తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 14 ఏండ్లపాటు ఉద్యమించి, కేంద్రంతో కొట్లాడి సాధించుకొన్న తెలంగాణను ఈ పదేండ్లలో సాగు, తాగునీరు, మౌలిక వసతులు, సబ్బండ వర్గాల అభివృద్ధి, యువతకు ఉద్యోగావకాశాలు, దేశంలోనే మిన్నగా ఐటీ అభివృద్ధి, రైతుల సర్వతోముఖాభివృద్ధి, మహిళాభ్యున్నతి, గ్రామాలు, పట్టణాల అభివృద్ధి…. ఇలా ఏ రంగం చూసిన అభివృద్ధిలో ముందుకుపోతున్న తీరు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ అభివృద్ధి పరుగులు ఆగకుండా ఉండాలంటే.. అందరూ ఆశించిన బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోవాలంటే ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చి, కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడం ఒక్కటే మార్గం.
బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో చూశాక.. తెలంగాణకు బీఆర్ఎస్సే కరెక్ట్ పార్టీ.. కేసీఆరే సరైన ముఖ్యమంత్రి అని మళ్లీ ఒకసారి రుజువైంది. విద్యార్థుల దగ్గర్నుంచి వృద్ధుల వరకు.. నిరుద్యోగుల నుంచి మహిళల వరకు.. దివ్యాంగులు, వితంతువులు, రైతులు, సామాజిక నిమ్నవర్గాలు, ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాలు ఒక్కరేమిటి.. తెలంగాణంతా
ఒకవైపు తన హామీలను ఇంకోవైపు తక్కెడలో సరిగ్గా తూచి అందరికీ సమన్యాయం చేశారు. ఇంతకన్నా గొప్ప మ్యానిఫెస్టో ఉంటుందా? దీన్ని ఇతర రాష్ర్టాలు.. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం రూలింగ్ నేషనల్ పార్టీ దేశ ప్రజల కోసం కాపీ పేస్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. అంతకుముందు కేసీఆర్ రైతుబంధు, రైతుబీమాను హైజాక్ చేస్తే, ఇప్పుడు కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న విషయం దేశ ప్రజలందరికీ తెలిసిందే! తెలంగాణలోని కేసీఆర్ పథకాలు.. పారదర్శక పాలన చూసే కదా.. ప్రజలు దేశానికీ కేసీఆర్‌లాంటి నాయకుడు.. లాంటి ఏంటీ.. కేసీఆరే కావాలని కోరుకున్నారు! ఇప్పుడు ఈ మ్యానిఫెస్టో చూసి ఇప్పుడైతే కచ్చితంగా కేసీఆరే ప్రధాని కావాలని డిమాండ్ చేసి.. ఆ డిమాండ్‌ను రేప్పొద్దున లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లుగా కురిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజానికి ఆ పదవికి అన్ని అర్హతలు, సమర్థత ఉన్న నాయకుడు కేసీఆర్.
హామీలు.. పథకాలు ప్రకటించడమేకాదు వాటిని ప్రాక్టికల్‌గా అమలు చేసిన ముఖ్యమంత్రి ఆయన. కిందటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలనూ తప్పలేదు. అనేకం ఇవ్వని హామీలను కూడా అమలు చేసి చూపెట్టిన సమర్థత ఆయనది. రాష్ర్టాన్ని దేశానికే అన్నపూర్ణ చేస్తానని చెప్పి చేసి చూపించారు. అవినీతి నలుచదరంగా.. అభివృద్ధి ఏకపక్షంగా, 300 డిగ్రీల్లో అశాంతి.. 60 డిగ్రీల్లో భద్రత, ముప్పాపు పాళ్లు ఆర్జన.. ఒక పాలు పాలన ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. తెలంగాణకు ఏనాడు మాడల్ కాదని.. కారాదని తెలంగాణ పోరాటానికి నడుం కట్టినప్పుడే నిశ్చయించుకున్నారు. అందుకే బంగారు తెలంగాణకు పక్కా పథకం రూపొందించారు. అధికారం చేపట్టిన తొలిరోజు నుంచి నేటివరకు దానికోసమే పాటుపడుతున్నారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆయన చేసిన పని.. పాలనను పారదర్శకం చేయడం. అందుకు ఆయన ఎంచుకున్న మార్గం.. పాలనలో అందరినీ భాగస్వామ్యం చేయడం. అయిన వాళ్లకు కంచాలు..కాని వాళ్లకు ఆకులుగా లేదు ఆయన ప్రవర్తన. అసలు అయిన వాళ్లు.. కాని వాళ్లనే తేడానే రానివ్వలేదు. తెలంగాణకు ఓ తండ్రిలా నిలబడ్డాడు. కుటుంబ పెద్దలా బాధ్యతనే నిర్వర్తించారు, తప్ప హక్కును ప్రదర్శించలేదు.
రెండు విడతలు ప్రజాభిమానంతో ముఖ్యమంత్రి అవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అదే వెల్లువ.. మూడో విడతకూ కొనసాగడమంటే అంత ఈజీ కాదు. కానీ తెలంగాణపట్ల తనకున్న కమిట్మెంట్.. అంతకేమాత్రం తగ్గని కార్యాచరణతో సాధ్యం చేసుకుంటున్నారు కేసీఆర్. ఎంతలా అంటే ఆ కార్యదీక్ష దేశానికీ ఉపయోగపడితే బాగుండు అని దేశప్రజలు కోరుకునేంతగా!!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏనాడు తెలంగాణ దళిత, బహుజనులకు లభించని పదవులను తెలంగాణలో వాళ్లకు అందేలా చేశారు కేసీఆర్. అసెంబ్లీ స్పీకర్‌గా బీసీ (మధుసూధనాచారి)ని నియమించారు. శాసన మండలికి ఒక బీసీ (స్వామిగౌడ్)నే చైర్మన్‌గా చేశారు. అంతేనా.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా ఒక దళితుడి (ఘంటా చక్రపాణి)కి అవకాశం ఇచ్చారు. అదే కోవలో తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు చైర్మన్‌గా జస్టిస్ డాక్టర్ చంద్రయ్యను, లోకాయుక్తగా జస్టిస్ రాములు, స్టేట్ చీఫ్ ఇన్మర్మేషన్ కమిషనర్‌గా సదారామ్‌ను నియమించారు. ఇలా రాజ్యాంగబద్ధమైన పదువులనే కాదు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతోపాటు కార్పొరేషన్ల చైర్మన్ హోదాలనూ, జిల్లాల్లో ఇంకెన్నో పదవులనూ దళితబహుజనులకు ఇచ్చారు. మొదటిసారిగా హైకోర్ట్‌లో అడ్వొకేట్ జనరల్‌ను బీసీని నియమించి, తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్‌గా ప్రొఫెసర్ అర్ లింబాద్రి (దళితుడు)ని నియమించి ఇలాంటి ఎన్నో పదవుల్లో వర్ణ, వర్గ భేదాల్లేకుండా సమతుల్యం పాటిస్తున్నారు. నాటి నుంచి అణగారిపోతున్న సామాజిక వర్గాలకు సాధికారత కల్పిస్తున్నారు. వాళ్ల హక్కులను గౌరవిస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతున్నారు.
ఇతర పార్టీల్లో కీలకమైన పాత్ర పోషిస్తూ తెలంగాణ అంశంలో ఆ పార్టీలో గుర్తింపు దక్కని కే కేశవరావును తన పార్టీకి పెద్ద దిక్కుగా గౌరవిస్తున్నారు. అంతర్గత రాజకీయాలు.. కుతంత్రాలను ఎదుర్కోలేక అవమానపడిన డీ శ్రీనివాస్‌కు తన పార్టీ గొడుగు పట్టారు. సీనియర్ నేతగా సముచిత స్థానం కల్పించారు. ఆ పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఉదాహరణ.. దాసోజు శ్రవణ్‌కుమార్, పొన్నాల లక్ష్మయ్యలే! వివిధ పార్టీలను వీడిన ఆ నేతలనూ సాదరంగా ఆహ్వానించారు. దాసోజును పెద్దల సభకు పంపేందుకు ప్రయత్నించారు. సీపీఎం అవమానపరిచిన నోముల నర్సింహయ్యకు పెద్దపీట వేశారు. టీడీపీని వదిలన నేతలకూ పార్టీ పదవులు ఇచ్చి.. వారి శక్తిసామర్థ్యాలను రాష్ర్టాభివృద్ధికి ఉపయోగించుకొంటున్నారు. వారి నిజాయతీని శంకించలేదు. అవమానపరచలేదు.
అచ్చట పూచిన చిరుకొమ్మయిన చేవ అన్నట్టు తెలంగాణలోని ప్రతి సామాజిక కార్యకర్త, ప్రతి పోరాట వీరుడు. ప్రతి మేధావి, ఆలోచనా రాష్ర్టాభివృద్ధికి తోడయ్యేలా చూడటంలో తనకు సాటిలేరని కేసీఆర్ నిరూపించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో తనతో నడిచిన .. తనకు బాసటగా నిలబడ్డ విద్యార్థి సంఘాలనూ మరువలేదు. వారి సేవలకూ గుర్తింపునిచ్చారు. నిజానికి ఎవరినీ నొప్పించక.. అందరినీ ఒప్పించడమనేది ఉద్యమ నేతగా.. తెలంగాణ సాధన కర్తగా.. తెలంగాణ అభిమాన ముఖ్యమంత్రిగా ఆయనకు పెద్ద టాస్కే. సాధ్యంకాని విషయమే! అయినా సుసాధ్యం చేసి చూపించారు.
కులం, మతం, వర్గం అనే తారతమ్యాల పునాదుల మీదే నిర్మాణమైన దేశం మనది. ఆ వివక్షతోనే కొనసాగే సంస్కృతి ఈ దేశానిది. ఆ మూసలోంచి తెలంగాణను తప్పించి, తారతమ్యాల సవాలులను అందరికీ ప్రాధాన్యం అనే సొల్యూషన్‌తో ఎదుర్కొన్న నేత కేసీఆర్. ఆ సమీకరణల కోసం ప్రత్యేక తెలంగాణ పోరాటం నుంచే కసరత్తు మొదలుపెట్టారు. తెలంగాణ ఏర్పడ్డాక అమలుకు శ్రీకారం చుట్టారు. వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు అంటేనే ఆ యుద్ధంలో గెలిచినట్టు లెక్క. మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజాభిమానం ఓటుగా పోటెత్తబోతోంది అంటే కేసీఆర్ తెలంగాణకు ఇచ్చిన.. ఇస్తున్న భద్రత, భరోసా మీద ప్రజలకున్న అపార విశ్వాసం కింద లెక్క. ఆ విశ్వాసం తెలంగాణ ప్రజల ఆత్మవిశ్వాసం.. ఆత్మగౌరవానికి ప్రతీక!!
డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
92465 26899