమ ప్రాంతానికి చెందిన కీసరను ఆయన అభివృద్ధి చేశారు. ఇది మినహాయిస్తే ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు తెలంగాణలోని ఆలయాలను పట్టించుకోలేదు. కాగా, ‘యాదగిరిగుట్ట నేనే కట్టాను. భద్రాచలం కూడా నేనే..’ అంటూ బాబు చెప్తున్నప్పుడు ఆయనలో కనిపించిన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూడాలి. చెప్పేది అబద్ధమైనా ఆ ధైర్యం మాత్రం అద్భుతం. ఆ ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఎంత ప్రయత్నించినా యాదగిరిగుట్టను చంద్రబాబు సందర్శించినట్టు నాకు గుర్తుకురావడం లేదు. అన్నీ గుర్తుండాలని లేదు కదా! అందుకే నిర్ధారించుకోవడానికి గ్రోక్‌ను అడిగితే, ఒక్కసారి కూడా రాలేదని చెప్పింది. పోనీ, గ్రోక్‌కు మాత్రం అన్నీ తెలవాలనేముంది? అని సందేహం కలిగి చాట్ జీపీటీని అడిగితే.. ‘గుట్టకు రాలేదు కానీ, 2020లో హైదరాబాద్‌కు వస్తుండగా ఆ ప్రాంతంలో చంద్రబాబు కాన్వాయ్‌కు ప్రమాదం జరిగిందని చెప్పింది.
ఈ సమాచారాన్ని నిర్ధారించుకోవడానికి యాదగిరిగుట్టలో రిపోర్టర్ రాగి సహదేవ్‌కు ఫోన్ చేశా. ఆయన నాకు 35 ఏండ్ల నుంచి తెలుసు.. ‘యాదగిరి గుట్టకు బాబు ఒక్క సారన్నా వచ్చాడా’ అని అడిగితే ‘నేను 1980 నుంచి యాదగిరిగుట్ట ఆంధ్రభూమి రిపోర్టర్‌గా చేస్తున్నాను. 45 ఏండ్ల నుంచి రిపోర్టర్‌ను. భూమి లేదు ఇప్పుడు మరో పత్రికలో ఉన్నాను. పుట్టిందిక్కడే. ఒక్కసారి కూడా బాబు యాదగిరిగుట్టకు రాలేదు. 82లో టీడీపీ పుడితే 80 నుంచి నేను యాదగిరిగుట్ట రిపోర్టర్‌ను అని చెప్పుకొచ్చాడు. తన జీవితకాలంలో ఒక్కసారి కూడా యాదగిరిగుట్టకు వెళ్లని బాబు అంత ధైర్యంగా ‘యాదగిరిగుట్టను నేనే కట్టాను’ అని చెప్పడం.. ఇంటర్వ్యూ చేస్తున్న అతని తన్మయత్వం చూసి తరించాలి.
ఉమ్మడి రాష్ట్రం సీఎంగా బాబు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు కదా? యాదగిరిగుట్టకు ఎందుకు వెళ్లలేదు అని ఆశ్చర్యం వేసింది. యాదగిరిగుట్టలోని స్థానికులు,అధికారుల నుంచి సమాచారం సేకరిస్తే.. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు యాదగిరిగుట్ట జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో టీడీపీ మీటింగ్ జరిగితే బాబు ఆ మీటింగ్‌కు వెళ్లారు. కానీ, గుట్టపైకి వెళ్లలేదు.
అవినీతి, అక్రమాలకు పాల్పడినవారు గుట్టపైకి స్వామి దర్శనానికి వస్తే స్వామి ఆగ్రహానికి గురికావలసి వస్తుందని ఇక్కడ ఓ నమ్మకం ఉన్నది. ఈ నమ్మకం వల్ల సీఎంలు స్వామికి దూరంగానే ఉన్నారు. బాబు కన్నా ముందు కూడా సీఎంలు గుట్టకు వెళ్లేవారు కాదు. 1983లో ఎన్టీఆర్ సీఎం అయ్యాక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరై స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎంగా కేసీఆర్ యాదగిరిగుట్టకు వచ్చి గుట్ట రూపురేఖలు మార్చారు. ధైర్యంగా యాదగిరిగుట్ట పునర్నిర్మాణం చేపట్టారు. చరిత్రలో తొలిసారిగా యాదగిరిగుట్ట కోసం ఏకంగా బడ్జెట్లోనే వంద కోట్లు కేసీఆర్ కేటాయించారు.
తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో యాదగిరిగుట్టకు వెళ్తే అక్కడి అపరిశుభ్రతను చూసి బాధ వేసింది. ఆ తర్వాత ఊహించనివిధంగా యాదగిరిగుట్టను కేసీఆర్ అభివృద్ధి చేశారు. మొత్తం రూ.2 వేల కోట్లతో యాదగిరిగుట్ట అభివృద్ధి చేయాలనేది ప్రణాళిక. ఈ ప్రణాళికను కొంతవరకు అమలుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పట్టించుకొనేవాళ్లు లేరు. కిషన్‌రావు నేతృత్వంలో ప్రణాళిక అమలు జరుగుతుంటే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కిషన్‌రావును తొలగించడం మినహా యాదగిరిగుట్టను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. యాదగిరి గుట్ట డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఇదే తరహాలో వేములవాడ, బాసర అభివృద్ధి కోసం డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటుచేసి కేసీఆర్ హయాంలో వందేసి కోట్ల రూపాయలు కేటాయించారు.
దాదాపు 1600 ఎకరాలు దేవాలయ పరిసరాల అభివృద్ధికి ప్రభుత్వపరంగా సేకరించారు. దేవాలయ నిర్మాణానికి వెయ్యి కోట్లకు పైగా ఖర్చుచేశారు. అంతేకాదు, రాష్ట్ర బడ్జెట్లో ప్రతి ఏటా రూ.100 కోట్లు యాదగిరిగుట్ట అభివృద్ధికి కేసీఆర్ కేటాయించారు. ప్రత్యేకంగా వైటీడీఏని ఏర్పాటుచేసి దానికి చైర్మన్‌గా కేసీఆర్ వ్యవహరించారు. ఆయన హయాంలోనే ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ ప్రతిపాదన మంజూరైంది. రాయగిరి రైల్వేస్టేషన్‌కు యాదాద్రి అనే నామకరణం అప్పుడే జరిగింది. తిరుపతి దేవస్థానం మాదిరిగా యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అటానమస్‌గా (స్వయం ప్రతిపత్తి) చేసే ప్రయ త్నం జరిగింది. నేడు దేవస్థానం ఈవోగా ఐఏఎస్ అధికారి నిర్వహణలో ఉన్నది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పేరుతో ప్రభుత్వపరంగా దూరదర్శన్ ద్వారా యాదగిరి ఛానల్ ప్రత్యేకంగా కేసీఆర్ కృషి వల్లే జరిగింది.
నాలుగు దశాబ్దాల కిందట స్థానిక విలేకరులం యాదగిరిగుట్ట రెండో తిరుపతి అని రాసేవాళ్లం. కానీ, తెలంగాణ ఏర్పడి కేసీఆర్ యాదగిరిగుట్టను పునర్నిర్మించిన తర్వాతే శని, ఆదివారాలు లక్ష మందికి పైగా భక్తులు వస్తే నిజంగా రెండవ తిరుపతిగా మారిందని నాలుగున్నర దశాబ్దాల నుంచి యాదగిరిగుట్ట విలేకరిగా ఉన్న రాగి సహదేవ్ తెలిపారు.
జీవితంలో ఒక్కసారి కూడా యాదగిరిగుట్టకు వెళ్లని, గుట్ట అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని బాబు ‘యాదగిరిగుట్టను నేనే’ అని నిస్సిగ్గుగా చెప్పడం చూస్తే.. మనకు ఆశ్చర్యం కలుగవచ్చు కానీ, వారికి ఇది మాములు విషయం. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా ప్రజల మెదళ్లలోకి ఎక్కించి అది నిజం అని నమ్మేట్టు చేయవచ్చు అని వారి నమ్మకం. వారి మీడియా సైతం ఈ అబద్ధాన్ని నిజం అని నమ్మిస్తుంది. అబద్ధాన్ని అంత ధీమాగా చెప్పే ఆ ధైర్యానికి ముచ్చటేస్తుంది.
-బుద్దా మురళి