జననమే తప్ప మరణం లేనిది, ఆరంభమే తప్ప అంతం లేనిది, సాగడమే తప్ప ఆగడం తెలియనిది దైవత్వం మాత్రమే. అంతటి దైవత్వం కలిగిన నేల మన తెలంగాణ. త్రిలింగ దేశంగా… శాతవాహన, కాకతీయ, గోలకొండ సామ్రాజ్య వైభవాల సీమగా… కృష్ణా, గోదావరుల పవిత్ర ధారగా, సాయుధ పోరాటం మొదలు అహింసా ఉద్యమం దాకా, 1969 అస్తిత్వ నినాదం మొదలు 2014 గమ్యం ముద్దాడేదాకా వెన్నుచూపని ధీరోదాత్తుల మేలు కలయిక తెలంగాణ. ఎప్పుడు అరాచక శక్తులు తమ కుట్రలతో అధర్మాన్ని ఆచరించినా ఇక్కడ తిరగబడే తత్తం ప్రతిఘటిస్తుంది. ఇది చరిత్ర పొడవునా తెలంగాణ నేలపై ఆనవాళ్లయి మనకు కనిపిస్తూనే ఉంటుంది. 1947న స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పొంది యావత్ భారతావని ఆనందడోలికల్లో ఊగుతుంటే తెలంగాణ సాయుధ పోరాటమై చెలరేగి 1952, మార్చి 6 వరకు తన తిరుగుబాటును చేస్తూనే ఉన్నది. అనంతరం భాషా ప్రయుక్త రాష్ర్టాల పేరుతో మనలను కబళించి మోసాలు చేస్తుంటే 1969 ఉద్యమమై ఎగిసి తెలంగాణ తెగువ ఏమిటో ప్రపంచానికి చాటింది.
అదే పరంపరలో సమైక్య పాలకుల ఆగడాలతో ఆగమైపోతున్న సందర్భంలో, ఓవైపు పంటలు లేక, చేయడానికి పనిలేక, వలసల్లో తెలంగాణ సలసల మాడుతున్న సమయంలో అగ్నికి ఆజ్యం పోసినట్టు వలస పాలకులు కరెంటు చార్జీలను పెంచి, కాల్పులతో ముగ్గురిని పొట్టన పెట్టుకున్న 2000 దశకంలో ప్రజా నిరసనలు మిన్నంటాయి. దాని పర్యవసానమే 2001, ఏప్రిల్ 27న జలదృశ్యంలో ఆవిష్కృతమైన మహోన్నత ఘట్టం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భావం. ఆనాడే తన శాసనసభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు అన్నింటినీ వదిలేసి ఓ నవయువ పోరాటానికి నాందిగా బీజం వేస్తూ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు కేసీఆర్.
అది మొదలు తెలంగాణ చరిత్ర, తెలంగాణ రాష్ట్ర సమితి చరిత్ర రెండూ వేర్వేరు కావని ప్రపంచానికి చాటారు. పార్టీ ప్రారంభించిన రోజుల వ్యవధిలోనే 2001, మే 17న కరీంనగర్లో సింహగర్జన సభతో తెలంగాణ బలమేంటో ప్రపంచానికి చాటారు. ఆ తర్వాత వరుసగా జూన్ 1న పాలమూరులో, 2న నల్గొండలో, 4న నిజామాబాద్‌లో, 5న నిర్మల్‌లో, 21న వరంగల్లులో అతి తక్కువ సమయంలోనే ఎవరికీ సాధ్యం కానివిధంగా భారీ సభలను నిర్వహించి తెలంగాణ భావజాల వ్యాప్తిని యావత్ రాష్ట్రం మొత్తం ప్రవహింపజేశారు కేసీఆర్. తన దీటైన మాటతీరు, అనర్ఘళ నిజాల వాగ్ధాటితో ప్రజలకు తెలంగాణ ఆవశ్యకత అర్థమైంది. దాని పర్యవసానమే పార్టీ పెట్టిన మూడు నెలల్లోనే స్థానిక సంస్థల్లో జయకేతనం ఎగురవేసి ఏకంగా నాలుగు జెడ్పీలను టీఆర్ఎస్ కైవసం చేసుకున్నది.
ఉద్యమంలో తుది అంకం ప్రారంభమైంది కేసీఆర్ నిరాహార దీక్షతోనే. అప్పటివరకూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని,సమైక్యవాదుల కుట్రలను తట్టుకుంటూ, వలసవాదుల ఆర్థిక ఉన్మాదాలతో అణచివేయాలని చేసిన పన్నాగాలను పసిగడుతూ నిరంతరం అప్రమత్తమై కేసీఆర్ చేసిన పోరాటం యావత్ ప్రపంచ చరిత్రలోనే అత్యున్నత పోరాటాల సరసన నిలుస్తుంది. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వంటి యోధులకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో అహింసాయుత పోరాటంతో తెలంగాణ బాపుగా మారారు కేసీఆర్.
చివరికి ప్రాణార్పణకు సిద్ధమై సిద్దిపేట వేదికగా 2009 నవంబర్ 29న తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు కరీంనగర్ నుంచి బయల్దేరిన కేసీఆర్‌ను ఖమ్మం జైలుకు, నిమ్స్ ఆస్పత్రికి తరలించిన ఆ 11 రోజుల పాటు తెలంగాణ అగ్నిగుండమై ఎగిసింది. ఆ దీక్షా దివస్ స్ఫూర్తి నేటికీ, ఏనాటికీ కొనసాగుతూనే ఉంటుంది. దాని పర్యవసానమే డిసెంబర్ 9 ప్రకటన. అనంతరం డిసెంబర్ 23 విద్రోహ దినం రోజున సైతం ఎంతో సంయమనంతో యావత్ తెలంగాణను ఏకం చేసేలా కేసీఆర్ చాకచక్యంగా వ్యవహరించారు. 11 రోజుల నిరాహార దీక్ష అలసటను సైతం పక్కనపెట్టి జేఏసీ ఏర్పాటు మొదలు చరిత్ర కనీ వినీ ఎరుగని పోరాట రూపాలను ప్రపంచానికి పరిచయం చేశారు. మానవహారం, సాగరహారం, మిలియన్ మార్చ్, రైల్ రోకో, వంటా వార్పు, ఉస్మానియా, కేయూల గర్జన, మానుకోట ధిక్కారం, సకలజనుల సమ్మె వంటి చారిత్రాత్మక ఘట్టాలతో… ఉప ఎన్నికల ఫలితాలతో శ్రీకృష్ణ కమిటీ మధ్యే మార్గాలను పటాపంచలు చేస్తూ హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను దేశ యవనికపై 29వ రాష్ట్రంగా సుస్థిరం చేశారు కేసీఆర్.
ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ మెజారిటీ గెలుపుతో స్వపరిపాలనకు బీజం వేశారు కేసీఆర్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పాలన ప్రారంభించిన కేసీఆర్ ఏ లక్ష్యాల కోసం తెలంగాణ తెగించి కొట్లాడిందో వాటన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చారు. చుక్క నీటి కోసం అల్లాడిన నేలపై కాళేశ్వర గంగను పరవల్లెత్తించి కోటి ఎకరాలకు పైగా మాగాణాన్ని సృష్టించారు.
తెలంగాణే శ్వాసగా బతికే బాపు అధికారంలో ఉన్నన్నాళ్లు ఇక్కడ దోపిడీ చేయలేమని గ్రహించిన వలసవాద కుట్రలు పెచ్చరిల్లి, ప్రజల సహజ వ్యతిరేకతను రెచ్చగొట్టేలా చేసిన అబద్ధాల ప్రచారం, దాని పర్యవసానం నేడు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. అధికారం కోసం కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు హామీలు నీటిమూటలయ్యాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే చెరసాలలు దిక్కవుతున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతతో నీటి ఊటలు తగ్గి, కరెంటు కోతలు పెరిగి అన్నదాత ఆగమవుతున్నాడు. ఉపాధి దొరుకక, బతుకుదెరువు లేక మళ్లీ వలస తెలంగాణమౌతుంది. అధర్మం విలయతాండవం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే అధర్మం పెచ్చరిల్లినప్పుడు ధర్మ సంస్థాపన జరిగే తీరుతుంది. నేడు తెలంగాణలో సైతం రాబోయే రోజుల్లో అదే జరుగుతుంది. తెలంగాణ బాపు కేసీఆర్, తెలంగాణ ఆత్మ బీఆర్ఎస్. మళ్లీ మన కోసం తిరిగొస్తారు. సంక్షేమం, అభివృద్ధి కలబోతైన తెలంగాణగా తీర్చిదిద్దుతారు. జై కేసీఆర్, జై బీఆర్ఎస్. ఇలా టీఆర్ఎస్గా మొదలై బీఆర్ఎస్గా ప్రస్థానం కొనసాగిస్తున్నా… 25 ఏండ్లుగా తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ సాధించి, అభివృద్ధి చేసి తెలంగాణను దేశంలోనే శిఖరాగ్రాన నిలిపి ఎన్నో విజయాలు అందించిన బీఆర్ఎస్ రజతోత్సవం, తెలంగాణకే విజయోత్సవం.
(వ్యాసకర్త: బందూక్-చిత్ర దర్శకులు, సామాజికవేత్త)
-లక్ష్మణ్ మురారిశెట్టి
90119 66666