ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా ‘పరీక్షా పే చర్చా’ పేరిట ఓ భారీ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఎంపిక చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దీనిలో పాల్గొంటుంటారు. పరీక్షల విషయంలో సందేహాలు తొలగించటం, భయాలు పోగొట్టటం ఈ వార్షిక తంతు లక్ష్యంగా చెప్పుకుంటారు. కానీ కేంద్రం పర్యవేక్షణలో జరిగే పరీక్షలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వివాదాలపాలై చర్చనీయాంశాలు అవుతుండటం విడ్డూరం. లీకేజీలు, పరీక్షల రద్దులతో ప్రభుత్వ నిర్వహణా సామర్థ్యం ప్రశ్నార్థకం అవుతుండటం గమనార్హం. ప్రతిష్ఠాత్మక పరీక్షల నిర్వహణ ఆషామాషీగా, లోపభూయిష్టంగా తయారుకావటం విద్యారంగం పట్ల పాలకుల చిత్తశుద్ధి లోపాన్ని ఎత్తిచూపుతున్నది. ఇటీవల ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షను రద్దు చేసి దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. ఆ వివాదం అలా నలుగుతుండగానే సీబీఎస్ఈ పరీక్షపై దుమారం చెలరేగింది. గతనెల సీబీఎస్ఈ ప్రకటించిన 12వ తరగతి ఫలితాలు 17 లక్షలకు పైగా విద్యార్థులను, వారి కుటుంబాలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. అయితే అందుకు లీకేజీయో మరొకటో కారణం కాదు. జాతీయ స్థాయిలో అట్టహాసంగా ప్రవేశపెట్టిన పరీక్ష పత్రాల ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) దిద్దుబడి వ్యవస్థ తప్పుల తడకగా ఉండటంతో మొత్తం పరీక్షా విధానమే వివాదాస్పదం అయ్యింది.
స్వాతంత్య్రానంతర కాలంలో స్కూలు పరీక్షలపై ఇంతపెద్ద వివాదం ఎన్నడూ తలెత్తలేదు. నీట్, సీబీఎస్ఈ పరీక్షల వివాదాలు ఏవో అడపాదడపా తలెత్తే చెదురుమదురు సమస్యల కిందకు రావు. అవి మన పరీక్షల వ్యవస్థ కుళ్లి కంపు కొడుతుందనటానికి తార్కాణాలుగా నిలుస్తాయి. ఆధునిక సాంకేతికతలో అంగలు వేస్తున్నామని టాంటాం వేసుకునే పాలక వర్గాలకు వ్యవస్థలను ప్రవేశపెట్టే విషయంలో తగిన శ్రద్ధ లేదని ఇవి సూచిస్తున్నాయి. నిజానికి వేగం, కచ్చితత్వం, పారదర్శకత కోసం ఓఎస్ఎం సిస్టం తెచ్చారు. సత్వరమే, సజావైన ఫలితాలు అది అందిస్తుందని అందరూ ఆశించారు. కానీ ఆచరణలో జరిగింది వేరే. తప్పుడు పత్రాలు రావటం, పేజీలు గల్లంతు కావటం, మబ్బుగా ఉన్న జవాబు పత్రాలనే టీచర్లు ఎడాపెడా దిద్దేయటం వంటి అవకతవకలు అందులో చోటుచేసుకున్నాయి. పైగా, ఈ దిద్దుబడి వ్యవస్థను హ్యాక్ చేయొచ్చని ఇద్దరు ఎథికల్ హ్యాకర్లు రుజువు చేయటంతో వివాదం మరింతగా ముదిరింది.
నిజానికి ఓఎస్ఎం ఇప్పటికిప్పుడు ముందుకొచ్చిన టెక్నాలజీ ఏమీ కాదు. 2014లోనే దీనిని తేవాలనుకున్నారు. కానీ ఇంకా సాంకేతికత పూర్తిగా అభివృద్ధి చెందలేదని పక్కనపెట్టారు. కేంద్రం ఇటీవల దీనిని మరోసారి తెరమీదకు తెచ్చినప్పుడు అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. పైలట్ కార్యక్రమంగా పరిమితంగా, దశలవారీగా పరీక్షించకుండా నేరుగా 40 కోట్ల పేజీలతో కూడిన 98,66,622 జవాబు షీట్లపై ఉన్నపళంగా ఓఎస్ఎం దిద్దుబడి జరిపించారు. ఇపుడు ఫలితాలు మన కండ్ల ముందరే ఉన్నాయి. మానవ తప్పిదాలను నివారించేందుకు తెచ్చిన వ్యవస్థ ఘోర తప్పిదాలమయంగా తయారుకావటం విచారకరం. విద్యార్థి కేంద్రంగా, అంతర్జాతీయ ఆమోదం పొందిన వ్యవస్థను ప్రవేశపెట్టామని, అయితే అందులో లోటుపాట్లు జరిగిన మాట వాస్తవమేనని సంబంధిత కేంద్ర మంత్రి అంగీకరించటం విడ్డూరం. సమస్యలు ఎదుర్కొనే విద్యార్థులు తగిన రీతిలో దరఖాస్తు చేసుకుని ఉపశమనం పొందవచ్చని ఆయన ఉచిత సలహా పారేశారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో పరీక్షా లోపాలు చెలగాటమాడుతున్న దృశ్యం మన కండ్లముందు ఆవిష్కృతమవుతున్నది. హార్డ్వేర్, సాఫ్ట్వేర్, మానవ తప్పిదం అన్నిటికీ మించి పరిపాలనా వైఫల్యం దీని వెనుక ఉందనేది తెలుస్తూనే ఉన్నది. ఈ సమస్యలకు పైపూత పరిష్కారాలు సరిపోవు. మొత్తంగా జాతీయ పరీక్షా వ్యవస్థను ప్రక్షాళన చేసి సంస్కరణలు తీసుకురావాల్సి ఉన్నది. రాజకీయ జోక్యం లేకుండా, వృత్తినిపుణుల ఆధ్వర్యంలో పనిచేసే నిర్వహణా వ్యవస్థలు రూపొందించటం తక్షణ అవసరమని చెప్పక తప్పదు.