తెలంగాణ సమాజం గత రెండు దశాబ్దాల్లో విభిన్న అనుభవాలను చవిచూచింది. తొలి దశాబ్దంలో కష్టాల కడలిలో ఈదగా.. మలి దశాబ్దంలో తెలంగాణ ప్రజల బతుకులు సమూలంగా మారాయి. కష్టాలకు ఎదురేగి తెలంగాణ సమాజం చేసిన ఉద్యమం మొదలుకొని స్వరాష్ట్రంలో ప్రగతి పరుగుల వరకు సాగిన ప్రయాణానికి భారత రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేక చరిత్ర ఉన్నది. ఈ మార్పునకు మూలం బీఆర్ఎస్ పార్టీయేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
2001 ఏప్రిల్ 27న పురుడుపోసుకున్న టీఆర్ఎస్ 25వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఇటీవల వరంగల్‌లోని ఎల్కతుర్తి వేదికగా రజతోత్సవ మహాసభ జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ 25 ఏండ్ల ప్రస్థానాన్ని విశ్వవ్యాప్తం చేయాలని పార్టీ సంకల్పించింది. అందులో భాగంగానే అమెరికాలోని డాలస్ నగరంలో జూన్ 1న రజతోత్సవ సభతోపాటు తెలంగాణ ఆవిర్భావ సంబురాలు జరగనున్నాయి. ఇది పార్టీ వేడుక మాత్రమే కాదు.. మలి దశ ఉద్యమానికి ఊపిరిపోసిన ప్రతి తెలంగాణ బిడ్డకు, ఉద్యమానికి, ప్రజాశక్తికి, గ్లోబల్ గుర్తింపునకు ప్రతీక.
2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ సమరశంఖం మోగించారు. కేసీఆర్ అవిరళ కృషి, ప్రజల్లో ఆయన కలిగించిన చైతన్యం, కేంద్రప్రభుత్వంపై చేసిన అలుపెరుగని పోరాటం ఫలితంగా 2014లో స్వరాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కేసీఆర్ పాత్ర ఎనలేనిది. వివిధ సభల్లో ఆయన చేసిన ప్రసంగాలు తెలంగాణ బిడ్డలను ఉర్రూతలూగించడమే కాకుండా.. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాలతో పాటు గల్ఫ్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసులను ఉద్యమం దిశగా నడిపించాయి. అమెరికాలోని డాలస్, న్యూజెర్సీ, షికాగో, వాషింగ్టన్ డీసీ న్యూయార్క్, కాలిఫోర్నియా లాంటి నగరాల్లోని ప్రవాసులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అమెరికాలోని ప్రవాస తెలంగాణవాసుల మద్దతు ఉద్యమానికి జాతీయ స్థాయిలో బలం చేకూర్చింది.
స్వరాష్ట్రంగా ఏర్పడ్డాక కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి సాధించింది. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ ప్రజల బతుకులూ బాగుపడ్డాయి. అదేవిధంగా ప్రవాస తెలంగాణవాసులకు గౌరవం దక్కింది. పార్టీని విశ్వవ్యాప్తం చేసే క్రమంలో పార్టీ గ్లోబల్ ఎన్నారై విభాగానికి నాయకత్వం వహించే అదృష్టం నాకు దక్కింది. నాపై నమ్మకముంచి ఈ అమూల్యమైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు పార్టీ అధ్యక్షుడు కేసీఆ ర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈ సందర్భం గా కృతజ్ఞతలు తెలుపుతున్నా. వివిధ దేశాల్లోని తెలంగాణ సంఘాలతో సమన్వయం చేసుకుంటూ నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలిగాను. పార్టీని 52 దేశాలకు తీసుకెళ్లగలిగాం. అంతేకాదు, టీఆర్ఎస్ ఎన్నారై విభాగాల ఆధ్వర్యంలో పార్టీ మద్దతుదారుల సాయం తో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాం. గల్ఫ్ సహా వివిధ దేశాల్లో ఉపాధి నిమిత్తం వచ్చే తెలంగాణ కార్మికులకు అండగా నిలబడ్డం.
దావోస్ సహా ప్రపంచవ్యాప్తంగా జరిగే పెట్టుబడి సదస్సులకు అప్పటి మంత్రి కేటీఆర్‌తో కలిసి హాజరవడం ఎంతో గొప్ప అనుభూతి. ఆయనతోపాటు వివిధ దేశాల్లో పర్యటిస్తూ, అంతర్జాతీయ కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ తెలంగాణ అభివృద్ధికి మా వంతుగా తోడ్పడటం మాకు దక్కిన భాగ్యం. కేటీఆర్ కృషి ఫలితంగా అమెరికాలోని డాలస్, శాన్‌జోస్, వాషింగ్టన్ డీసీ వంటి నగరాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక టెక్ కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, రైట్ సాఫ్ట్వేర్, గ్రీన్ రోబోటిక్స్, ైస్టెరాక్స్ ఫార్మా, జెనెసిస్ బయోలాజిక్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో కొలువుదీరాయి. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, సిద్దిపేట లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమ విస్తరించింది. ఇవి కేవలం పెట్టుబడులు కాదు, యువతకు అవకాశాల వెల్లువ.
ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమం, ప్రగతిని స్మరించుకునేందుకు బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని సంకల్పించాం. ఈ విషయాన్ని పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చించగా ఆయన సమ్మతించారు. కార్యక్రమ నిర్వహణకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు.
2025 జూన్ 1న డాలస్‌లోని డాక్టర్ పెప్పర్ ఎరీనా వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రవాస భారతీయులు, ప్రవాస తెలంగాణ వాసులు, యువత వేలాదిగా తరలి రానున్నారు. ఈ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఏడాది మొత్తం వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ ఎన్నారై విభాగం యోచిస్తున్నది. యూకే, గల్ఫ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తోపాటు వివిధ దేశాల నుంచి సంప్రదిస్తున్నారు. కేటీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో వీలైనన్ని దేశాల్లో ఈ వేడుక నిర్వహించేందుకు ప్రయత్నిస్తాం.
స్వరాష్ట్ర విధాత, అభివృద్ధి ప్రదాత కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలతోపాటు, ప్రవాస తెలంగాణీయులు కూడా భావిస్తున్నారు. అందుకే తెలంగాణ బాగుకోసం మరోసారి కేసీఆర్ అధికారంలోకి రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. రజతోత్సవ సభ సందర్భంగా యావత్ అమెరికా డాలస్ వైపే చూస్తున్నది. డాలస్ మొత్తం కేటీఆర్ వైపే చూస్తున్నది. కేటీఆర్ ప్రసంగం కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సమయమిది. మన భవిష్యత్తును నిర్దేశించే వేడుక ఇది. అందుకే ఈ వేడుకలో అందరూ పాల్గొనాలని విన్నవిస్తున్నా. జై బీఆర్ఎస్! జైజై తెలంగాణ!
– (వ్యాసకర్త: గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్-బీఆర్ఎస్)
మహేష్ బిగాల